ETV Bharat / state

మంత్రి కాకాని ఫ్లెక్సీ తొలగింపు..!

author img

By

Published : Apr 16, 2022, 7:25 PM IST

నెల్లూరు వైకాపాలో వర్గ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి - మాజీ మంత్రి అనిల్ మధ్య ఉన్న విభేదాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. మంత్రి కాకాని ఫ్లెక్సీని తొలగించడం వివాదానికి దారితీసింది.

మంత్రి కాకాని ఫ్లెక్సీ తొలగింపు..!
మంత్రి కాకాని ఫ్లెక్సీ తొలగింపు..!

నెల్లూరు జిల్లా వైకాపాలో ఇప్పటికే వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. అది ఏ క్షణమైనా భగ్గుమనే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. మంత్రి కాకాని గోవర్ధనే రెడ్డి ఫ్లెక్సీని అధికాలు తొలగించారు. వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. తొలిసారిగా కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాకు వెళ్తున్నారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 17) మంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో.. అక్కడి మంత్రి అనుయాయులు భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేశారు.

ఇందులో భాగంగా.. కావలి నుంచి నెల్లూరు నగరం వరకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట హరనాథ్ పురం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి తొలగించారు. దీంతో.. వైకాపాలో దుమారం చెలరేగింది. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎదురుగా వంతెనపై కాకానికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీని భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని జాతీయ రహదారుల అధికారులు క్రేన్ తో తొలగించారు. అనంతరం పక్కనే ఉన్న కాలువగట్టుపై ఆ ఫ్లెక్సీని పడేశారు. దీంతో.. మరోవివాదానికి అవకాశం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత నెల్లూరు వైకాపాలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ జిల్లానుంచి మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్‌.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో పదవి పోగొట్టుకున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆయన స్థానాన్ని భర్తీచేశారు. వీరిమధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయని, కేబినెట్ పరిణామాలు వీటిని మరింత రాజేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

రెండింతలు ఇస్తానన్న అనిల్ : మంత్రికాకాని, మాజీ మంత్రి అనిల్ మధ్య ఉన్న విభేదాల చర్చ.. మూడు రోజుల నుంచి ఎక్కువైంది. మంత్రి కాకాణికి సహకారం అందిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అనిల్‌ తనదైన శైలిలో స్పందించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కాకాణి తనను ఆహ్వానించలేదని చెప్పారు. పిలవకుండా తాను ఎందుకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఆంతేకాకుండా.. వ్యంగ్య బాణాలూ విసిరారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి ఎలాంటి సహకారం అందించారో.. తనపై ఎలాంటి ప్రేమ చూపారో.. కచ్చితంగా అదే ప్రేమ, సహకారం రెండింతలు అందిస్తానని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. దీంతో.. నెల్లూరు వైకాపాలో గ్రూపు రాజకీయాలు రంజుగా మారబోతున్నాయనే చర్చ మొదలైంది.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.