ETV Bharat / state

Medical seats: తెలంగాణలో మరో వైద్య కళాశాలకు గ్రీన్​సిగ్నల్

author img

By

Published : Oct 29, 2022, 1:16 PM IST

Medical seats in Telangana : తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య పెంపుతో.. ఎంబీబీస్​ సీట్లు సంఖ్య కూడా పెరిగాయి. తాజాగా మంచిర్యాలలో కళాశాలకు అనుమతి లభించడంతో మొత్తం సీట్ల సంఖ్య 6,302కి చేరుకున్నాయి. దీంతో వైద్య విద్యను అభ్యసించే వైద్య విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MBBS Seats
ఎంబీబీస్​ సీట్లు

Medical seats Increase in Telangana: తెలంగాణలో మరో ప్రభుత్వ వైద్యకళాశాలకు అనుమతి లభించింది. మంచిర్యాలలో 100 ఎంబీబీఎస్‌ సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి, కళాశాల ప్రధానాచార్యుడికి లేఖలు పంపించింది. దీంతో ఈ ఏడాది (2022-23)కి కొత్తగా మంజూరైన కళాశాలలు ఎనిమిదికి చేరాయి. అదనంగా 1,150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,852, ప్రైవేటులో 2,900, మైనారిటీ విభాగంలో 550 చొప్పున మొత్తం సీట్లు 6,302కి పెరిగాయి.

నిబంధనలను పాటించని కారణంగా గత ఏడాది 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున రద్దు చేసిన మహావీర్‌, టీఆర్‌ఆర్‌ కళాశాలలకు ఈ ఏడాది కూడా అనుమతులు రాలేదు. దీంతో 300 సీట్లు అందుబాటులో లేవు. అవి కూడా వస్తే మొత్తం సీట్లు 6,602 ఉండేవని వైద్యవర్గాలు తెలిపాయి. కన్వీనర్‌ కోటాలో తొలివిడత వైద్య విద్య ప్రవేశ ప్రకటన ఇప్పటికే వెలువడగా.. మంచిర్యాల సీట్లను కూడా చేర్చనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి.

రెండేళ్లలో 17 వైద్య కళాశాలలు.. కొత్తగా 8 కళాశాలల ఏర్పాటుతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది. కొత్తగా సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, రామగుండంలలో వైద్య కళాశాలలు నెలకొల్పేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. వీటి కోసం 430 పోస్టుల భర్తీకి అఖిలభారతస్థాయిలో నియామక ప్రకటనలు వెలువరించింది. కొన్ని విభాగాల్లో ఆశించిన స్పందన రాకపోవడంతో కొందరిని స్థానికంగా సర్దుబాటు చేసింది. మంచిర్యాల మినహా ఏడు కళాశాలలకూ 150 సీట్ల చొప్పున ఎన్‌ఎంసీ ఇంతకుముందే అనుమతులు మంజూరు చేసింది.

వీటిలో 1,050 ఎంబీబీఎస్‌ సీట్లకు ప్రవేశ ప్రక్రియ కూడా మొదలైంది. మంచిర్యాలకు మాత్రం అనుమతులు ఆలస్యమయ్యాయి. కొత్త ఆసుపత్రి నిర్మాణంలో వెనుకబాటు, మౌలిక వసతులు, మానవ వనరుల కొరత కారణాలతో ఎన్‌ఎంసీ అనుమతులను నిరాకరిస్తూ వచ్చింది. కొద్ది వారాల కిందట మరోసారి తనిఖీలకు వచ్చిన ఎన్‌ఎంసీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ 150 సీట్లలో 50 తగ్గించి.. 100 సీట్లకు పచ్చజెండా ఊపింది. వచ్చే ఏడాది జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్‌, వికారాబాద్‌, నిర్మల్‌, సిరిసిల్ల, కామారెడ్డిలలో మరో 9 వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వపరంగా సన్నాహాలు కొనసాగుతున్నాయి. వాటిలో 100 చొప్పున అదనంగా 900 సీట్లు వస్తాయని వైద్యవర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.