వారికి శిక్ష పడే వరకు తెలుగుదేశం పోరాటం చేస్తుందన్న చంద్రబాబు

author img

By

Published : Aug 21, 2022, 10:27 PM IST

తెలుగుదేశం పోరాటం చేస్తుందన్న చంద్రబాబు

Chandrababu నెల్లూరు జిల్లా కావలిలో ఆత్మహత్యకు పాల్పడిన కరుణాకర్ మృతికి వైకాపా నేతల వేధింపులే కారణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కారకులకు శిక్షపడేవరకు తెలుగుదేశం పోరాటం చేస్తుందని వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్​లో మాట్లాడిన ఆయన..వారికి ధైర్యం చెప్పారు.

chandrababu phone to karunakar family: నెల్లూరు జిల్లాలో కావలిలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ కుటుంబ సభ్యులతో తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్​లో మాట్లాడారు. కరుణాకర్ మృతితో రోడ్డున పడి, తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు. కరుణాకర్ మృతికి వైకాపా నేతల వేధింపులే కారణమని.., కారకులకు శిక్షపడేవరకు తెలుగుదేశం పోరాటం చేస్తుందని చెప్పారు. నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని అన్నారు. పిల్లల చదువు, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చావుకు కారకులు ఎవరో చెపుతూ కరుణాకర్ లేఖ ద్వారా స్పష్టంగా తెలిపినా.. కనీసం ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయ్యకపోవటాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

ఏం జరిగిందంటే..: వైకాపా నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దళిత యువకుడు శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోకుండా అడ్డుపడుతున్నారని, తనతోపాటు తన తల్లినీ వేధించారని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కావలి పట్టణం ముసునూరు ఎస్సీకాలనీకి చెందిన దుగ్గిరాల కరుణాకర్‌(36) చేపల చెరువును సబ్‌ లీజుకు తీసుకొని మత్స్య వృత్తితో జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా వరదలు, వర్షాల కారణంగా చేపలు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.

ఈసారి వర్షాలు కురిసేలోపే చేపలు పట్టి విక్రయించాలని భావించగా, ముసునూరుకు చెందిన అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. శ్రీశైలం ట్రస్టుబోర్డు సభ్యుడు, వైకాపా సేవాదళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పదేపదే అడ్డుకోవడంతో పాటు గత నెలలో చెరువులో మందు కలపడంతో పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన కరుణాకర్‌ అనారోగ్యానికి గురయ్యాడు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలసి సమస్య వివరించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేదు. అప్పులెలా చెల్లించాలన్న ఒత్తిడి తట్టుకోలేక కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి కారణమైన వారి వేధింపులతో పాటు, కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి సూసైడ్‌ నోట్‌ రాశాడు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.