విజయవాడ బస్‌స్టాండ్ ప్రమాద ఘటన స్థలిలో మరమ్మతులు 'మమ' - అధికారుల చర్యలపై పెదవి విరుస్తున్న ప్రయాణికులు

విజయవాడ బస్‌స్టాండ్ ప్రమాద ఘటన స్థలిలో మరమ్మతులు 'మమ' - అధికారుల చర్యలపై పెదవి విరుస్తున్న ప్రయాణికులు
Vijayawada Pandit Nehru Bus Station has not Repaired: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఇటీవల ప్లాట్‌ఫామ్‌పైకి బస్సు దూసుకొచ్చిన ఘటన ప్రయాణికుల్లో భయాందోళన రేకెత్తించింది. బస్టాండ్‌లో వేచి చూసే ప్రయాణికుల భద్రతను ఈ దుర్ఘటన ప్రశ్నార్థకం చేసింది. డ్రైవర్ తప్పిదం ఉన్నా ప్లాట్‌ఫామ్ నిర్దిష్ట ఎత్తు కంటే తక్కువగా ఉండటం ధృఢమైన రెయిలింగ్ లేకపోవమూ ప్రమాదానికి కారణమయ్యాయి. ప్రమాదం జరిగాక మరమ్మతులు చేసి ప్లాట్‌ఫామ్ ఎత్తు పెంచారు తప్ప రెయిలింగ్‌ను పటిష్ఠపర్చలేదు.
Vijayawada Pandit Nehru Bus Station has not Repaired: ఇటీవల విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్లో ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకు పోయిన ఘటన ప్రయాణికుల్లో భయాందోళనలను రేకెత్తించింది. ఈ దుర్ఘటనలో బస్టాండ్‌లో వేచి చూసే ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ప్రమాదానికి డ్రైవర్ తప్పిదం ఉన్నా.. ప్లాట్ ఫాం నిర్ధిష్ట ఎత్తు కంటే తక్కువగా ఉండటం.. దృఢమైన రెయిలింగ్ లేకపోవడమూ కారణమయ్యాయి. ప్రమాద స్తలి వద్ద మాత్రమే మరమ్మతులు చేసి ప్లాట్ ఫాం ఎత్తు పెంచారు తప్ప రెయిలింగ్‌ను పటిష్ట పరచలేదు.
బస్సు ప్లాట్ ఫాం పైకి దూసుకుపోయిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. ఘటన జరిగిన తీరు ఓ సారి పరిశీలిస్తే.. ప్లాట్ ఫాంపై ఆగి ఉన్న బస్సు చాలా సులభంగా ప్లాట్ ఫాం పైకి ఎక్కి ముందుకు పోయింది. బస్సును అడ్డుకునేందుకు రెయిలింగ్ ఉన్నా అది బస్సును ఏ మాత్రం ఆపలేకపోయింది. దీంతో బస్సు స్టాళ్ల వరకు వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది. ప్రమాదానికి బస్సు డ్రైవర్ తప్పిదం కారణమని అధికారుల విచారణ కమిటీ తేల్చినా బస్టాండ్‌లో ప్లాట్ ఫాం నిర్మాణ లోపమూ, పటిష్టమైన రెయిలింగ్ లేకపోవడమూ కారణాలుగా తేలాయి.
ప్రమాదానికి గురైన మెట్రోల లగ్జరీ బస్సు ఫుట్ బోర్డు ఎత్తు సాధారణ బస్సుల కంటే తక్కువగా ఉంటుంది. లోఫ్లోర్ బస్సుల కోసం అధికారులు 12వ నెంబర్ ప్లాట్ ఫాం ఎత్తును తగ్గించారు. బస్సు ఫుట్ బోర్డుకు సమాన ఎత్తులోనే ప్లాట్ ఫాం నిర్మించాల్సి ఉండగా అలా చేయలేదు. బస్సు ఫుట్ బోర్డుతో సమాన ఎత్తుతో ఒకే ప్లాట్ ఫాం నిర్మించాలని అధికారుల కమిటీ సూచించింది. మరోసారి ఈ తరహా ఘటన జరగకుండా అన్ని చోట్ల దృఢమైన ఇనుప స్తంభాలతో రెయిలింగ్ నిర్మించాలనీ సూచించింది. అధికారులు మాత్రం ప్రమాదం జరిగిన 12 వ ప్లాట్ ఫాం వద్ద మాత్రమే ఎత్తును కాస్త పెంచి.. పాత రెయిలింగ్నే నిర్మించి మమ అనిపించారు.
ప్రమాదం జరిగిన 12వ ప్లాట్ ఫాం వద్దే కాదు.. మరికొన్ని ప్లాట్ ఫాంల వద్ద కూడా పలు లోపాలను గుర్తించారు. ప్లాట్ ఫాంలు నిర్ణీత ఎత్తు కంటే తక్కువగా ఉన్నాయని విచారణ చేసిన అధికారులు గుర్తించారు. పలు చోట్ల రెండు వరుసలుగా మెట్ల తరహాలో వీటిని నిర్మించినట్లు గుర్తించారు. వీటి వద్ద బస్సు ముందు రెయిలింగ్ పటిష్టంగా లేదు. ప్లాట్ ఫాం పై బస్సు ఆపే చోట బస్సు చక్రాలకు ముందు ఎత్తైన దిమ్మె నిర్మించాలని ప్రతిపాదించారు. అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ అధికారులు బస్టాండ్‌లో అవసరమైన ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
