ETV Bharat / state

చర్మంపై అకస్మాత్తుగా నల్లటి మచ్చలా.. బీ కేర్​ ఫుల్​.. స్క్రబ్‌ టైఫస్‌ కావచ్చు..!

author img

By

Published : Mar 27, 2023, 7:08 PM IST

Scrub Typhus Disease : గత సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలోని ఒకే గ్రామంలో 15 మందికి స్క్రబ్‌ టైఫస్‌ సోకి సంచలనం సృష్టించింది. ప్రజలలో అవగాహన లేని ఈ వ్యాధి.. ఇప్పటికి రాష్ట్రంలో అక్కడక్కడా సంక్రమిస్తూనే ఉంది. అయితే దీనిపై కొంత అవగాహన, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ప్రాణాంతకమేమి కాదని వైద్యులు అంటున్నారు.

Scrub Typhus Disease
స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి

Scrub Typhus : అకస్మాత్తుగా చర్మంపై నల్లటి మచ్చలు రావడంతోపాటు చలి, జ్వరం, తలనొప్పి ఉంటే.. స్క్రబ్‌ టైఫస్‌ బారిన పడినట్లు భావించాలని వైద్యులు చెబుతున్నారు. నల్లుల ఆకారంతో సూక్ష్మంగా కంటికి కనిపించని పురుగులు శరీరంపై కుట్టడం వల్ల.. కాలినట్లు మచ్చలు ఏర్పడతాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనీసం ఐదు రోజులపాటు ఉంటాయని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్దారణ కోసం ప్రత్యేక పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టైఫస్​ను గుర్తించేందుకు వైద్యశాఖ ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తోందని అధికారులు చెబుతున్నారు.

ప్రాణాంతకమేమీ కాదు : సాధారణంగా జ్వరం ఎంతకీ తగ్గకపోతే డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌గా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. మచ్చలు కనిపిస్తే మాత్రం ‘స్క్రబ్‌ టైఫస్‌’(బ్యాక్టీరియా) నిర్ధారణకు రక్తపరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ‘స్క్రబ్‌ టైఫస్‌ ప్రాణాంతకం కాదని.. ప్రజలు దీనిపట్ల కంగారు పడాల్సిన అవసరం లేదు’ అని వైద్యులు చెబుతున్నారు. పురుగులు ఎక్కువగా ఛాతీ, పాదాలు, పొట్ట, బుగ్గలపై కుడుతుంటాయని వివరించారు.

స్క్రబ్‌ టైఫస్‌ గురించి అవగాహన లేక, లోతైన విశ్లేషణలు జరగక, నమూనాల్ని పరీక్షించక.. సమస్య తీవ్రతపై దేశ వ్యాప్తంగా స్పష్టత ఉండటం లేదు. ఈ నేపథ్యంలో స్క్రబ్‌ టైఫస్‌ నిర్ధారణ పరీక్షలు పెంచాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రులలో విధులు నిర్వహించే.. ల్యాబ్‌ టెక్నీషియన్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. కిట్లను ఇచ్చి, ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది.

ఎలా సోకుతుంది : ఇళ్లలో, పెరటి మొక్కల్లో, చిత్తడి ప్రాంతాల్లో ఉండే నల్లుల వంటి చిన్న పురుగులు కుట్టడంతో స్క్రబ్‌ టైఫస్‌ సోకుతుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అధికారులు చెబుతున్నారు. ఇంటిలో ఉండే మంచాలలో, తడి ప్రాంతాలలో ఈ పురుగులు ఉంటాయి. ఎక్కువగా రాత్రి సమయాల్లో ఇవి మనుషులపై దాడి చేస్తుంటాయని మైక్రోబయాలజిస్ట్‌ చెబుతున్నారు. చెట్లు అధికంగా ఉండే ప్రదేశంలో, వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలు : ఈ వ్యాధి బారినపడిన వారిలో అకస్మాత్తుగా జ్వరం రావడం, తీవ్ర తలనొప్పి, చలి, కండరాల నొప్పి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. కళ్లు, తిరగడం, మగతతో పాటు వాంతులు అవుతుంటాయని తెలిపారు. మచ్చలు కనిపించినప్పుడు అపమ్రత్తమై చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర అనారోగ్యాలతో ఉన్న వారు ఈ వ్యాధి బారినపడితే న్యూమోనైటీస్, ఊపిరితిత్తుల సమస్యలు, ఎక్యూట్‌ రెస్పిరేటరీ డిస్టెన్స్‌ సిండ్రోమ్‌ వంటి భారీన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు.

శ్రీకాకుళంలో సంచలనం : గత సంవత్సరం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అప్పాపురం గ్రామంలో 15 మందికి స్క్రబ్‌ టైఫస్‌ జ్వరం వచ్చింది. ఒకే ప్రాంతంలో ఎక్కువమంది స్క్రబ్‌ టైఫస్‌ బారినపడటం అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసులు అడపాదడపా వస్తూనే ఉన్నాయని విజయవాడకు చెందిన చిన్నప్లిలల వైద్యులు రామారావు అన్నారు. అన్ని రకాల జ్వరాల మాదిరిగానే.. ఏ వయసు వారైనా స్క్రబ్‌ టైఫస్‌ బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సరైన యాంటీబయాటిక్‌ మందులు ఉన్నాయని తెలిపారు.

డాక్టర్​ పీవీ. రామారావు, వైద్యులు

"నూలి పురుగులను పోలి టిక్స్​ ఉంటాయి. ఇవి కుట్టటం వల్ల స్క్రబ్ టైఫస్ సంక్రమిస్తుంది. డెంగీ సోకినప్పుడు ప్లేట్​లెట్స్​ తగ్గినట్లుగా తగ్గే అవకాశం ఉంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచనల మేరకు వైద్య పరీక్షలు చేసుకోవాలి. సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రాణాంతకమేమీ కాదు." -డాక్టర్​ పీవీ. రామారావు, వైద్యులు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.