ETV Bharat / state

TDP Kallu Teripiddam Program: జగనాసురుడి..'కళ్లు తెరిపిద్దాం' కార్యక్రమానికి విశేష స్పందన.. గంతలు కట్టుకుని నిరసన..

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 9:02 AM IST

TDP Kallu Teripiddam Program: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన కళ్లు తెరిపిద్దాం కార్యక్రమానికి తెలుగురాష్ట్రాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఎక్కడికక్కడే.. తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. 'నిజం గెలవాలి' అంటూ పెద్దఎత్తున నినదించారు. రాష్ట్రంలో జగనాసుర పాలన పోవాలని.. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షించారు.

TDP_Kallu_Teripiddam_Program
TDP_Kallu_Teripiddam_Program

TDP Kallu Teripiddam Program: జగనాసురుడి..'కళ్లు తెరిపిద్దాం' కార్యక్రమానికి విశేష స్పందన.. గంతలు కట్టుకుని నిరసన..

TDP Kallu Teripiddam Program: జగనాసురుడి.. 'కళ్లు తెరిపిద్దాం' పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణిలు హైదరాబాద్‌లోని తమ నివాసంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్రంలో గుడ్డిగా నియంత పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి కళ్లు తెరిపిద్దామంటూ కృష్ణాజిల్లా అవనిగడ్డ, నాగాయలంక, మొవ్వ, గన్నవరంలో నిరసనలు తెలిపారు.

ఎన్టీఆర్‌ జిల్లా కండ్రిగ, ప్రసాదంపాడులో తెలుగు మహిళలు, తెలుగు యువత నాయకులు నల్లరిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, చందర్లపాడులోనూ నిరసనలు కొనసాగాయి. టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరనస కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఆయన బయటికి రాకుండా కుట్రలు చేస్తోందని నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి, రాజధానిలోని తుళ్లూరు, దొండపాడు, వెంకటపాలెం, మందడం, పెనుమాకలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

TDP Kallu Teripiddam Program: జగనాసురుడికి 'కళ్లు తెరిపిద్దాం'.. మరో వినూత్న నిరసన కార్యక్రమానికి లోకేశ్ పిలుపు

వెంకటపాలెంలో మానవహారం నిర్వహించారు. పల్నాడు జిల్లా పెట్లూరివారిపాలెంలో నిరసన ప్రదర్శన చేశారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంతో పాటు చీరాల, అద్దంకి, దర్శిలో నిరసనలు కొనసాగాయి. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, కందుకూరు, కావలిలో ర్యాలీలు నిర్వహించారు.

ఏలూరు జిల్లా దెందులూరులో , తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, రాజమహేంద్రవరం లో తెలుగుదేశం కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో చంద్రబాబుకు తోడుగా మేము అంటూ నినాదాలు చేశారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ముమ్మిడివరంలో ఆందోళనలు నిర్వహించారు. అనకాపల్లిలో టీడీపీ కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలులోని టీడీపీ కార్యాలయంతో పాటు జిల్లాలోని పాణ్యం, ఆదోని, ఎమ్మిగనూరులో నిరసనలు కొనసాగాయి. సైకో పోవాలి సైకిల్‌ రావాలంటూ నంద్యాలలో నినాదాలు చేశారు.

Nara Lokesh Press Meet at Rajahmundry Central Jail: వ్యవస్థలను మేనేజ్‌ చేయడం వల్లే 50 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు: లోకేశ్

కడపలో టీడీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసనల్లో పాల్గొన్నారు. సత్యసాయి జిల్లాలోని కదిరి, తనకల్లు, గాండ్లపెంట ,తలుపుల, ధర్మవరంలో కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. తిరుపతి, నాయుడుపేటలో నూ నిరసనలు సాగాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట కొవ్వొత్తులతో, రాయచోటిలో కార్యకర్తలు తలనీలాలు సమర్పించి వినూత్నంగా నిరసన తెలిపారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, ఉరవకొండ, బెలుగుప్ప మండలాల్లో నిజం గెలవాలని శ్రేణులు నినదించాయి. రాయదుర్గంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు, అనంతపురంలో పరిటాల సునీత, శ్రీరామ్‌లు తమ నినాసాల వద్ద నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసల్లో పాల్గొన్నారు. విశాఖ జిల్లా సబ్బవరంలోని టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు నిరసన తెలిపారు. శ్రీకాకుళంలో జిల్లాలోని నరసన్నపేట, ఆమదాలవలస, జి.సిగడాం, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల్లో ప్రజలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. జిల్లాలోని రామభద్రపురంలో ప్రజలు కళ్లకు గంతలు కట్టుకుని వీధుల్లోకి వచ్చి బాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లా ధర్మవరం బీ గ్రామంలో చంద్రబాబు, ఎన్టీఆర్‌ అభిమానులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.

Nara Bhuvaneswari Nijam Gelavali Bus Yatra: బాబు అరెస్టుతో గుండెపగిలిన అభిమాన కుటుంబాలకు భువనమ్మ భరోసా.. 'నిజం గెలవాలి' యాత్ర షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.