ETV Bharat / state

Soil Excavations: " మట్టి మాయగాళ్లు"!.. తవ్వుకో..అమ్ముకో..తినుకో

author img

By

Published : Apr 28, 2023, 8:53 AM IST

Soil Excavations
Soil Excavations

Illegal Soil Excavations: ప్రకృతి అంటేనే పచ్చని చెట్లు, కొండలు, గుట్టలు, జలవనరుల సమాహారంగా అలరారుతూ ఉంటుంది. కానీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఇవన్నీ చరిత్రలో కలిసిపోయేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మట్టి మేతగాళ్ల నిబంధనలకు నిలువునా పాతరేస్తున్నారు. అనుమతుల సంగతి దేవుడెరుగు.. కనీసం ప్రశ్నించేందుకు అధికారులెవరూ ముందుక రాని పరిస్థితుల్లో.. నిరాటంకంగా అక్రమాలను కొనసాగిస్తున్నారు. కొండల్ని పిండి చేసేస్తున్నారు. చెరువులను చెరపట్టిస్తున్నారు. కాల్వలను కనిపించకుండా మాయం చేస్తున్నారు. ఇష్టారీతిగా తవ్వుకో, అమ్ముకో, తినుకో అని నయా దోపిడీ సూత్రాన్ని పాటిస్తున్నారు.

" మట్టి మాయగాళ్లు"!.. తవ్వుకో..అమ్ముకో..తినుకో

Illegal Soil Excavations in Various Districts: రాష్ట్రంలో ఎక్కడ చూసినా మట్టి మాఫియా ఆగడాలే దర్శనమిస్తున్నాయి. పోలవరం కుడి, ఎడమ కాల్వల గట్లను ఎడాపెడా తవ్వేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. కుడికాల్వ గట్లపై అనుమతి లేకున్నా, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కీలక ప్రజాప్రతినిధుల అండతో తవ్వకాలు జరుపుతున్నారు. విజయవాడ గ్రామీణ మండలం నుంచి బాపులపాడు మండలం వరకు 30 కిలో మీటర్ల మేర ప్రతి అర కిలో మీటర్‌కు ఒక రీచ్‌ ఏర్పాటు చేసి, 20 అడుగుల లోతు తవ్వేస్తున్నారు.

ఫిర్యాదు వెళ్తున్నా.. పట్టించుకునే వారు లేరు: నున్న ప్రాంతంలో తవ్వుతున్న మట్టి వైసీపీ నేతల అనధికారిక స్థిరాస్తి వెంచర్లకు తరలిపోతోంది. గన్నవరం పరిధిలో మైనింగ్‌పై ఫిర్యాదులు వెళ్తున్నా.. పట్టించుకునేవారు లేరు. తవ్వకాల్ని వ్యతిరేకించినందుకు జలవనరుల శాఖ అధికారులు ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేసి, అనుకూలంగా ఉండేవాళ్లను నియమించుకున్నారు. ఇటీవల YSR జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉమ్మడి కృష్ణాలో జగనన్న లేఔట్లలో చదునుచేసే పనిని కాంట్రాక్టుకు తీసుకున్నాడు. పోలవరం గట్టు మట్టిని అక్కడికి తరలిస్తానని చెప్పి, బయట అమ్మేసుకున్నారు.

150ఎకరాల్లో మీటర్ల లోతున మట్టి తవ్వకాలు: విజయవాడ శివారు కొత్తూరు తాడేపల్లిలో అనుమతుల్లేకుండా అసైన్డ్, అటవీ, పోరంబోకు భూములు 150 ఎకరాల్లో మీటర్ల లోతున మట్టి తీశారు. ఓ ఎంపీ, ఓ మంత్రి తమ బినామీలతో గ్రావెల్‌ తవ్వించి విజయవాడ బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి తరలిస్తున్నారు. సీనరేజి చెల్లించడం లేదు. దీనిపై ఎన్జీటీకి ఫిర్యాదులు అందగా, సబ్‌కలెక్టర్‌ అదితిసింగ్‌ విచారణకు వెళ్లారు. గనులు, జలవనరుల శాఖల అధికారులు విచారణకు గైర్హాజరై సహకరించలేదు.

