ETV Bharat / state

బంధాలను బలిచేస్తూ మానవత్వం కాలరాస్తూ

author img

By

Published : Oct 12, 2020, 1:49 PM IST

హత్యలు జరిగినా.. హత్యాయత్నాలు చోటు చేసుకున్నా.. ఆత్మహత్యలు అయినా.. దాని వెనుక వివాహేతర సంబంధాలే ఎక్కువగా ఉంటున్నాయి. తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య.. భాగస్వామి తప్పు చేస్తుందని భర్త అనుమానంతో ప్రాణాలు తీసే పరిస్థితి ఏర్పడుతోంది. వీరి తగువులతో అమాయక చిన్నారులు బలవుతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఇటువంటి సంఘటనలు ఎక్కువయ్యాయి.

children suffered with their parents mistakes
తల్లిదండ్రుల తప్పుకి బలవుతున్న చిన్నారులు

ఆగస్టు 8న నగరంలోని నవాబుపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ హత్య జరిగింది. భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు. ప్రేమ వివాహం చేసుకున్న వీరి కాపురం కొన్నాళ్లు సజావుగా సాగింది. అనంతరం భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త మృగంలా మారాడు. మద్యం తాగి దాడి చేయడంతో ఆమె మృతి చెందింది.

అనుమానంతో ప్రియుడు తన ప్రియురాలినే అంతమొందించిన సంఘటన ఆగస్టు 24న బాలాజీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడి కోసం భర్త, పిల్లలు, కుటుంబాన్ని వదిలేసి వచ్చిన ఆ యువతిపై రాక్షసుడిలా ప్రవర్తించాడు. దుస్తులు ఆరబెట్టే నైలాన్‌ తాడుతో అతి దారుణంగా హత్య చేశాడు. సంఘటనను ఆత్మహత్యలా చిత్రీకరించిన అతడిని నాయుడుపేట, బాలాజీనగర్‌ పోలీసులు చాకచాక్యంగా పట్టుకోగలిగారు.

భార్య, భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబం వివాహేతర సంబంధంతో ఛిన్నాభిన్నమైంది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు ఆమె భర్తను హత్య చేసిన సంఘటన చిల్లకూరులోని కల్వకుండలో సెప్టెంబర్‌ 27న జరిగింది. మాటు వేసిన నలుగురు యువకులు సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. భర్త మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

తాజాగా నెల్లూరుగ్రామీణ పరిధిలోని నాలుగో మైలులో జరిగిన జంట హత్యలు కలకలం కలకలం రేపుతున్నాయి. ఇద్దరు మహిళలను ఒక వ్యక్తి అతి దారుణంగా హత్య చేయడం వెనక వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త కర్కశంగా వ్యవహరించాడు.

హత్యలు జరిగినా.. హత్యాయత్నాలు చోటు చేసుకున్నా.. ఆత్మహత్యలు అయినా.. దాని వెనుక వివాహేతర సంబంధాలే ఎక్కువగా ఉంటున్నాయి. తన భార్య వేరే వ్యక్తితో పరిచయం పెట్టుకుందని భర్త, తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య.. ఇలా విచక్షణ కోల్పోయి అనుమానం, ఆలోచనారాహిత్యంతో ప్రాణాలు తీసే వరకు వెళుతున్నారు. పవిత్ర వివాహ బంధానికి మాయని మచ్చగా నిలుస్తున్నాయి. ఇటీవల జిల్లాలో పదుల సంఖ్యలో చోటుచేసుకున్న సంఘటనలు ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలతో నేర ప్రవృత్తి పెరిగి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

భార్యాభర్తలు వింత ప్రేమలకు ఆకర్షిలవుతున్నారు. కట్టుకున్న భర్త భార్యను వదిలేసి మరొకరితో పరారవుతుంటే.. భార్య.. వేరొకరితో వివాహేతర సంబంధాలు నెరుపుతుండటంతోనే సమస్యలు మొదలవుతున్నాయి. వీరి గొడవలకు అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలు బలవుతున్నాయి. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. బంధువులు చేరదీయక చిన్నవయసులోనే మానసిక వ్యధను అనుభవిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని స్టేషన్ల పరిధిలో ఇలాంటి కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అనధికారికంగా ఎన్నో..

జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన హత్యాయత్నాల వెనక వివాహేతర సంబంధాలే అధికంగా ఉన్నాయి. గడిచిన రెండు సంవత్సరాల్లో 118 హత్యాయత్నాలు చోటు చేసుకోగా.. 70 శాతం వివాహేతర సంబంధాల కేసులే. ఈ ఏడాది ఆరు నెలల్లో 19 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. వీటిల్లో ఎక్కువగా ఈ నేపథ్యలంలో చోటు చేసుకున్నవేనని పోలీసుల దస్త్రాలు చెబుతున్నాయి. జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లు, కోర్టులు, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో ఏడాదికి దాదాపు 1600 నుంచి 1800 వరకు కేసులు నమోదవుతుండగా.. 30 శాతం జంటలకు విడాకులు మంజూరవుతున్నాయి. అధికారికం కంటే అనధికారికంగా విడిపోతున్న జంటలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయని పోలీసులు వివరిస్తున్నారు.

details of cases
కేసుల వివరాలు

అవగాహన పెరగాలి

భార్యాభర్తల బంధంపై దంపతులిద్దరికీ పరస్పర అవగాహన అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇలాంటి నేరాలు అదుపులో ఉంటాయి. నిత్యం స్టేషన్లకు ఇలాంటి కేసులు వస్తున్నాయి. చాలావాటికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపేస్తుంటాం. తాత్కాలిక ఆకర్షణకు లోనవుతూ వారి జీవితంతో పాటు పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. దీని ప్రభావం సమాజంపై పడుతోంది. వివాహ బంధం విలువను తెలుసుకుని ప్రతిఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అవసరముంది.

- ఉప్పుటూరి నాగరాజు, డీఎస్పీ, దిశ మహిళా పోలీసుస్టేషన్‌

జిల్లాలో ఇప్పటివరకు 14 హత్యలు చోటుచేసుకోగా 11 ఈ కోవకు చెందినవే. 75 హత్యాయత్నాల్లో 53 ఈ నేపథ్యంలోనివే.

ఇదీ సంగతి: అమరావతి గడ్డపైన గడ్డి కూడా తొలగించలేరు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.