ETV Bharat / state

"సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయి.. ఆసుపత్రి ఏర్పాటు చేయండి" కార్మికులు

author img

By

Published : Apr 8, 2023, 12:09 PM IST

Autonagar : విజయవాడలో ఆటోనగర్​ కార్మికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పని చేస్తున్న సమయంలో నిత్యం ఎదో గాయం అవుతూనే ఉంటుందని.. దీని వల్ల చికిత్స కోసం దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సి వస్తోందంటున్నారు. ప్రాణాలు కాపాడటానికి చివరి అవకాశం ఉన్న సందర్భంలో.. ఆసుపత్రి దూరంగా ఉండటంతో అక్కడికి తరలించే లోపే పరిస్థితి విషమిస్తోందని అంటున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..

ఆటోనగర్​ ఆసుపత్రి
ఆటోనగర్​ ఆసుపత్రి

Need PHC at Vijayawada Autonagar : విజయవాడ ఆటోనగర్‌లో దాదాపు లక్ష మంది పనిచేస్తుంటారు. వాహనాల తయారీ, మరమ్మతులకు సంబంధించిన వివిధ పరిశ్రమల్లోని కార్మికులు.. ఒక్కోసారి ఊహించని రీతిలో గాయాలబారిన పడుతుంటారు. ఆటోనగర్‌ పరిసరాల్లో ఆసుపత్రి లేకపోవడంతో.. సకాలంలో వైద్యం అందక కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. పారిశ్రామిక వాడ ఏర్పడి ఐదు దశాబ్దాలు గడుస్తున్నా కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు నోచుకోలేదు.

అతిపెద్ద పారిశ్రామికవాడగా గుర్తింపు తెచ్చుకున్న విజయవాడ ఆటోనగర్‌ 275 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఎంతోమంది కార్మికులకు ఉపాధిని అందిస్తోంది. వాహనాల తయారీ, మరమ్మతులు సహా వివిధ రకాల పరిశ్రమలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది నాణేనికి ఒక వైపు.. మరి మరోవైపు మాత్రం దీనికి విరుద్ధంగా. ఒక వైపు కార్మికులకు బతుకుదెరువు దొరుకుతున్న.. మరోవైపు ఇక్కడి కార్మికులకు సరైన వైద్య సదుపాయలు అందుబాటులో లేవు. ఆటోనగర్ ఏర్పడి 56ఏళ్లు గడుస్తున్నా.. ఇక్కడ కనీస వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. పనిచేసే క్రమంలో ఏ ప్రమాదం జరిగినా కార్మికులను, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ సర్వజన ఆసుపత్రికి తరలించాల్సిన దుస్థితి. దాంతో కార్మికుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆటోనగర్‌లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ కలిపి సుమారు 3 వేల వరకు ఉంటాయి. వాహనాల తయారీ, వెల్డింగ్, మెకానిక్, ఎలక్ట్రికల్ రంగాల్లో కార్మికులు పనిచేస్తుంటారు. ఈ క్రమంలో తరుచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని కార్మికులు అంటున్నారు. ఆటోనగర్ పరిసరాల్లో ఆసుపత్రి అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వాలు మారినా, ఆటోనగర్ కార్మికుల సమస్య మాత్రం తీరడం లేదంటున్నారు. సమీపాన ప్రాథమిక ఆసుపత్రి ఉంటే.. ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కోసుకుపోవటం లాంటి గాయాలైతే దూరంలో ఉన్న ప్రభుత్వం ఆసుపత్రికి తరలించేలోపు రక్తస్రావమై పరిస్థితి విషమిస్తోందంటున్నారు.

"నేను పాతిక సంవత్సరాలుగా కంపెనీ నడుపుతున్నాను. పని చేస్తున్న సమయంలో ఏదైనా దెబ్బ తగిలితే వెళ్లటానికి ఎటువంటి ఆసుపత్రి లేదు. గతంలో ఓ ఆసుపత్రి ఉండేంది. అది ఇప్పుడు నడవటం లేదు. సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు జరిగినప్పుడు దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. ఆసుపత్రులు లేక ఎంతోమంది కార్మికులు చనిపోయారు." - పరిశ్రమ యాజమాని, ఆటోనగర్​

"నేను 45 సంవత్సరాలుగా ఆటోనగర్​లో పని చేస్తున్నాను. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కాపాడాలన్న కాపాడలేని పరిస్థితి. తరచూ చిన్న చిన్న ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ప్రాథమిక చికిత్స కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఆసుపత్రి నిర్మించాలని కోరుతున్నాము" -స్థానికుడు, ఆటో నగర్​

ఆటోనగర్‌ ఏర్పడి ఐదు దశాబ్దాలు దాటినా అందని వైద్యసేవలు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.