ETV Bharat / state

సమగ్ర భూముల రీసర్వేకు యంత్రాంగం సిద్ధం

author img

By

Published : Sep 30, 2020, 7:30 PM IST

రాష్ట్రంలో సమగ్ర భూముల రీసర్వే ప్రక్రియను 2021 జనవరి నుంచి నిర్వహించనున్నారు. దీనికి నెల్లూరు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో గ్రామ సర్వేయర్లకు రెండో విడత శిక్షణ కొనసాగుతుంది.

lands resurvey
lands resurvey

నెల్లూరు జిల్లాలో సమగ్ర భూముల సర్వేకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. 2021 జనవరి1 నుంచి ప్రారంభం అయ్యే రీసర్వే కోసం గ్రామ సర్వేయర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 46 మండలాలు, 1201 గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో 4,56,000 సర్వే నంబర్లలో 13,16,144 హెక్టార్ల భూమిని సమగ్రంగా సర్వే చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో 300 గ్రామాలు, రెండో దశలో 420 గ్రామాలు, మూడో దశలో 481 గ్రామాలు సర్వే చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ప్రతి సర్వేకి 6 నెలలు గడువు తీసుకుంటారని అధికారులు వెల్లడించారు.

సర్వే సిబ్బంది నియామకం

భూముల రీ సర్వేలో అటవీ భూములు మినహాయింపు ఇస్తారు. ప్రభుత్వ పట్టాభూములు, మాగాణి, మెట్ట, రోడ్లు, డొంక భూములను కొలుస్తారు. రెండేళ్లలో సమగ్రంగా సర్వేని పూర్తి చేసి ఆన్​లైన్ చేయాల్సి ఉంది. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పని చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఐదు డివిజన్ల వారిగా సర్వే సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం 537మంది గ్రామ సర్వేయర్లు ఉన్నారు. మరో 109 మంది సర్వేయర్లను నియామకం చేసుకుంటారు. ఆర్డీవోలు, మండల తహసీల్దార్, ఏడీ డిప్యూటీ ఇన్స్​పెక్టర్ ఆఫ్ సర్వే, ఏడీ సర్వేయర్లు పర్యవేక్షిస్తారు.

అధునాతన పరికరాలతో...

646 మంది సర్వేయర్లు అధునాతన పరికరాలతో సమగ్ర భూముల సర్వే చేపడతారు. ఇప్పటి వరకు చైన్లతో భూములను కొలిచే పద్ధతులకు స్వస్తి పలకనున్నారు. కంటిన్యుటీ ఆపరేటింగ్ రిమోట్ సిస్టంకు (సీవోఆర్​ఎస్) శాటిలైట్​ను అనుసంధానం చేస్తారు. ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్), డీజీపీ (డిఫరెన్సియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టం) పరికరాలను వినియోగిస్తారు. ఈ విధానంలో తక్కువ సమయంలో ఒకే సారి 150 ఎకరాలను కొలవవచ్చు.

భూ తగాదాలు లేని ప్రజా వ్యవస్థను నిర్మించడం రీసర్వే లక్ష్యం. భూమి స్వభావం, సాగు చేసే పంటలు, యజమాని వివరాలు సేకరిస్తారు. భూముల చుట్టూ రాళ్లు బిగిస్తారు. సర్వే అనంతరం రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేసి సెటిల్​మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా విలేజ్ మ్యాప్ తయారు చేస్తారని అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.