ETV Bharat / state

ప్రజాక్షేత్రంలోకి నారా లోకేశ్, ఈ నెల 27 నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 9:55 AM IST

Updated : Nov 23, 2023, 10:04 AM IST

Nara Lokesh Yuvagalam Padayatra Start Soon: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 27 నుంచి యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు. డిసెంబరు నెలాఖరు వరకు సాగే పాదయాత్ర విశాఖపట్నంలో ముగియనుంది. చంద్రబాబును సెప్టెంబరు 9న సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో.. లోకేశ్‌ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.

Nara_Lokesh_Yuvagalam_Padayatra_Start_Soon
Nara_Lokesh_Yuvagalam_Padayatra_Start_Soon

ప్రజాక్షేత్రంలోకి నారా లోకేశ్, ఈ నెల 27 నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం

Nara Lokesh Yuvagalam Padayatra Start Soon: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 27 నుంచి 'యువగళం' పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు. డిసెంబరు నెలాఖరు వరకు సాగే పాదయాత్ర విశాఖపట్నంలో ముగియనుంది. టీడీపీ అధినేత చంద్రబాబును సెప్టెంబరు 9న సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో.. లోకేశ్‌ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిలు లభించడంతో పాదయాత్ర కొనసాగించాలని లోకేశ్‌ నిర్ణయించారు.

రాష్ట్రంలో అధికార వైసీపీను గద్దె దించటమే లక్ష్యంగా ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేశ్‌.. సెప్టెంబరు 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో పాదయాత్రకు విరామం ప్రకటించారు. అక్కడి నుంచే ఈ నెల 27న పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది.

'మేం జగన్ పాదయాత్రను అడ్డుకోలేదు.. అలాంటప్పుడు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు'

అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలన్నది మొదట అనుకున్న లక్ష్యం. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, దిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు, జగన్‌ ప్రభుత్వ అరాచకాలు, కక్షసాధింపుపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకుల్ని కలిసి వివరించడం వంటి వ్యవహారాల్లో ఇన్నాళ్లూ తీరిక లేకుండా ఉన్నారు.

దీంతో రెండున్నర నెలల పాటు పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నికలు మరింత దగ్గరపడుతుండటంతో.. ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయాలన్న లక్ష్యాన్ని కుదించుకుని, విశాఖపట్నంలో ముగించనున్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర కూడా విశాఖలోనే ముగించారు. ఆ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చేలా లోకేశ్‌ విశాఖలో పాదయాత్ర ముగించే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనికి తగ్గట్టుగా రూట్‌మ్యాప్‌ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి.

ప్రజల మధ్య ఉండాల్సిన సీఎం.. పరదాల చాటున తిరుగుతున్నారు: లోకేశ్​

పాదయాత్రకు విరామం ప్రకటించే నాటికి లోకేశ్‌ 208 రోజుల్లో 2,852.4 కి.మీ.ల దూరాన్ని పూర్తి చేశారు. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 84 నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి అవరోధాలు సృష్టించేందుకు వైసీపీ సర్కారు అనేక ప్రయత్నాలు చేసింది. చిత్తూరు జిల్లాలో ప్రచారరథంతో పాటు.. లోకేశ్‌ నిలబడి మాట్లాడే స్టూల్, మైక్‌ను సైతం పోలీసులు లాక్కుని గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైంది మొదలు తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కి.మీ.లకు ఒకటి చొప్పున పోలీసులు 25 కేసులు నమోదు చేశారు.

ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. పాదయాత్రకు దాదాపు అన్ని చోట్లా మంచి స్పందన లభించింది. పాదయాత్ర సాగిన 84 నియోజకవర్గాల పరిధిలో 66 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. యువత, మహిళలు, రైతులు, ముస్లింలు.. ఇలా వివిధ వర్గాలతో 11 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్రలో లోకేశ్​కు 4 వేలకు పైగా వినతిపత్రాలు అందాయి.

Yuvagalam Padayatra: యువగళం పాదయాత్ర 1700 కిలోమీటర్లు పూర్తి.. డక్కిలిలో శిలాఫలకం ఆవిష్కరణ

Last Updated : Nov 23, 2023, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.