ETV Bharat / state

రెచ్చిపోతున్న గ్రావెల్​ మాఫియా.. అధికార పార్టీ అండదండలతో అడ్డగోలు తవ్వకాలు

author img

By

Published : Jun 3, 2023, 4:49 PM IST

illegal soil excavation
నెల్లూరు అక్రమ తవ్వకాలు

Illegal Excavation: అధికార వైసీపీ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు హెచ్చుమీరుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాల్లో గ్రావెల్​ తరలిస్తూ వేల కోట్ల రూపాయల ఆస్థులను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలానే గమ్యంగా చేసుకుని భారీగా మట్టిని తరలిస్తున్నారు.

కోవూరు నియోజవర్గంలో ఇష్టారాజ్యంగా గ్రావెల్ మాఫియా

Illegal Soil Excavation : నెల్లూరు జిల్లా కోవూరు నియోజవర్గంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. నాలుగేళ్లుగా అధికార పార్టీకి చెందిన నాయకులకు గ్రావెల్ అక్రమ తరలింపు ప్రధాన వ్యాపారంగా మారింది. నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసుకుని భారీగా తవ్వేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన గ్రావెల్‌ టిప్పర్‌కు 3500 నుంచి 6 వేల వరకు దూరాన్ని బట్టి అధికార పార్టీ నేతలు విక్రయిస్తున్నారు. భారీగా అక్రమార్జనకు అవకాశం ఉండటంతో నాలుగేళ్లుగా వైసీపీ నాయకులు అనుమతులతో పని లేకుండానే యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తహశీల్దార్‌ కార్యాలయం, పోలీస్ స్టేషన్ మీదుగానే అక్రమ టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నా.. మాముళ్ల మత్తులో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. జమ్మిపాలెం, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, కనిగిరి రిజర్వాయర్, పోలినాయుడు చెరువు ప్రాంతాల్లో తవ్వకాలు అధికంగా చేస్తున్నారని అంటున్నారు. ఈ అక్రమ తవ్వకాల ఫలితంగా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రిజర్వాయర్ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జగనన్న లే ఔట్లలో మెరక చేసేందుకంటూ సాకులు చెబుతూ.. రోజుకు వందలాది టిప్పర్లలో గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో మైనింగ్, రెవెన్యూ అధికారులు కొలతలు తీసి లెక్కకట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ల రాకపోకలకు రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించిన వాటిని సీజ్‌ చేయకుండా తిరిగి స్థానికులపైనే కేసులు పెడుతున్నారని విపక్షపార్టీల నేతలు చెబుతున్నారు.

తవ్వకాలతో 40 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపి వదిలేస్తున్నారని.. వాటి వల్ల భారీగా గోతులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీప గ్రామాల్లోని ప్రజలు ప్రమాదవశాత్తు ఆ గుంతలలో పడితే పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. విచ్చలవిడిగా ప్రకృతి సంపదను తవ్వుతూ.. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని అక్రమార్కులు కొల్లగొడుతున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

"వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రావెల్​ మాఫియా.. వారి ఇష్ట ప్రకారం ఎవరి అనుమతులు లేకుండా గ్రావెల్​ తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులకు మాముళ్లు ఇస్తూ రాత్రి, పగలు తేడా లేకుండా లారీలతో మట్టిని తరలిస్తున్నారు. ఈ లారీల వల్ల రోడ్లు ధ్వంసం చేస్తున్నారు." -శ్రీనివాసులు, స్థానికుడు

"కోవూరు నియోజకవర్గంలో గ్రావెల్​ ఇష్టం వచ్చినట్లుగా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. స్థానిక నాయకులు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ అస్తులను ధ్వంసం చేస్తున్నారు." - కిశోర్​, జనసేన నాయకులు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.