ETV Bharat / state

'ప్రభుత్వం, ఉన్నతాధికారుల వైఖరితో తీవ్ర ఒత్తిడి, మనోవేదనకు గురవుతున్నాం'

author img

By

Published : Dec 20, 2022, 12:46 PM IST

Updated : Dec 22, 2022, 2:37 PM IST

AP VRO ASSOCIATION : ప్రభుత్వం, ఉన్నతాధికారుల వైఖరితో తీవ్ర ఒత్తిడి, మనోవేదనకు గురవుతున్నామని.. వీఆర్వోల సంఘం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. పని ఒత్తిడితో.. వీఆర్వోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలకు చెందిన వీఆర్వో సంఘాల నాయకులు విజయవాడలో సమావేశమై.. సమస్యలపై చర్చించారు.

AP VRO ASSOCIATION
AP VRO ASSOCIATION

AP VRO ASSOCIATION: ప్రభుత్వం, అధికారులు చెప్పిన పనులు సకాలంలో పూర్తి చేయలేక వీఆర్వోలు మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర వీఆర్వో సంఘ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదని.. కానీ తమపై విపరీతంగా పని భారం మోపుతున్నారని ఆందోళన చెందుతున్నారు. అన్ని జిల్లాలకు చెందిన వీఆర్వో సంఘాల నాయకులు విజయవాడలో సమావేశమై.. సమస్యలపై చర్చించారు. అనేక సంత్సరాల తర్వాత ఇన్నాళ్లకు సర్వే జరుగుతోందని, వీఆర్వోలు సర్వేలో నిమగ్నమై విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియ తప్పుల్లేకుండా చేయాలని కోరుకోవాలే కానీ వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు చెప్పడం సరికాదని ప్రతినిధులు మండిపడుతున్నారు. సర్వేను హడావుడిగా చేయడం వల్ల తప్పులు వచ్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీఆర్ఏల కొరత కారణంగా వీఆర్వోలపై పని భారం: గ్రామాల్లో వీఆర్ఎల కొరత తీవ్రంగా ఉందని, వీఆర్వోల నియామకాలు జరపకపోవడం వల్ల పని భారం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. గృహనిర్మాణ శాఖలో పనులు, ఎంపీడీవో కార్యాలయాల్లో సమావేశాలు ఇలా ప్రతి పనికీ వీఆర్వోలనే ఉపయోగిస్తున్నారని.. దీంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని వారు వాపోతున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. తాము మనుషులమే అని.. ఎన్ని పనులు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఒత్తిడి కారణంగా ఇబ్బందులకు గురువుతున్నామని, వీఆర్వోల సాధకబాధకాలను సీఎం దృష్టికి తీసుకెళ్లదామని తాము అనుకుంటే కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రికి వీఆర్వోలపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఆ సమయంలోపు బయోమెట్రిక్​ వేయకపోతే సెలవుగా నిర్ధరణ: వీఆర్వోలు ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదని, సచివాలయాల్లో బయోమెట్రిక్ వేయడం లేదని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. తాము బయోమెట్రిక్ వేయం అని చెప్పడం లేదని.. కానీ ఎక్కువగా బయట విధులు నిర్వహించే తాము ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో కనుక బయోమెట్రిక్ వేయపోతే సెలవుగా నిర్ధారిస్తున్నారని వాపోతున్నారు. ఉదయం 10 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3 నుంచి 5 లోపు రెండో సారి, సాయంత్రం 5 తర్వాత మరొకసారి బయోమెట్రిక్ వేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నారని వీఆర్వోలు తెలిపారు.

ఒకానొక సమయంలో రాత్రి పది గంటల వరకు గడప గడప కార్యక్రమం: రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ వేయాలంటే కష్టంగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రజా ప్రతినిధులు నిర్వహిస్తున్న గడకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా తాము పాల్గొంటున్నట్లు తెలిపారు. ఒకానొక రోజు గడపగడపకు కార్యక్రమం రాత్రి 10 గంటలు అవుతుందని అప్పటి వరకు కూడా తాము తిరుగుతున్నామని చెప్పారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా వీఆర్వోలు ఖాళీ లేకుండా విధులు నిర్వహిస్తున్న తమపై అధికారులు వేధింపులకు దిగుతున్నారని వాపోతున్నారు.

మాకు ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేదు: ఒక తహసీల్దార్ చనిపోతే రాష్ట్రంలో పెద్ద సంఘాలుగా చెప్పుకుంటున్న నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. గతంలో వీఆర్వో ఒకరూ ఆత్మహత్యాయత్నం చేస్తే సంఘం తరఫున వెంటనే స్పందించి ఆసుపత్రిలో చేర్పించి బతికించుకున్నామని తెలిపారు. తమకు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు నిర్దేశించిన సమయంలోనే తాము విధులు నిర్వహిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇతర శాఖలకు సంబంధించిన పనులు కూడా చేస్తున్నామన్నారు.

పని ఒత్తిడి కారణంగా మరణించిన వీఆర్వోలకు ఆర్థిక సాయం చేయాలి: అధికారుల వీడియో సమవేశాలు పనివేళల్లోనే పెట్టాలని వీఆర్వోలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అత్యవసర సమయాల్లో అయితే 24 గంటలూ విధులు నిర్వర్తిండానికి ఎప్పుడు వెనకాడేది లేదని స్పష్టం చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా మరణించిన వీఆర్వోల కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేసి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. రీసర్వే కోసం వీఆర్వోలు పెడుతున్న ఖర్చులను వెంటనే చెల్లించాలన్నారు. సర్వే వంద రోజుల్లోనే పూర్తి చేయాలన్న నిబంధన సడలించాలని కోరారు. ప్రస్తుతం వీఆర్ఎల నుంచి గ్రేడ్-2 వీఆర్వోలుగా పనిచేస్తున్న 3,795 మందికి ప్రొబేషన్ ఇచ్చి, పేస్కేల్ అమలు చేయాలన్నారు.

రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నామని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

'ప్రభుత్వం, ఉన్నతాధికారుల వైఖరితో తీవ్ర ఒత్తిడి, మనోవేదనకు గురవుతున్నాం'

ఇవీ చదవండి:

Last Updated : Dec 22, 2022, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.