ETV Bharat / state

Justice NV Ramana in TANA: ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలు నడుపుతున్నారు.. రాజకీయాలపై జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం

author img

By

Published : Jul 10, 2023, 8:29 PM IST

Justice NV Ramana key comments on politics: ప్రస్తుత రాజకీయాలపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి రాజకీయాల్లో వికృత ఘటనలు చూస్తున్నామని, ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలు నడుపుతున్నారని ఆవేదన చెందారు. దుష్ప్రచారమే ఎన్నికల వ్యూహంగా వెళ్తుందన్న ఆయన.. కళాశాల స్థాయి నుంచి విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

Justice
Justice

Justice NV Ramana key comments on politics: 'నేటి రాజకీయాల్లో ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. పార్టీల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలు నడుపుతున్నారు. దుష్ప్రచారమే ఎన్నికల వ్యూహంగా వెళ్తున్నారు. కళాశాల స్థాయి నుంచి విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకు తెలుగువారంతా విశ్రమించొద్దు. అమెరికాకు వలస వచ్చిన తొలి తరం తెలుగు వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. వాళ్లంతా తెలుగు మీడియంలోనే చదివి, విదేశాల్లో తెలుగు భాషకు పెద్దపీట వేశారు' అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ మహాసభల్లో పాల్గొన్న ఆయన.. తెలుగు భాష, తెలుగు కవులకు సంబంధించిన కీలక విషయాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

నేటి రాజకీయాలపై జస్టిస్ రమణ ఆగ్రహం.. అమెరికా దేశం ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ కేంద్రంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో 23వ మహాసభల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సభలకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రజలతో సంబంధం లేకుండా పార్టీలెలా నడుపుతున్నారో అర్ధం కావటం లేదు..? రానూరానూ రాజకీయాల్లో ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో స్త్రీలను అసభ్యంగా చిత్రీకరిస్తూ..ట్రోలింగ్ పేరుతో అభూతకల్పనలతో అభాసుపాలు చేస్తున్నారు. దీంతోపాటు దుష్ప్రచారమే నేటి ఎన్నికల వ్యూహంగా మారింది. మేనిఫెస్టో గురించి మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను, యువతను పక్కదోవ పట్టిస్తున్నారు. ప్రలోభ అంశాలకు ప్రాధాన్యత పెంచి, ఓట్లు దండుకుంటున్నారు" అని అన్నారు.

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాస్వామ్యం రోజురోజుకీ పరాజయం పాలవుతోందని జస్టిస్‌ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యువత, మేధావులు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి నీతిమంతులు రాకపోతే.. నీతిలేని వారే రాజ్యమేలుతారని వాపోయారు. వారు చేసే నష్టాన్ని పూడ్చడానికి దశాబ్దాల కాలం పడుతుందని ఆవేదన చెందారు. విద్యార్థులను రాజకీయాలకు దూరం చేయడం వల్లే అథోగతి పాలవుతున్నామన్న ఆయన.. కళాశాల స్థాయి నుంచే విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇచ్చేవరకూ పోరాడుదాం.. ఒక తెలుగు వ్యక్తి ఈ (అమెరికా) దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే రోజు ఎంతో దూరం లేదనేది తన నమ్మకమని.. జస్టిస్ ఎన్వీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలిచేందుకు, వారిని ఒక్కతాటిపై నడిపేందుకు 'తానా' అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు రాష్ట్ర, జాతీయ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపారన్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటిగా సామాజిక న్యాయానికి పునాదులు వేసింది రామారావేనని ఆయన గుర్తు చేశారు. తెలుగు జాతి ఐక్యంగా ఉండి.. ఆ గొప్ప నాయకుడికి అండగా నిల్చుంటే, ఆయనకే కాదు, యావత్తు తెలుగు జాతికే గొప్ప గౌరవం లభించేదని..ఇప్పటికైనా దివంగత ఎన్టీఆర్‌కు భారత రత్న ఇచ్చే వరకు తెలుగు వాళ్లందరూ విశ్రమించకూడదని సూచించారు.

ప్రస్తుత రాజకీయాలపై జస్టిస్ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు

''పురాతన పోకడలకు, కాలం చెల్లిన ఆలోచనలకు తావివ్వకండని.. కుల, మత, ప్రాంతీయ దురాభిమానాలు ప్రగతికి ప్రతిబంధకాలని గుర్రం జాషువా అన్నారు. మన మాతృ భాష ఏ భాషకూ తీసిపోదు. ఇంగ్లీషు భాష సర్వ రోగ నివారిణి అని నమ్మించే ప్రయత్నాలు పదే పదే జరుగుతూనే ఉంటాయి. మన వెనుకబాటు తనానికి తెలుగే కారణమని చెప్పే వారూ ఉంటారు. అంతకుమించిన అసత్యం ఇంకొకటి ఉండదు. అమెరికాకు వలస వచ్చిన తొలి తరాల తెలుగు వారంతా గ్రామీణ ప్రాంతాల వారే. వాళ్లంతా తెలుగు మీడియంలో చదివి.. మాతృ భాషకు పెద్ద పీట వేశారు.''- ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.