ETV Bharat / state

ఉద్యోగాలు ఇవ్వలేకుంటే చెప్పొచ్చు కదయ్యా - ఈ కాకి లెక్కలన్నీ ఎందుకు జగనన్నా?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 12:26 PM IST

YSRCP Government Negligence on Unemployment: రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి సర్కారు కొలువులు భర్తీ చేస్తామని అధికారంలోకి రాకముందు జగన్‌ ఊదరగొట్టారు. ఇచ్చిన హామీలకు, చెప్పిన మాటలకు ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించే ముఖ్యమంత్రి నిరుద్యోగుల్ని కూడా అలాగే దగా చేస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించడం అటుంచి నిరుద్యోగుల సంఖ్యనే తక్కువ చూపించే కుట్రలు చేస్తోంది వైఎస్సార్సీపీ సర్కార్‌. నిరుద్యోగిత ఎక్కువగా ఉంటే ఇబ్బంది వస్తుందనుకున్నారో ఏమో ఉపాధి కార్యాలయ వెబ్‌సైట్‌లో నమోదైన వారి వివరాల్ని దాచేశారు. కొత్తగా తెచ్చిన జాతీయ వెబ్‌సైట్‌లో సగానికి సగం నిరుద్యోగుల సంఖ్య తగ్గించి జగన్నాటకానికి తెరతీశారు.

YSRCP_Government_Negligence_on_Unemployment
YSRCP_Government_Negligence_on_Unemployment

ఉద్యోగాలు ఇవ్వలేకుంటే చెప్పొచ్చు కదయ్యా - ఈ కాకి లెక్కలన్నీ ఎందుకు జగనన్నా?

YSRCP Government Negligence on Unemployment : ఉపాధి కార్యాలయాలను కేంద్ర ప్రభుత్వం మోడల్‌ కెరీర్‌ కేంద్రాలుగా మార్చింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ పోర్టల్‌లో నిరుద్యోగుల్ని కొత్తగా నమోదు చేస్తున్నారు. ఉపాధి కార్యాలయాల్లో నిరుద్యోగుల్ని నమోదు చేసేందుకు ఉపయోగించిన పాత వెబ్‌సైట్‌కు పాతర వేశారు. గతంలో నమోదు చేసుకున్నవారిని గాలికి వదిలేసి 'మోడల్‌ కెరీర్‌ (Model Career)' పోర్టల్‌లో కొత్తగా నమోదు చేయాలని జగన్‌ ప్రభుత్వం ఆదేశించింది.

నిరుద్యోగులు గోల్​మాల్ : రాష్ట్రంలో 2022 జనవరి వరకు ఉపాధి కల్పన కార్యాలయాల్లో 6 లక్షల16 వేల 689 మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 4 లక్షల 22 వేల 55మంది పురుషులు ఉన్నారు. ఉపాధి కల్పన కార్యాలయాల్లో గతంలో నమోదు చేసుకున్న వారి సంఖ్యను దాచేస్తున్న జగన్‌ సర్కార్‌ రెండేళ్లుగా మళ్లీ కొత్తగా జాతీయ పోర్టల్‌లో నమోదు చేస్తోంది. 6 లక్షల16 వేల 689 మందికి బదులు జాతీయ పోర్టల్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 3లక్షల మందిని మాత్రమే నిరుద్యోగులుగా చూపుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగితను తక్కువ చేసి చూపేందుకు లెక్కల్ని గోల్‌మాల్‌ చేసి నిరుద్యోగుల సంఖ్యను తారుమారు చేస్తోంది జగన్‌ సర్కార్‌. వాస్తవానికి ఉపాధి కార్యాలయాల్లో నమోదు చేసుకున్న వారికంటే బయట రెండింతలు ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు.

