గుత్తేదారులపై వివక్ష - నేడు విజయవాడలో బిల్డర్స్ అసోసియేషన్ భేటీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచన

గుత్తేదారులపై వివక్ష - నేడు విజయవాడలో బిల్డర్స్ అసోసియేషన్ భేటీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచన
YSRCP Government Discrimination on AP Contractors: రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని పదవి చేపట్టే సమయంలో ప్రమాణాలు చేస్తారు. అధికారంలోకి వచ్చాక మాత్రం వాటికి తిలోదకాలు ఇస్తారు. స్వయానా ముఖ్యమంత్రి జగనే ఈ తీరున వ్యవహరిస్తున్నారంటూ గుత్తేదారులు మండిపడుతున్నారు. తన సొంత నియోజకవర్గ గుత్తేదారులకు మేలు చేస్తే చాలు మిగతా ప్రాంతాలతో నాకేంటి సంబంధం అన్నట్లు ఆయన తీరు ఉందని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని గుత్తేదారులు భావిస్తున్నారు.
YSRCP Government Discrimination on AP Contractors : ప్రభుత్వ పనులు చేసే గుత్తేదారులకు ఈ సారి దీపావళి ఎలాంటి వెలుగులను పంచలేదు. అదే సమయంలో సీఎం జగన్ (CM Jagan) సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని గుత్తేదారులకు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల గుత్తేదారులు కోట్ల రూపాయల బిల్లుల కోసం నెలల తరబడి నిరీక్షిస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతంటే పులివెందుల గుత్తేదారులకు మాత్రం ఒక్క రోజులో 150 కోట్ల రూపాయల చెల్లింపులు చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్ పరిధిలోని గుత్తేదారులకూ 50 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. ఈ విషయం ఇతర ప్రాంతాల గుత్తేదారులకు ఆలస్యంగా తెలిసింది. వారంతా ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు
Contractors Pending Bills in AP : ఈ నెల 9, 10 తేదీల్లో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. అయితే సీఎం పర్యటనకు (CM Jagan Tour) ముందే పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థలో వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై వెంటనే వివరాలు పంపాలని ఆర్థికశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. పంచాయతీరాజ్ శాఖకు చెందిన 80 బిల్లులు, R అండ్ Bలోని 66 బిల్లులు, పురపాలికశాఖకు చెందిన 55 బిల్లులు, గ్రామీణ నీటిసరఫరా విభాగం 44 బిల్లులు, ఏపీ విద్యా, సంక్షేమ, మౌలిక సదుపాయాలకల్పన సంస్థకు చెందిన 23 పనులు.. మొత్తంగా అన్నీ కలిసి 200 కోట్ల రూుపాయల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చారు. అయితే వీటిలో 150 కోట్ల రూపాయలు సీఎం పులివెందుల పర్యటనకు వెళ్లే ముందే విడుదల చేసినట్లు తెలిసింది.
YSRCP Government Not Giving Pending Bills to Contractors : పనిలో పనిగా ఆర్థిక మంత్రి బుగ్గన ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన పెండింగ్ బిల్లుల్లో 50 కోట్ల రూపాయల మేర ఈనెల 7, 8 తేదీల్లో చెల్లింపులు చేశారు. ఇతర నియోజకవర్గాల పరిధిలో గుత్తేదారుల పెండింగ్ బిల్లులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వీటికే చెల్లింపులు చేశారని తెలిసింది. గతంలో ఉన్న విధానం కాకుండా ఇప్పుడు ఏ గుత్తేదారుకు ఎంత చెల్లింపులు జరిగాయనేది ఇతరులకు తెలియకుండా ఆర్థికశాఖ జాగ్రత్త పడుతోంది. కేవలం ఆ గుత్తేదారుకు మాత్రమే ఓటీపీ పంపించి, అతనికి తెలిసేలా చేస్తున్నారు. దీంతో ఇతరులకు ఈ సంగతి తెలియడం లేదు.
Builders Association Meeting in Vijayawada Today : వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బిల్లులు రాక గుత్తేదారులు బోరుమంటున్నారు. పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్న బిల్లులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఒక్క ఆర్ అండ్ బీలోనే దాదాపు 12 వందల కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఇవ్వాలి. ఎప్పుడో CFMCలో బిల్లులు అప్‌లోడ్ చేసి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా జగన్ సర్కార్ (Jagan Government) కనికరించిన పాపాన పోవడం లేదు. దీంతో కేవలం రెండు నియోజకవర్గాల పరిధిలోని గుత్తేదారులకే చెల్లింపులు చేయడంపై ఇతర ప్రాంతాల గుత్తేదారులు మండిపడుతున్నారు. దీనిపై బిల్డర్స్ అసోసియేషన్ (Builders Association) నేడు విజయవాడలో సమావేశం కానుంది. ఆర్థికశాఖ అధికారులపై హైకోర్టును ఆశ్రయించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది.
