ETV Bharat / state

ఎమ్మెల్యే కోటంరెడ్డి గాంధీ గిరీ.. పోస్టుకార్డు ఉద్యమం షురూ.. ఎందుకంటే..?

author img

By

Published : Apr 12, 2023, 7:02 PM IST

Bara Shaheed: నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషాహీద్ దర్గా అభివృద్ధి కోసం గాంధీగిరి పద్ధతిలో ఉద్యమిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. బారాషాహీద్ దర్గాను సందర్శించి ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే.. పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 15 కోట్ల రూపాయలు నిధుల మంజూరు విషయంలో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

Kotamreddy Sridhar Reddy
బారాషాహీద్ దర్గా

Kotamreddy Sridhar Reddy : మొన్న జలదీక్షతో రోడ్డు సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ బహిషృత నేత.. నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నేడు మరోమారు గాంధీ గిరి పేరుతో సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సారి బారాషాహీద్ దర్గాకు సంబంధించిన పనుల విషయంలో ప్రభుతం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. దర్గా కోసం సీఎం జగన్ 15 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పి 9నెలలు గడుస్తున్నా.. ఆర్థిక శాఖ డబ్బలు విడుదల చేయకపోవడంతో దర్గా పనులు ఆగిపోయినట్లు తెలిపారు. దర్గా పనులు కోసం ప్రభుత్వాన్ని కదిలించడానికి సంతకాల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే

నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషాహీద్ దర్గా అభివృద్ధి కోసం గాంధీగిరి పద్ధతిలో ఉద్యమిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. బారాషాహీద్ దర్గాను సందర్శించి ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే, పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దర్గా అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ అప్పట్లో చెప్పారని వెల్లడించారు. తొమ్మిది నెలల క్రితమే జీవోను విడుదల చేశారని తెలిపారు. జీవో విడుదల చేసినా, దానికి ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడంతో నిధులు విడుదల కాలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో తాము ఆర్భాటంగా ఏడున్నర కోట్ల రూపాయలతో మసీదు నిర్మాణం, మరో ఏడున్నర కోట్ల రూపాయలతో దర్గా అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందించామన్నారు.

కాంట్రాక్టర్లను బ్రతిమిలాడితే దర్గా అభివృద్ధి పనులు చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. మసీదు నిర్మాణానికి నాలుగు సార్లు టెండర్లు పిలిచినా.. ఒక్కరు కూడా ముందుకు రాలేదని కోటంరెడ్డి పేర్కొన్నారు. నిధులు విడుదల కాకపోవటంతో దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం నిధులు విడుదల చేయాలని కోరుతూ పోస్ట్ కార్డులు, ఫోన్ మెసేజ్ ల ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి విన్నపాలు పంపుతున్నామని కోటంరెడ్డి తెలిపారు. నెలరోజుల వ్యవధిలో లక్ష విన్నపాలను ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కార్యదర్శికి పంపుతామని కోటంరెడ్డి పేర్కొన్నారు.

'బారాషాహీద్ దర్గా అభివృద్ధి కోసం 15 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవో విడుదల చేశారు. ఇప్పటివరకూ ఆర్థిక శాఖ అనుమతి లేదు. దర్గా పనులు చేయడానికి కాంట్రాక్టర్స్ ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది. నాలుగు సార్లు టెండర్లు పిలిస్తే.. అతి కష్టంపై ఒక్క కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు కొన్ని పనులు చేసినా బిల్లులు ఇవ్వడం లేదు. బారాషాహీద్ దర్గా పనుల కోసం లక్ష మందితో వివిధ రూపాల్లో విన్నపాలు పెట్టేందుకు కార్యచరణ చేపట్టాలని నిర్ణయించాం. ఈ నెలరోజుల పాటు సంతకాలు, వాట్సప్... వివిధ రూపాల్లో గాంధీ గిరి ద్వారా దర్గా అంశంపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు ప్రయత్నాలు చేస్తాం.'- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.