నిరుద్యోగిత రేటులో ఏపీ బిహార్​ను మించిపోయింది: పట్టాభి

నిరుద్యోగులపై జగన్ కాకి లెక్కలు : ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 5లక్షలకుపైగా నిరుద్యోగులు ఉంటారని అధికారుల అంచనా. ఉపాధి కార్యాలయం పాత వెబ్‌సైట్‌లో విశాఖ జిల్లా నుంచి 98 వేల 504 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. పాత వెబ్‌సైట్‌ లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే ఎక్కువ నిరుద్యోగిత విశాఖ జిల్లాలోనే ఉంది. 2022 జనవరి తర్వాత నుంచి జాతీయ వెబ్‌పోర్టల్‌లో నమోదు చేస్తున్న సర్కార్‌ విశాఖ జిల్లాలో కేవలం 24 వేల 60 మంది మాత్రమే నిరుద్యోగులు ఉన్నట్లు చెబుతోంది.

Unemployment Rate in AP : నిరుద్యోగులకు ఉపాధి చూపించడం అటుంచి వారి సంఖ్యనే తగ్గించేసేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. జగన్‌ సర్కార్‌ తారుమారు చేస్తున్న లెక్కలు ఒక్క విశాఖ జిల్లాలోనే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటిలోనూ ఇదే దుస్థితి కనిపిస్తోంది. విశాఖపట్నం జిల్లా తర్వాత అత్యధిక మంది నిరుద్యోగులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో 64వేలకుపైగా నమోదు చేసుకుంటే జాతీయ పోర్టల్‌లో మాత్రం 51 వేల 741 మందినే చూపిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ కొత్తగా నమోదు చేసుకున్న వారి సంఖ్య 31 వేల 956. కానీ రాష్ట్ర వెబ్‌సైట్‌ ప్రకారం 2022 జనవరి నాటికే 48 వేల 507మంది ఉన్నారు.

పాత, కొత్త గణాంకాలను చూపిస్తే తూర్పుగోదావరి జిల్లాలో 80 వేల 463మందిగా నిరుద్యోగులు ఉండాలి. కానీ కొత్త లెక్కల ప్రకారం 31 వేలే ఉన్నట్లు రికార్డు చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాత వెబ్‌సైట్‌ ప్రకారం 55వేలకుపైగా ఉండాల్సిన నిరుద్యోగులు కొత్త దాంట్లో మాత్రం 13 వేల 310 మంది మాత్రమే ఉన్నారు. విజయనగరం జిల్లా ఉపాధి కార్యాలయం లెక్కల ప్రకారం 2022లో 42 వేలకుపైగా నిరుద్యోగులు ఉండగా కేవలం 13 వేల 250మంది మాత్రమే చూపిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి.

జగన్ చలవతో మనమే నెంబర్ వన్ - ఎందులోనో తెలిస్తే షాక్​ అవుతారు!

దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు : మోడల్‌ కెరీర్‌ కేంద్రాల తరపున నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు మేళాలు నిర్వహిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నా ఇవి మొక్కుబడిగానే మారాయి. రికార్డు స్థాయిలో ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా వీటిల్లో లభిస్తున్న ఉద్యోగాలు అంతంత మాత్రమే. ఉపాధి మేళాల్లో అరకొర మందికి ఉద్యోగం దొరికినా చాలా తక్కువ జీతాలు ఉంటున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లి పని చేయాల్సి వస్తోంది. చాలా మంది మధ్యలోనే మానేస్తున్నారు. విశాఖపట్నం మోడల్‌ కెరీర్‌ కేంద్రం తరపున 96 ఉద్యోగ మేళాలు నిర్వహించారు. 10 వేల 987మంది హాజరయ్యారు. కేవలం 2,907 మందికి మాత్రమే కొలువులు దొరికాయి.

వెనుకాడుతున్నా యువత : రాజమహేంద్రవరం ఉప ఉపాధి కార్యాలయం పరిధిలో 10 ఉద్యోగ మేళాలు నిర్వహించగా కేవలం 283మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 104 మేళాలు నిర్వహించి 1,899మందికి ఉద్యోగాలు కల్పించినట్లు లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా ఇక్కడ ఉద్యోగాల్లో చేరింది 500లోపే ఉన్నారు. ఉపాధి మేళాల్లో మార్కెటింగ్, డెలివరీ బాయ్స్‌, ఫీల్డ్‌ వర్క్‌ వంటి ఉద్యోగాలే ఎక్కువగా ఉంటున్నాయి. మార్కెటింగ్‌, ఫీల్డ్‌వర్క్‌ విభాగంలో ఉండే ఒత్తిడికి భయపడి యువత ఆసక్తి చూపడం లేదు. చాలా ఉద్యోగాల్లో నెలకు 12వేల నుంచి 15వేల లోపే జీతం ఇస్తున్నారు. కొన్నింటికైతే 6వేల నుంచి 8వేలు వరకే ఉంటున్నాయి. చాలామంది నియామక లేఖలు తీసుకుంటున్నా ఉద్యోగంలో చేరేందుకు వెనుకాడుతున్నారు.

