Illegal mining: ఎన్జీటీ బృందానికి అడుగడుగునా అడ్డంకులు.. ముళ్ల కంచెలు వేసి.. కందకాలు తవ్వి

author img

By

Published : Apr 22, 2023, 7:40 AM IST

Updated : Apr 22, 2023, 9:47 AM IST

Illegal mining

Illegal mining: మట్టి మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. స్థానిక అధికారులనే కాదు.. ఏకంగా జాతీయ హరిత ట్రైబ్యూనల్ బృందాన్ని సైతం అక్రమ మైనింగ్‌ జరిగే ప్రాంతంలో అడుగుపెట్టకుండా అడ్డంకులు సృష్టిచారు. కొత్తూరు తాడేపల్లి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేరుగా సబ్‌కలెక్టర్‌ వచ్చి అడిగినా.. గేట్ తాళాలు ఇవ్వలేదు. కాలినడకనే గట్లు, గుట్టలు దాటుకుంటూ ఎన్జీటీ బృందం మట్టి తరలించిన ప్రాంతాలను పరిశీలించింది. మైనింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవంటూ ప్రాథమికంగా నిర్థారించింది.

ఎన్జీటీ బృందానికి అడుగడుగునా అడ్డంకులు.. ముళ్ల కంచెలు వేసి.. కందకాలు తవ్వి

Illegal mining: వందల ఎకరాల్లో కొండలు, గుట్టులు మటుమాయమవుతున్నాయి...పోలవరం కాలువ గట్లు కనిపించకుండా పోతున్నాయి. చదును చేసిన భూముల్లో ఏకంగా పండ్ల తోటలు పెంచుతూ దర్జాగా దోచుకుంటున్నారు. ఇదీ ఎన్టీఆర్​ జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు.. కోర్టు ఆదేశాలు పట్టవు.. కలెక్టర్‌స్థాయి అధికారుల ఆదేశాలు బేఖాతరు.. వాహనాలు సీజ్ చేసినా మట్టి దందా ఆపేది లేదు. కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో అధికారపార్టీ నేతల అండదండలతో అక్రమదందా సాగిస్తున్నారు.

అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం.. చీకటిపడిందంటే చాలు.. మట్టి తరలించే లారీల మోతలతో ఈ ప్రాంతం దద్దరిల్లిపోవాల్సిందేనని స్థానికులు వాపోతున్నారు. కొత్తూరు తాడేపల్లి, నైనవరం, వెలగలేరు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌పై సమతా సైనిక్‌దళ్‌ ప్రతినిధి సురేంద్ర ఆధారాలతో సహా ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలు పరిశీలనకు ఎన్జీటీ ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయగా.. క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన అధికారులను మట్టిమాఫియా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసింది. మైనింగ్ జరిగే ప్రాంతాలకు వెళ్లకుండా రోడ్లను ఎక్కడికక్కడ తవ్వేయడంతో వారు నడుచుకుంటూ వెళ్లి అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు.

కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు మండలాల్లో అటవీభూములు, నీటిపారుదల శాఖ ,అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నిత్యం వందలాది లారీలతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. 10 నుంచి 15 అడుగుల మేర లోతు తవ్వి మట్టిని తరలించారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మట్టి తవ్వకాలు చేపట్టినట్లు ఎన్జీటీ బృందం గుర్తించింది.....

సీబీఐ విచారణ జరగాలని డిమాండ్.. సుమారు 780 ఎకరాల్లో వందల కోట్ల రూపాయల విలువ చేసే మట్టి, గ్రావెల్ తరలించారని ఫిర్యాదిదారుడు సురేంద్ర ఆరోపిస్తున్నారు. ఓ మంత్రి ,ఎమ్మెల్యేల అండతో అక్రమ దందా కొనసాగుతుందని చెబుతున్నారు . పిటీషన్లు వెనక్కి తీసుకోవాలని.. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని కొందరి నుంచి బెదిరింపులు వస్తున్నట్లు చెబుతున్నారు. ఏడు గ్రామాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరి నుంచి తక్కువ ధరకు అసైన్డ్ భూములను కొనుగోలు చేసి తవ్వకాలు జరుపుతున్నారని చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఎన్జీటీ బృందానికి తెలిపారు. భూముల్ని కాపాడాల్సిన కొందరు అధికారులు.. అక్రమార్కులకు అండగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు . ఈ దందాపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలవరం కట్టకు ప్రమాదం.. మట్టితవ్వకాలు కారణంగా గ్రామాల్లో కంటిమీద కునుకు లేకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాము వరుస ఫిర్యాదులు ఇవ్వటంతో గ్రామాల్లోకి రాకుండా వేరే మార్గం ద్వారా లారీలను తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తవ్వకాల కారణంగా వరదలొస్తే పోలవరం కట్టకు ప్రమాదం పొంచి ఉందని.. చుట్టుపక్కల గ్రామాలు మునిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రి అనుచరుల అండతో తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 22, 2023, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.