ETV Bharat / state

బీఎఫ్‌ 7పై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. విమానాశ్రయాలలో స్క్రీనింగ్‌ పరీక్షలు

author img

By

Published : Dec 24, 2022, 9:08 PM IST

Updated : Dec 25, 2022, 6:34 AM IST

కరోనా
Covid Tests

Covid Tests All Airports in AP: చైనాతో పాటు ఇతర దేశాల్లోనూ పంజా విసురుతున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఉపరకం బీఎఫ్‌ 7 వైరస్‌పై ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తాజాగా శనివారం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్‌ పరీక్షలతో పాటు 2శాతం మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించింది. గన్నవరం, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాలలో కొవిడ్ నిబంధనలను కేంద్రం ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో భాగంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్​లు ఏర్పాటు చేశారు.

Covid Tests Omicron Subtype BF.7 Screening Tests All Airports In AP: చైనాతో పాటు ఇతర దేశాల్లోనూ పంజా విసురుతున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఉపరకం బీఎఫ్‌.7 వైరస్‌పై ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తాజాగా శనివారం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. విమానాశ్రయాల్లో నిన్నామొన్నటి వరకు విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్‌ పరీక్షలు మాత్రమే నిర్వహించేవారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్‌ పరీక్షలతో పాటు 2శాతం మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించింది. ఎటువంటి తేలికపాటి కొవిడ్‌ లక్షణాలను కలిగి ఉన్నా వారికి కూడా పరీక్షలు చేసి.. వైద్య పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించింది. దీంతో శనివారం రేన్‌డమ్‌గా కరోనా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించిందన్న వార్తలతో ఏపీ సర్కార్‌ ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో విమానాశ్రయంలో వైద్య బృందం సంఖ్య 17కి చేరింది. ఇద్దరు వైద్యాధికారులు, 15 మంది పారామెడికల్‌ సిబ్బందికి విధులు కేటాయించారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా వారంలో మూడ్రోజుల పాటు షార్జా, కువైట్‌ విదేశీ సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. సదరు ప్రయాణికులు 72గంటల్లో కొవిడ్‌ నిర్ధారణ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష, రెండు డోసుల వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలు తప్పనిసరిగా విమానాశ్రయంలో చూపించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ప్రయాణికుడిని విమానాశ్రయం వెలుపలికి వెళ్లనివ్వకుండానే అడ్డుకోవడం జరుగుతుంది. విమానాశ్రయంలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించిన ప్రయాణికుడిని హోమ్‌ ఐసోలేషన్‌లో వారం రోజులపాటు ఉండేలా సూచనలిస్తారు. రాష్ట్రం చేరిన ప్రయాణికుడి ఇంటి సమీపంలోని ఆరోగ్య కార్యకర్తకు సమాచారం చేరవేసి అతడి ఆరోగ్య పరిస్థితిపై వారం రోజులపాడు ప్రత్యేక నిఘా ఉండేలా ఏపీ సర్కార్‌ చర్యలు చేపట్టింది.

విదేశీ ప్రయాణికులకు రెండు శాతం పరీక్షలు చేస్తారు సరే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఒమెక్రాన్‌ బీఎఫ్‌.7 వేరియంట్‌ కేసులు నమోదయ్యాయన్న వార్తలు లేకపోలేదు. ఈనేపథ్యంలో దేశీయ ప్రయాణికుల నుంచి వైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశించే ముప్పు లేదనడానికి వీల్లేదు. చెన్నైలో కొత్త వేరియంట్‌ కేసులు హల్చల్‌ చేస్తున్నా.. అక్కడి నుంచి విజయవాడ చేరే ప్రయాణికులపై ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. నిత్యం బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి మూడేసి చొప్పున దిల్లీ నుంచి రెండు, చెన్నై నుంచి ఓ సర్వీసు నడుస్తుండటం విశేషం.

ప్రపంచంలో నిషేధం ఉన్న దేశాల నుంచి విజయవాడకు నేరుగా ప్రయాణికులు వచ్చేందుకు వీల్లేదు. విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించే గల్ఫ్‌ దేశాల్లో ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. పొరపాటుగా ఏమూల నుంచి వైరస్‌ దరిచేరి ఉంటుందని భావించినా.. విమానాశ్రయంలో నిర్వహించే నూరుశాతం ఆర్‌టీపీసీఆర్‌తో సత్వరమే అరికట్టవచ్చు. సేకరించిన నమూనా రిపోర్టులను 24 గంటల్లో వచ్చేలా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఒమెక్రాన్‌ బీఎఫ్‌.7పై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. శనివారం షార్జా నుంచి 138మంది ప్రయాణికులు తరలిరాగా.. తేలికపాటి లక్షణాలున్న అనుమానిత, రెండుశాతం ప్రయాణికులకు (ఓ యువకుడు, వృద్ధుడు, మధ్య వయస్కులకు) పరీక్షలు చేశాం.

ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న కొవిడ్‌లోని ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7 ఉపరకం వైరస్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా వైద్యాధికారిణి గీతాబాయ్‌ తెలిపారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షార్జా విదేశీ సర్వీసు రాకపోకలను పురస్కరించుకొని ఆవరణలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని డైరెక్టర్‌ లక్ష్మికాంతరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా గీతాబాయ్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిబంధనలను కట్టుదిట్టం చేశామని చెప్పారు. ప్రయాణికులందిరికీ స్క్రీనింగ్, రెండు శాతం, తేలికపాటి కొవిడ్‌ లక్షణాలున్న వారికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం వారిని ఫలితాలు వచ్చే వరకు వైద్య, ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో ఉంచనున్నట్లు చెప్పారు. ఎక్కడో కదా మనకెందుకన్న భావన మరచి ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. విమానాశ్రయంలో మొత్తం 15మంది సిబ్బందితో విదేశీ ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్ నిబంధనలను కేంద్రం ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో భాగంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు చేశారు. విశాఖకు నేరుగా వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల వివరాలను నమోదు చేయడం, వారికి కొవిడ్ పరీక్షలకు అవసరమైన నమూనాలను సేకరించేందుకు ప్రత్యేక బూత్ లను ఏర్పాటు చేసినట్టు విమానాశ్రయ డైరక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం విశాఖ కు స్కూట్స్ విమానయాన సంస్ధకు చెందిన సర్వీసు నేరుగా సింగపూర్ నుంచి విమానాన్ని నడుపుతోంది. రాత్రి పది గంటల సమయంలో ఈ విమానయాన సంస్ధ నడిపే సర్వీసు నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ నిబంధనల ప్రకారం వివరాలను నమోదు చేసే రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి

Last Updated :Dec 25, 2022, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.