ETV Bharat / state

అప్పులపై బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ప్రభుత్వానికి ఉందా?: టీడీపీ

author img

By

Published : Feb 15, 2023, 5:56 PM IST

AP State Debts: రాష్ట్ర అప్పులపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని టీడీపీ అధికార జాతీయ ప్రతినిధి జీవీరెడ్డి సవాల్ చేశారు. రెండు సార్లు సవాల్‌ చేసినా వైఎస్సార్సీపీ నుంచి స్పందన లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.

Etv Bharat
Etv Bharat

AP State Debts: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని టీడీపీ అధికార జాతీయ ప్రతినిధి జీవీరెడ్డి సవాల్ చేశారు. ప్రభుత్వం చేసిన అప్పుల్లో కేవలం ఆర్​బీఐ ద్వారా తీసుకున్న అప్పులను మాత్రమే చూపించటం దారుణమన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలతో ప్రభుత్వానికి సంబంధం లేకుంటే గ్యారెంటీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. లిక్కర్ బాండ్లను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే బుగ్గన అప్పుల కోసం పొరుగు రాష్ట్రాలు, కేంద్రం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని జీవీ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పింఛన్లు ఎందుకు చెల్లించడం లేదని ఆక్షేపించారు.

రాష్ట్ర అప్పులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులు

బహిరంగ చర్చ: రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రావాలని రెండు సార్లు సవాల్‌ చేసినా వైఎస్సార్సీపీ నుంచి స్పందన లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. విభజన సమయంలో 2.62 శాతంగా ఉన్న రాష్ట్ర రెవెన్యూ లోటును టీడీపీ ప్రభుత్వం 2018-19 నాటికి 1.61 శాతానికి తగ్గిస్తే.. ఇప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో 3.60 కు పెరిగిందని మండిపడ్డారు. 2018లో 16 వేల కోట్లు ఉన్న రెవెన్యూ లోటు నేడు 40 వేల కోట్లకు ఎందుకు పెరిగిందో చెప్పాలని యనమల డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర అప్పులపై సరైన లెక్కలు: జగన్, బుగ్గన, విజయసాయి, సజ్జల దుష్టచతుష్టయంగా మారి, రాష్ట్ర రాజధానిపై పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పరుచూరి అశోక్ బాబులు మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై సరైన లెక్కలు చెప్పలేని స్థితిలో ఉన్న బుగ్గన, సిగ్గులేకుండా రాజధానిపై ప్రకటన ఎలా చేస్తాడని ప్రశ్నించారు. విశాఖపట్నం కేంద్రంగా, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని లూఠీ చేసిన జగన్ రెడ్డి, ఆయన పరివారం వారి ఆస్తుల్ని కాపాడుకోవడానికే రాజధాని వైజాగ్ అంటున్నారని ఎద్దేవా చేసారు. తెలివి లేదు కాబట్టే జగన్ రెడ్డి, మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు రాజధానిపై రోజుకోరకంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. 6 నెలల్లో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేసారు. రాష్ట్ర రాజధాని అమరావతి కాదని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.