ETV Bharat / state

"తలకు.. తల".. పెదరాయుళ్ల తీర్పు.. వ్యక్తి దారుణ హత్య!

author img

By

Published : Jun 2, 2022, 7:24 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మన దగ్గర.. ఇంకా ఆటవిక న్యాయం అమలవుతోంది..! సెషన్స్ కోర్టు నుంచి.. సుప్రీం దాకా విస్తరించిన న్యాయవ్యవస్థను తోసి రాజులమంటూ.. అనాగరిక తీర్పులు ఇచ్చేస్తున్నారు కొందరు "పెదరాయుళ్లు"..! పరువు పోయిందనే.. చోరీ జరిగిందనే.. గొడవలను "సుమోటో"గా స్వీకరిస్తున్న స్వయం ప్రకటిత "పెద్ద మనుషులు".. దారుణ నిర్ణయాలు తీసుకుంటున్న వైనం చూస్తున్నదే! అంతుకు మించి అన్నట్టుగా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అత్యంత దారుణ ఘటన.. అందరినీ నివ్వెర పరుస్తోంది..! కంటికి కన్ను.. పంటికి పన్ను సిద్ధాంతాన్ని పట్టుకొచ్చి.. "తలకు.. తల" అని తీర్పు ఇచ్చేశారు..! అమలు జరిపించేశారు కూడా..!! నోటి మాటతో ఓ ప్రాణాన్ని తీసేశారు..!!!

Man brutally murdered by panchayat heads verdict at parvathipuram manyam
పంచాయతీ తీర్మానంతో  వ్యక్తి దారుణ హత్య

Murder: ‘మా నాన్న ఎలా చనిపోయాడో.. మీవాడు కూడా అలానే చావాలి. తలకు తల పోవాలి. లేకపోతే మీ ఇంట్లోని అందర్నీ చంపేస్తాం’ ఇవేవో సినిమా డైలాగులా ఉన్నాయనుకుంటే పొరపాటే. ఈ మాటలన్నీ ఓ కుటుంబం వారు.. మరో కుటుంబంతో చెప్పినవి! ఈ మాటలు వినగానే.. వారికి ఒక్కసారి గుండె ఆగినంత పనైపోయింది. ఏం చేయాలో తెలియక.. పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. వ్యవహారం మొత్తం విన్న పెద్దమనుషులు.. అదే న్యాయం అన్నారు! 'తలకు తల' అని తీర్పు చెప్పేశారు..! ఈ దారుణ సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసు వివరాలను పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి బుధవారం వెల్లడించారు.

సీతంపేట మండలం రేగులగూడలో మే 27న జరిగిన ఓ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో గ్రామానికి చెందిన సవర గయా(60) కుమార్తె పద్మను.. ఉసిరికిపాడుకు చెందిన మతిస్థిమితం లేని సవర సింగన్న(33) కర్రతో కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గయా వచ్చి.. సింగన్నను కిందకు తోసేశాడు. దీంతో.. మతి స్థిమితం లేని సింగన్న కోపంతో గయాపై కర్రతో దాడిచేశాడు. దీంతో.. గయా అక్కడికక్కడే మృతిచెందాడు.

మర్నాడు గయా కుమారులు, స్థానికులు.. సింగన్న కాళ్లు, చేతులు కట్టేసి ఓ ఇంట్లో బంధించారు. అతని కుటుంబసభ్యులు, గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అంతా వచ్చాక పంచాయతీ నిర్వహించి, తమ తండ్రి ఎలా చనిపోయాడో.. సింగన్న కూడా అలాగే చావాలని డిమాండ్ చేశారు. లేకపోతే అందర్నీ చంపేస్తామని బెదిరించారు. దీంతో.. కుటుంబ సభ్యులు పెద్దలను ఆశ్రయించారు. పెద్దలు సైతం ‘తలకు తల’ అని తీర్పుచెప్పారు.

కుటుంబంలో అందరి ప్రాణాలు తీస్తారని భయపడిన సింగన్న కుటుంబసభ్యులు.. పెద్దలు చెప్పిన తీర్పు అమలుకు అంగీకరించారు. ఈనెల 28న సింగన్నకు విషమిచ్చారు. మరణించలేదని ఉరేశారు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని కాల్చేశారు. గయా, సింగన్న మరణాలు సాధారణమైనవని మొదట భావించినా.. గ్రామంలోని రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా సమాచారం తెలుసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లో మిస్టరీని ఛేదించామన్నారు.

పాలకొండ సీఐ జి.శంకరరావు, దోనుబాయి, బత్తిలి, పాలకొండ ఎస్సైలు కిశోర్‌వర్మ, డి.అనిల్‌కుమార్‌, ప్రసాద్‌ ఆయా ప్రాంతాలకు వెళ్లి వివరాలు సేకరించారని.. రెండూ హత్యలుగా తేలినట్లు చెప్పారు. హత్యలకు కారకులు, ప్రేరేపించినవారు, పంచాయతీ నిర్వహించిన పెద్దలు.. ఇలా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.