కేంద్రం నిధుల విడుదల : రాష్ట్రంలో కొత్తగా 13జిల్లాలు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాలకు ఇప్పటివరకు మోడల్‌ కేరీర్‌ కేంద్రాలను ప్రారంభించ లేదు. పాత ఉపాధి కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి. నిరుద్యోగులకు వారికి నచ్చిన రంగాల్లో శిక్షణ, కౌన్సెలింగ్‌ ఇచ్చి ఉపాధి కల్పించాలనేది మోడల్‌ కెరీర్‌ కేంద్రాల ప్రధాన లక్ష్యం. కార్యాలయాలను పూర్తిగా డిజిటలైజేషన్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. మరమ్మత్తులు, మంచినీటికి బోరు, విద్యుత్‌ సహ మౌలిక వసతులకు డబ్బులు ఇస్తోంది. అద్దె భవనాల నుంచి ప్రభుత్వం భవనాల్లోకి మారిస్తే సౌకర్యాల కల్పన కోసం 37 లక్షల 50 వేల నుంచి 60 లక్షల రూపాయల వరకు కేంద్రం నిధులిస్తుంది. ఈ బిల్లులను విడతల వారీగా విడుదల చేస్తోంది.

నిధులు విడుదల చేయన రాష్ట్ర ప్రభుత్వం : విజయనగరం మోడల్‌ కెరీర్‌ కేంద్రం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఉమ్మడి కర్నూలు మోడల్‌ కెరీర్‌ కేంద్రానికి 41 లక్షల 56 వేలు మంజూరు చేయగా 24 లక్షల 92 వేలు మాత్రమే ఇచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ ఇంతవరకు వినియోగంలోకి రాలేదు. నంద్యాల జిల్లా మోడల్‌ కెరీర్‌ కేంద్రం ఏర్పాటుకు 56 లక్షలు మంజూరు కాగా ఇంతవరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. కేవలం కరెంట్‌ బిల్లులకు మాత్రమే నిధులిస్తున్నారు. శ్రీకాకుళం కేంద్రానికి 52లక్షలు, ప్రకాశం కేంద్రానికి 54 లక్షలు మంజూరు కాగా నయాపైసా ఇవ్వలేదు. విశాఖ జిల్లా గాజువాకలోని మోడల్‌ కెరీర్‌ కేంద్రానికి 60లక్షలు మంజూరు కాగా 30లక్షలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది.

సర్వత్రా విమర్శలు : జాతీయ పోర్టల్‌లో నిరుద్యోగులు, ఉద్యోగాలు కల్పించే యజమానుల వివరాల నమోదు చేస్తున్నారు. కానీ ఉపాధి కార్యాలయం పాత వెబ్‌సైట్‌లో నమోదు చేసిన వారి పేర్లను కొత్త వెబ్‌సైట్‌లోకి తీసుకురాలేదు. నిరుద్యోగులే నేరుగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉన్నా సర్కారు కనీస అవగాహన కల్పించడం లేదు. నిరుద్యోగులకు అండగా ఉంటామని అధికారంలోకి రాకముందు ఊదరగొట్టిన జగన్‌ గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసే మరిచారు. పైగా రాష్ట్రంలో నిరుద్యోగితనే తక్కువగా ఉందని చూపించే దుర్మార్గమైన పనిని యథేచ్ఛగా చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.

నిరుద్యోగులంటే వైసీపీ ప్రభుత్వానికి అంత అలుసా? - తీవ్ర నిరాశలో యువత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.