ETV Bharat / state

ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలను వేరొక చోటుకి మారడానికి వీల్లేదు: హైకోర్టు

author img

By

Published : Dec 10, 2022, 10:35 PM IST

Mahankakali Temple case: వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ఓసారి ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలను వేరొక చోటుకి మారడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. అలా మార్చడం అంటే కొత్తగా దేవాలయాన్ని నిర్మించినట్లు అవుతుందని పేర్కొంది. ఆ విధంగా చేయడానికి ధర్మశాస్త్రం అనుమతించడం లేదని తెలిపింది. జీర్ణోద్ధారణ కోసమైనా విగ్రహాలను/మూలవిరాట్‌ను మరో స్థానానికి తరలించకూడదని తెలిపింది. దేవాలయంలో మరమ్మతుల కోసం మాత్రమే తాత్కాలికంగా తొలగించవచ్చని పేర్కొంది.

AP హైకోర్టు
AP HIGH COURT

Mahankakali Temple case: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సప్పాలెంలోని 1976 మార్చి 15న ప్రతిష్ఠించిన మహంకాళీ అమ్మవారి విగ్రహాన్ని గర్భగుడి నుంచి కదిపేందుకు దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ గుంజి చుక్కమ్మ కుమార్తె యల్లంటి రేణుక 2021లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వ్యాజ్యం విచారణ జరిపి హైకోర్టు తీర్పునిచ్చింది. ఇస్సప్పాలెంలో ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి విగ్రహాన్ని వేరే చోటికి మార్చే ప్రతిపాదన ధర్మశాస్త్రం నిబంధనలకు లోబడి లేదని తెలిపింది. ప్రజలు, భక్తులకు మరింత సౌకర్యం కోసం, రహదారి విస్తరణ కోసం మార్చుతున్నట్లు కనబడుతోందని పేర్కొంది. అమ్మవారి విగ్రహాన్ని మార్చడం అంటే కొత్తగా గుడిని నిర్మించడం లాంటిదేనని తేల్చిచెప్పింది. దేవాలయం పురాతనమైనది కావడంతో బలహీనంగా ఉందని అధికారుల చెబుతున్న వాదనతో ఏకీభవించలేమంది. అధికారులు కోర్టు ముందు ఉంచిన ధ్రువపత్రం పరిశీలిస్తే ఆ నిర్మాణానికి తక్షణం ముప్పు ఉన్నట్లు కనిపించడం లేదంది. వేద మంత్రోచ్ఛారణ మధ్య, హిందూ సంప్రదాయల ప్రకారం ఆ దేవాలయాన్ని నిర్మించారని గుర్తుచేసింది. మహంకాళీ అమ్మవారి విగ్రహాన్ని వేరే చోటికి మార్చవద్దని అధికారులను ఆదేశించింది. గుంజి చుక్కమ్మ ప్రతిమను సైతం కదపవద్దని స్పష్టంచేసింది. మార్చాలనే ప్రయత్నం హిందూధర్మానికి, ఆచార వ్యవహారాలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈమేరకు కీలక తీర్పు ఇచ్చింది.

అక్కడి దేవాలయం ప్రాంగణంలో ఉన్న గుంజి చుక్కమ్మ ప్రతిమను మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోవడానికి సింగిల్‌ జడ్జి నిరాకరించారు. ఆ తీర్పును సవాలు చేస్తూ యల్లంటి రేణుక, మరొకరు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వెళ్లే ప్రధాన రహదారికి పక్కన ఉన్న స్థలంలో వేదమంత్రాల నడుమ, పురోహితుల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించామన్నారు. అధికారపార్టీ స్థానిక నేతల ఒత్తిడితో మహంకాళీ అమ్మవారి దేవాలయం ఈవో.. దేవాలయం కూల్చివేసి, పునర్నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నారన్నారు. కూల్చివేతకు సరైన కారణమే లేదన్నారు. ఒకవేళ దేవాదాయశాఖ అభివృద్ధి చేయాలనుకుంటే చుక్కమ్మ పత్రిమ, గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని కదపకుండా పనులు చేయవచ్చు అన్నారు. పురాతన, ప్రముఖ దేవాలయాలను తరలించడం లేదా విగ్రహాలను మార్చడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. దేవాలయం పునర్నిర్మాణం కోసం గర్భగుడిలోని అమ్మవారి విగ్రహాన్ని మరో చోటికి మార్చడానికి వీల్లేదన్నారు.

మూలవిరాట్‌ తరలింపు ప్రతిపాదన ఆగమ ఉల్లంఘన కిందకు రాదని అధికారుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దేవాలయం 45 ఏళ్ల కిందట నిర్మించారని, అది శిథిల దశలో ఉందన్నారు. ఆర్‌అండ్‌బీ రహదారికి మరింత దగ్గరగా ఉందన్నారు. భక్తులతో బాగా రద్దీగా ఉంటోందన్నారు. రహదారిపై నిలబడటం వల్ల నరసరావుపేట-సత్తెనపల్లి రహదారి బ్లాక్‌ అవుతోందన్నారు. 300 చ.గజాల ఖాళీ స్థలం దేవాలయానికి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న దేవాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో రాతితో చెక్కిన దేవాలయం నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. ప్రస్తుతం అమ్మవారు విగ్రహం ఉన్న స్థానంలో ఆగమశాస్త్రాన్ని అనుసరించి శ్రీచక్రం ప్రతిష్ఠిస్తామన్నారు. కొత్త నిర్మాణంతో పాత దేవాలయం 25-30 మీటర్ల వెనక్కి జరుగుతుందన్నారు. మానవులు ప్రతిష్ఠించిన విగ్రహాలను నిబంధనలను అనుసరించి మరోచోటికి తరలించొచ్చు అన్నారు.

ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం నిర్ణయాన్ని వెల్లడించింది. ‘కొన్ని పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే విగ్రహ పునఃప్రతిష్ఠ, జీర్ణోద్ధరణ గురించి ధర్మశాస్త్రం చెబుతోందని తీర్పులో పేర్కొంది. శాస్త్రోక్తంగా మంత్ర, తంత్రాలతో విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు మరొక చోటికి మార్చడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. వేరే చోటికి మారడం అంటే కొత్తగా దేవాలయాన్ని నిర్మించడం అవుతుందని.. ఆగమశాస్త్రాలు, అగ్నిపురాణం, ధర్మశాస్త్రం నిర్దేశించిన సంప్రదాయాలకు విఘాతం కలిగేలా వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని తెలిపింది. అధికరణ 26(బి)లో మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు రక్షణ ఉంది. మహంకాళీ అమ్మవారి దేవాలయం విషయంలో దేవస్థానం వెనుక నిర్మించే రాతి దేవాలయంలోకి విగ్రహాన్ని మార్చాలని అధికారులు ప్రతిపాదించారు. ధర్మశాస్త్రం ప్రకారం మార్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అమ్మవారి విగ్రహాన్ని వేదమంత్రాల నడుమ ప్రతిష్ఠించారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఆ అమ్మవారు చాలా శక్తివంతురాలు. విగ్రహాన్ని మారిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపింది. అందుకు శాస్త్రాలు అంగీకరించడం లేదని కోర్టు పేర్కొంది. ఈనేపథ్యంలో అమ్మవారి విగ్రహాన్ని, చుక్కమ్మ పత్రిమను మరో చోటికి మార్చవద్దని అధికారులను ఆదేశిస్తున్నాం’ అని తీర్పులో పేర్కొంది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.