"నువ్వు పోటుగాడివా.." "నువ్వే ఊసరవెల్లి.."

author img

By

Published : Jan 25, 2023, 12:58 PM IST

CONFLICTS BETWEEN YSRCP MLAs

CONFLICTS BETWEEN YSRCP MLAs : వైఎస్సార్సీపీలో కుమ్ములాటలు నిత్యకృత్యం అవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి పుట్టినరోజుకు హాజరైన ఇద్దరు ప్రజాప్రతినిధులు పరుషపదజాలంతో దూషించుకున్నారు. "నువ్వేంటి.. నీ లెక్కేంటీ" అంటూ తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇంతకీ ఆ నాయకులు ఎవరు? వారి మధ్య వాగ్వాదానికి గల కారణాలు ఏంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

CONFLICTS BETWEEN YSRCP MLAs : ఎన్టీఆర్​ జిల్లా వైఎస్సార్సీపీలో విభేదాలు బయటపడ్డాయి. విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చిన.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య.. తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వెల్లంపల్లి.. తన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడిని సీఎం వద్దకు ఎలా తీసుకెళ్తారంటూ పరుష పదజాలంతో ఉదయభానును నిలదీశారు.

వెల్లంపల్లి మాటలకు తొలుత మౌనంగా ఉండిపోయిన ఉదయభాను .. కాసేపటికే తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. ‘పార్టీలో సీనియర్‌ లీడర్‌ను. నీలా పదవి కోసం మారలేదు. మూడు పార్టీలు మారిన ఊసరవెల్లివి నువ్వు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు నాకు చెప్పేదేంటి...’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో వెల్లంపల్లి పైకి దూసుకెళ్లారు. బొప్పన భవకుమార్‌ అనుచరులు వెంటనే అక్కడికి చేరుకుని పుట్టినరోజు కార్యక్రమ వేదిక వద్ద ఈ వివాదాలు ఏమిటంటూ ఉదయభానును.. వెల్లంపల్లిని విడివిడిగా అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.

ఇదీ నేపథ్యం: క్షణాల వ్యవధిలో ఈ ఘటన జరిగిపోయింది. ఊహించని రీతిలో బయటపడిన ఈ విభేదాలకు కారణం.. ఓ వివాహ ఆహ్వానం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆకుల శ్రీనివాసరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి ఓటమి పాలయ్యారు. ఇటీవల కాలంలో ఆకుల వైసీపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గతవారం ఉదయభాను తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడ ఆకుల శ్రీనివాస్‌ ఎదురుపడ్డారు. ఈ నెల 28న తన కుమార్తె వివాహమని, సీఎం జగన్‌కు ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చానని ఆకుల తెలిపారు. ఉదయభాను తనతో పాటు శ్రీనివాస్‌ను సీఎం వద్దకు తీసుకువెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందజేయించారు. తన మీద పోటీచేసిన వ్యక్తిని జగన్‌ వద్దకు తీసుకెళ్లడంపై వెల్లంపల్లి మంగళవారం ఉదయభానుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.