రామయపట్నం పోర్టుకు వాహనాల్లో ఓవర్​లోడ్​తో గ్రానైట్ తరలింపు.. చర్యలేవి..?

author img

By

Published : Jan 8, 2023, 8:44 AM IST

Updated : Jan 8, 2023, 11:04 AM IST

ramayapatnam port

Ramayapatnam Port: నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి లారీల్లో పరిమితికి మించిన గ్రానైట్‌ రాయి తరలిస్తున్నారు. అధికార పార్టీలో కీలక వ్యక్తికి అల్లుడు గుత్తేదారుడుగా ఉన్నాడు. అధికారులు సైతం అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధిక లోడుతో రాయి తరలిస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. గ్రామీణ రహదారులను ధ్వంసం చేస్తున్నారు. రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతోంది.

Ramayapatnam Port: నెల్లూరు జిల్లా రామాయపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ ఓడరేవు నిర్మాణానికి సీఎం జగన్ గతేడాది భూమి పూజ చేశారు. ఈ పోర్టు నిర్మాణ పనులను వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరబిందో ఇన్‌ఫ్రా కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే పోర్టు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ముందుగా సముద్ర తీరంలో కొంతదూరం ఇసుక తొలగించి వాహనాలు వెళ్లేందుకు వీలుగా గ్రానైట్‌ రాళ్లతో నింపే పనులు సాగుతున్నాయి. దీనికోసం 80 లక్షల టన్నుల గ్రానైట్‌ రాయి అవసరం కాగా.. చీమకుర్తిలోని గ్రానైట్‌ వ్యర్థాల డంప్‌ల నుంచి 12 లక్షల టన్నులు తీసుకెళ్లడానికి అనుమతులు తీసుకున్నారు. అరబిందో ఇన్‌ఫ్రాకు చెందిన 170కి పైగా పెద్ద సైజు టిప్పర్లు నిత్యం ఈ రాళ్లను రామాయపట్నం తరలిస్తున్నాయి. అధిక లోడుతో రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్న ఈ టిప్పర్లు ఢీకొని ఇప్పటికే ముగ్గురు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారు చాలామంది ఉన్నారు.

తప్పుడు లెక్కలు: జాతీయ రహదారిపైనా ఈ టిప్పర్ల టైర్లు పేలి నిలిపోతుండటంతో సంతనూతలపాడు, చీమలమర్రి ప్రాంతాల్లో తరుచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. అధిక లోడుతో వెళ్తున్న ఈ వాహనాలను రవాణాశాఖ అధికారులు ఆపినా.. ఓడరేవుకు అని చెప్పగానే వదిలేస్తున్నారు. వాటిని ఆపితే ఇక్కడ విధులు నిర్వహించలేమని కొందరు అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఒక్కో టిప్పర్‌ 24 నుంచి 28 టన్నుల వరకు రాయి తీసుకెళ్లాల్సి ఉండగా 40 టన్నుల వరకు తరలిస్తున్నారు. రాయల్టీ రూపంలో క్యూబిక్‌ మీటరుకు 90 రూపాయలు , టన్నుకు 110 చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటికే 6 లక్షల టన్నుల రాయి తరలించగా అధికారులు మాత్రం 4 లక్షల టన్నులే తరలించినట్లు లెక్కలు చెబుతున్నారు. ఆ లెక్కన చూసినా రాయల్టీ రూపంలో 4 కోట్ల40 లక్షలు చెల్లించాల్సి ఉండగా గుత్తేదారు సంస్థ కేవలం 2కోట్ల 66 లక్షలే చెల్లించింది. అధికారులు మాత్రం ఆ సంస్థకు ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలి కదా అప్పుడు చూసుకోవచ్చులే అంటూ తాపీగా చెబుతున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి: లారీల్లో అధిక లోడుతో తరలించడంతో ప్రభుత్వానికి రోజుకు మూడున్నర లక్షల ఆదాయం గండిపడుతోంది. అధికార పార్టీ నేత అల్లుడి కంపెనీ కావడంతో కోట్లలో ప్రభుత్వానికి నష్టం కలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని కొందరు రవాణాశాఖ సిబ్బందికి ఒక్కో వాహనం నుంచి నెలకు 30వేల వరకు ముడుపులు ముడుతున్నట్లు సమాచారం. అధిక లోడుతో వెళ్తున్న ఈ లారీలతో క్వారీల ప్రాంగణంలోని లింకు రోడ్లు, కాలువ కట్ట రహదారులు దెబ్బతింటున్నాయి. దీనిపై ఇటీవల పీసీబీ ప్రజా వేదికలో స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికలోడు వాహనాలపై చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మూడు నెలల్లో 60 కేసులు నమోదు చేశామని త్వరలోనే సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.

రామాయపట్నం పోర్టు నిర్మాణంలో అవకతవకలు

ఇవీ చదవండి:

Last Updated :Jan 8, 2023, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.