ETV Bharat / state

నేరాల నియంత్రణ వదిలేసి ప్రతిపక్ష నేతలే లక్ష్యమా..? టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత

author img

By

Published : Apr 12, 2023, 3:27 PM IST

TDP Anitha Letter to NCW and DGP: టీడీపీ మహిళా నేత ముల్పూరి కల్యాణి అక్రమ అరెస్టుపై చర్యలు కోరుతూ.. జాతీయ మహిళా కమిషన్, డీజీపీకి వంగలపూడి అనిత లేఖ రాశారు. వైసీపీ సర్కారు పోలీసులను ఉపయోగించి నేరాల నియంత్రణకు బదులుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆమె మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..

TDP Anitha Letter to NCW and DGP
డీజీపీకి వంగలపూడి అనిత లేఖ

TDP Anitha Letter to NCW and DGP: వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నేరాల నియంత్రణకు బదులుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. టీడీపీ మహిళా నేత ముల్పూరి కల్యాణి అక్రమ అరెస్టుపై చర్యలు కోరుతూ.. జాతీయ మహిళా కమిషన్ (ఎన్​సీడబ్ల్యూ), డీజీపీకి ఆమె లేఖ రాశారు. గత మూడున్నరేళ్లలో డ్రగ్స్ నేరాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని, మాదకద్రవ్యాల దుర్వినియోగంతో పాటు మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేస్తే తమ పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి.. ముల్పూరి కల్యాణిని నిందితురాలిగా చేర్చారని అనిత ధ్వజమెత్తారు. ఏప్రిల్ 10వ తేదీన గన్నవరం, హనుమాన్ జంక్షన్ పోలీసులు కల్యాణి ఇంట్లోకి చొరబడి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారని ఆక్షేపించారు. దుస్తులు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదని.. తమ సమక్షంలోనే దుస్తులు మార్చుకోవాలని బలవంతం చేశారని ఆమె ఆరోపించారు.

పోలీసులు ఇలా వ్యవహరించటం కల్యాణి వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అని అనిత మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు.. మహిళలపై నేరాలు కట్టడి చేసే బదులు ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర డీజీపీకి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని అనిత విమర్శించారు. ఇప్పుడు కల్యాణి అక్రమంగా అరెస్టు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అనిత కోరారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఇదీ జరిగింది.. కాగా రెండు రోజుల క్రితం ఏప్రిల్ 10వ తేదీన తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో ఫిబ్రవరి 20న టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన రెండు కేసుల్లో కల్యాణి నిందితురాలిగా ఉన్నారు. కల్యాణికి ముందస్తు బెయిల్ రాకపోవటంతో అప్పట్నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. ఆమె హనుమాన్ జంక్షన్​లోని తన నివాసంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావటంతో తెల్లవారుజాము నుంచే కల్యాణి ఇంటిని ముట్టడించి.. అదుపులోకి తీసుకున్నారు.

కల్యాణిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య వాగ్యాదం చోటుచేసుకుంది. కల్యాణిని అరెస్టు చేసేందుకు ఇంటికి వచ్చిన పోలీసులను లోపలికి వెళ్లనివ్వకుండా.. ఆమె కుటుంబ సభ్యులు కాసేపు అడ్డుకున్నారు. ఎట్టకేలకు కల్యాణి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి లోపల కూడా కాసేపు పోలీసులకు, కల్యాణి కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. కల్యాణిని తీసుకెళ్లేందుకు మహిళా పోలీసులు ప్రయత్నించారు. ఆమె దుస్తులు మార్చుకుని వస్తానని పోలీసులకు చెప్పారు. అనంతరం పోలీసులు కల్యాణిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.