అనుమతి గోరంత.. తవ్వేది కొండంత: కొండపల్లి అభయారణ్యంలోనూ దాదాపు 100 కోట్ల విలువైన గ్రావెల్‌ తవ్వేశారు. ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం భీమవరంలోని కొంగర మల్లయ్య దేవస్థానం గుట్టపై 3.82 హెక్టార్లలో తవ్వకాలకు అనుమతి పొంది, కొండ మొత్తం తొలి చేశారు. 155.79 ఎకరాల విస్తీర్ణం గల కొండ వెనుక భాగం రూపు కోల్పోయింది. విస్సన్నపేట మండలం కొండపర్వలోని మల్లయ్యస్వామి గుట్టపై దేవాలయం, నవగ్రహ మండపం పక్కనే మట్టి తవ్వారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు, శలపాడు, వీఎన్‌పాలెంలో లభించే నాణ్యమైన ఎర్రమట్టికి మంచి గిరాకీ ఉంది. ఇక్కడ మట్టి మాఫియా ప్రైవేటు భూములను ఎకరం 40 లక్షల రూపాయల చొప్పున కొని మైనింగ్‌ చేస్తోంది. ప్రజాప్రతినిధులకు ముడుపులతో పాటు, ఆదాయంలోనూ వాటా ఇస్తోంది. 20 అడుగుల లోతుకు తవ్వేందుకు అనుమతులుండగా, 100 అడుగులకుపైగా తవ్వుతున్నారు. భారీ గోతుల్లో వర్షపు నీరు నిలిచి, పశువులు పడి చనిపోతున్నాయి.

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం త్రిపురాపురం కొండ అద్దంకి-నార్కట్‌పల్లి రహదారికి సమీపంలోనే ఉండటం, అక్కడి మట్టి నాణ్యమైంది కావడంతో భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. మట్టి టిప్పర్లు నకరికల్లు తహసీల్దారు కార్యాలయం ముందునుంచే నరసరావుపేటకు వెళ్తున్నా రెవెన్యూ యంత్రాంగం అడ్డుకోవడం లేదు. సమీపంలోని బెల్లంకొండ బ్రాంచి కెనాల్‌ కట్టలనూ తవ్వేశారు.పెదకూరపాడు నియోజకవర్గంలోని పాటిబండ్లలో 8 ఎకరాల చెరువులో 10 అడుగుల లోతు వరకు అక్రమంగా తవ్వేశారు.

ముస్సాపురంలో 10 ఎకరాల తాగునీటి చెరువులోనూ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు గ్రామంలోని పెద్దకుంట చెరువులో అక్రమ తవ్వకాలు జరిగాయి. పుల్లడిగుంట, కుర్నూతల గ్రామాల్లోని చెరువుల్లో అనుమతులకు మించి తవ్వేశారు. బాపట్ల జిల్లా నగరం మండలం కమ్మవారిపాలెం నుంచి నిజాంపట్నం పాలరేవు వరకు 10 కిలో మీటర్ల మేర మురుగునీటి కాల్వల గట్లను యంత్రాలతో తవ్వేసి.. మట్టిని లారీల్లో రేపల్లె, పొన్నూరు, బాపట్ల, గుంటూరుకు తరలించారు.

ప్లేస్​ ఏదైనా.. తవ్వడమే ముఖ్యం: విజయనగరం జిల్లాలో తోటపల్లి జలాశయం ప్రధాన కుడి కాల్వ వెంబడి 12.5 మీటర్ల ఎత్తులో మట్టికట్టలుండేవి. నేడు చాలా వరకు కొల్లగొట్టారు. గరివిడి మండలం చుక్కవలస సమీపంలో రాత్రి వేళల్లో గట్టు తవ్వేసి లారీల్లో తరలిస్తున్నారు. చీపురుపల్లి-లావేరు రోడ్డు సమీపంలో గజపతినగరం బ్రాంచి కాల్వ కట్టను 30 సెంట్ల విస్తీర్ణంలో తవ్వేశారు.

