నాసిరకం పనులతో.. వర్షం వస్తేనే జగనన్న కాలనీలు కూలిపోతాయా..?

author img

By

Published : Feb 21, 2023, 7:39 AM IST

Updated : Feb 21, 2023, 9:37 AM IST

Jagananna Colonies
జగనన్న కాలనీలు ()

Jagananna Colonies Poor Condition: పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంలో ప్రచారానికి తగ్గ ప్రమాణాలు.. కనిపించడంలేదు. ప్రభుత్వం నిర్దేశించిన డబ్బుతో నిర్మాణానికి చాలా చోట్ల గుత్తేదారులు ముందుకు రాని పరిస్థితి ఉంటే..పనులు చేస్తున్న చోట నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలేస్తున్నారు. నెల్లూరులోని ఓ లేఔట్‌లో.. కట్టుబడి నాసిరకంగా ఉందని లబ్దిదారులు వాపోతున్నారు.

Jagananna Colonies Poor Condition: నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలోని జగనన్న లేఔట్​లో.. నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 2 వేల 500 ఆవాసాలు నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం లక్షా 80 వేల రూపాయలు వెచ్చిస్తోంది. అది గిట్టుబాటు కావడం లేదనే ఉద్దేశంతో.. పనులు నాసిరకంగా చేస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారు. సిమెంట్‌ తక్కువ.. ఇసుక ఎక్కువగా వేస్తున్నారని, చేతితో రుద్దితోనే.. గోడకు పూసిన సిమెంట్‌ రాలిపోతోందని చెప్తున్నారు.

పిల్లర్లు లేకుండా కేవలం ఫ్లైయాష్‌ ఇటుకలతో కట్టిన.. గోడలపైనే స్లాబు వేస్తున్నారు. ఆ ఫ్లైయాష్‌ ఇటుకలు కూడా కిందపడితే పొడి అవుతున్నాయని, ఇలాంటి నాసిరకం పనులతో.. ఇల్లు పటిష్ఠంగా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ పనుల్లో కనీస ప్రమాణాలు పాటించడంలేదనే విమర్శలు.. వెల్లువెత్తుతున్నాయి. స్లాబ్‌ పూర్తి చేశాక 15రోజుల పాటు తడపాలని.. నీళ్లు అందుబాటులో లేవనే సాకుతో ఒకటి రెండు రోజులు మాత్రమే మొక్కుబడిగా తడుపుతున్నారని.. లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గృహప్రవేశానికి ముందే కొన్ని గోడలు, స్లాబ్‌లు బీటలు వారుతున్నాయని మండిపడుతున్నారు.

పేదలందరికీ ఇళ్ల పథకం కింద.. నెల్లూరు జిల్లాలో 69వేల 116గృహాలు మంజూరుచేశారు. 56 వేల 223గృహాల పనులు మొదలుపెట్టారు. ప్రభుత్వం 97మంది గుత్తేదారులకు 21 వేల 414ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. లబ్ధిదారులతో సంబంధం లేకుండా.. గుత్తేదారులు నిర్మాణాలు చేస్తున్నారు. ఈ లెక్కన పెద్ద ఎత్తున నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా 51 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. అవీ నాసిరకంగా నిర్మించడం.. లబ్దిదారుల్ని అసంతృప్తికి గురిచేస్తోంది.

"సైడ్ పిల్లర్లు లేవు.. పైన స్లాబ్ వేస్తున్నారు. మరి అది ఎంత వరకూ ఉంటుందో తెలియదు. సిమెంటులో నాణ్యత లేదు. కాంట్రాక్టర్​ని అడుగుదామంటే.. ఎవరో కూడా తెలియదు. ఇసుకతో కట్టినట్టు ఉంది. రెండు, మూడు రోజులు వరుసగా వర్షం వస్తే.. అప్పుడు పడిపోతే పరిస్థితి ఏంటి?". - భాస్కర్, లబ్ధిదారుడు

"గవర్నమెంటు కట్టిస్తుంది కానీ ఇళ్లను పక్కాగా కట్టించడం లేదు. పిల్లర్లు లేవు. నాణ్యత కూడా లేదు. సిమెంటు లేదు.. ఇసుక ఎక్కువ వేశారు. వర్షం పడితే కూలిపోయే విధంగా ఉన్నాయి. ప్రభుత్వమే ఈ విధంగా కట్టిస్తే ఏం చేయాలి". - ఆసిఫ్‌, లబ్ధిదారుడు

నెల్లూరులో నాసిరకంగా సాగుతున్న జగనన్న కాలనీల నిర్మాణాలు

ఇవీ చదవండి:

Last Updated :Feb 21, 2023, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.