చుక్కవలస, కాపుశంభాం, కొండశంభాం పరిధిలోనూ కాల్వ గట్లు బలహీనపడ్డాయి. వేపాడ, కొత్తవలస, విజయనగరం, గజపతి నగరంలో గ్రావెల్ కనిపిస్తే చాలు.. అక్రమార్కులు తెగ తవ్వేస్తున్నారు. కాలువా, చెరువా, గెడ్డా, కొండ అని ఏమీ చూడకండా మట్టి కొల్లగొడుతున్నారు. మరి కొందరు ఏకంగా కొండలనే తవ్వేస్తున్నారు.

అక్రమార్కులు చెరువు గర్భాలను తవ్వేస్తున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో సుమారు 330 చెరువులు ఉంటే.. 290 చెరువుల్లో., ఎస్.కోట మండలం వెంకటరమణపేటలోని చెరువులను తవ్వేశారు. చీపురుపల్లి మండల పరిధిలోని తోటపల్లి ప్రధాన కాలువ, గజపతినగరం పిల్లకాలువ నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.

సీజ్​ చేసిన నాలుగు రోజుల్లోనే మళ్లీ రిలీజ్​: విజయనగరం శివారులోని కొండకరకం గ్రామంలో కొండను అర్ధరాత్రుల్లో పొక్లైన్‌లతో తొలిచేస్తున్నారు. ఈ అక్రమంపై పత్రికల్లో కథనాలు రాగా.. పోలీసులు దాడి చేసి యంత్రాలు సీజ్‌ చేశారు. అక్రమార్కులు జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేత అనుచుచరులు కావడంతో, నాలుగు రోజుల్లోనే వాటిని వదిలేశారు. స్థానిక తహసీల్దార్‌ వీఆర్వోలకు వంతుల వారీగా డ్యూటీలు వేసి కొంతకాలం పర్యవేక్షించినా, ఇప్పుడు తాజాగా తవ్వకాలు ప్రారంభమయ్యాయి.

తహసీల్దార్‌ ఫిర్యాదుకూ పోలీసులు స్పందించలేదు. గంట్యాడ మండలంలో 150 చెరువుల్లో అనుమతి లేకుండా మట్టి తీశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పీఎన్‌ బొడ్డవలస సమీపంలోని కొండపోరంబోకును అనధికారికంగా తవ్వేశారు. కురుపాం మండలం శివన్నపేటలోని సోమసాగరం, ఎర్రచెరువు, అప్పన్న చెరువు, లంకెల చెరువుల్లో ఇష్టానుసారంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో 105 ఎకరాల్లోని అక్కయ్యపాలెం కొండపై 6 ఎకరాల్లో అనుమతులు పొంది, మొత్తం మట్టి కొల్లగొట్టేశారు. బూర్జ మండలం కందికొండ వద్ద ఎర్రమట్టి కోసం 30 అడుగుల లోతున తవ్వారు. అనేక చెట్లను కూల్చేశారు. పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో హుద్‌హుద్‌ బాధితులకు నిర్మించిన ఇళ్ల వెనుక కొండను తవ్వేశారు.

పలాస మండలం కొసంగిపురం సమీపంలో జగనన్న కాలనీకి ఆనుకుని ఉన్న కొండ, నెమలి నారాయణ పురం సమీపంలోని కొండ.. దాదాపు కనుమరుగు అయిపోతున్నాయి. అధికారులు మాత్రం కనీసం పట్టించు కోవడం లేదు. పాతపట్నంలోని కేజీబీవీ పాఠశాల ఉన్న కొండ ప్రాంగణాన్ని ఖాళీ చేశారు.

విశాఖలో 6 వేల ఏళ్ల క్రితం ఏర్పడి, భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బలనూ మట్టి మాఫియా జేసీబీలతో తొలిచేసింది. ఈ మట్టిని తరలించేందుకు ఐఎన్‌ఎస్‌ కళింగ నౌకాదళ స్థావరం నుంచి నేరెళ్లవలస మధ్య మూణ్నాలుగు చోట్ల అక్రమంగా రోడ్లు నిర్మించింది.

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో 20-30 అడుగుల ఎత్తైన మట్టికుప్పలున్న 23 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించారు. వాటి చదును పనిని దక్కించుకున్న గుత్తేదారు.. మట్టి తీసే క్రమంలో నేలను 30-40 అడుగుల లోతుకు తవ్వి, చెరువుగా మార్చాడు. ఇప్పుడా లోతును పూడ్చే పనిని మళ్లీ ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. గతంలో మట్టి తవ్విన గుత్తేదారు నుంచి టెండర్‌ సొమ్ము రూపేణా 34 లక్షల రూపాయలు రాగా, కొల్లగొట్టిన సంపద కోట్ల రూపాయల్లో ఉంటుంది. గుంతల్ని పూడ్చేందుకు ఇప్పుడు మరోచోటు నుంచి గ్రావెల్‌ తరలించడానికి 70 లక్షల రూపాయల వరకూ వెచ్చిస్తున్నారు.

కాకినాడ జిల్లా పెద్దాపురం-గండేపల్లి మండలాల మధ్య రామేశ్వరం మెట్టలో ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలో దళితులకు అసైన్‌ చేసిన 570 ఎకరాలతో పాటు, మరో 350 ఎకరాల్లోని ఎర్రమట్టి కొండల్ని తాజాగా కొల్లగొట్టారు. దీని వెనుక జగన్‌కు సన్నిహితుడిగా చెప్పుకొనే ఓ ఎమ్మెల్యే హస్తముందన్న ఆరోపణలున్నాయి. కాకినాడ జిల్లా తుని మండలంలో పోలవరం ఎడమ కాల్వ తవ్వగా వచ్చిన మట్టిని అక్కడక్కడ గుట్టలుగా పోయగా, అక్రమార్కులు ఎత్తుకుపోయారు.

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం నుంచి నీలాద్రిపురం మీదుగా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం వరకూ తాడిపూడి కాల్వ గట్టు అనధికారికంగా తవ్వేస్తున్నారు. కైకరం, తిమ్మయ్యపాలెం, నాచుగుంట, వెల్లమిల్లి గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత పేరుతో స్థానిక నేతలు మట్టి తీస్తున్నారు. వైసీపీ నేత ఒకరు ఉంగుటూరులోని 120 ఎకరాల చెరువు నుంచి అక్రమంగా 13 వేల ట్రక్కుల మట్టిని తరలించారు.

జంగారెడ్డిగూడెం మండలంలో ఎర్రకాల్వ గర్భంలోనూ మట్టి కొల్లగొడుతున్నారు. దేవులపల్లిలోని విజ్జువారికుంట చెరువులో కొద్దిమొత్తంలో తవ్వకాలకు అనుమతులు తీసుకుని పూర్తిగా ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి, టి. నర్సాపురం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, తాడేపల్లిగూడెం మండలాల్లో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో కొండ గుట్టలను రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలు, టిప్పర్లు పెట్టి తవ్వేస్తున్నారు.అధికారులకు తెలిసినా.. కన్నెత్తి చూడటం లేదు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సోమశిల ఉత్తర కాల్వకు పక్కనే గ్రావెల్‌ తవ్వుతున్నారు. కావలి నియోజకవర్గలో మట్టి మాఫియా పేట్రేగిపోతుంది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా చెరువులు తవ్వేస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కోడేరు అడవుల్లోంచి టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. దుర్గసముద్రం వద్ద కొండను తొలిచేశారు.ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 50 ఎకరాల్లో 15 మీటర్ల లోతున ఎర్రమట్టి తవ్వేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.