ETV Bharat / state

ముగిసిన సీఎం దిల్లీ పర్యటన.. చివరి రోజు అమిత్​షాతో భేటీ

author img

By

Published : Dec 29, 2022, 10:35 PM IST

CM Jagan Delhi Tour : ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానిని, కేంద్ర హోం శాఖ, అటవీ పర్యావరణ శాఖ మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయినట్లు సీఎంఓ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

CM Jagan Delhi Tour
సీఎం దిల్లీ పర్యటన

CM Jagan Delhi Tour : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌ బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ, పర్యావరణ శాఖ మంత్రి వద్ద ప్రస్తావించిన అంశాలనే అమిత్​షా వద్ద ప్రస్తావించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిని కోరినట్లు పేర్కొంది. అందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించడానికి సిద్దంగా ఉందని వివరించారని వెల్లడించింది. తాజా కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని వివరించారని తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న చాలా అంశాలు ఇప్పటికీ నెరవేర్చలేదని.. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని అమిత్​షా దృష్టికి తీసుకువచ్చినట్లు సీఎంఓ ప్రకటనలో పేర్కొంది.

2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిలు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు, ఇతర శాఖల నుంచి రావాల్సిన మొత్తం సుమారు 32 వేల 625 కోట్లు పెండింగ్​లో ఉన్నాయని హోం మంత్రికి వివరించినట్లు తెలిపింది. వాటిని వెంటనే మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి అమిత్​షాను కోరినట్లు వివరించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2 వేల 937 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదని.. దానిని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు పేర్కొంది. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన 6 వేల 886 కోట్ల రూపాయల విద్యుత్​ బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా హోం మంత్రిని కోరారని ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని.. దీనివల్ల రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై ద్వారా లబ్ధి పొందడం లేదని తెలిపారని వివరించింది. ప్రత్యేక హోదాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది. రాష్ట్రాంలో జిల్లాల పునర్విభజనకు అణుగుణంగా.. కొత్తగా 12 జిల్లాలకు మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలని కోరినట్లు వివరించింది.

కడపలో ఏర్పాటు చేయనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజం కోసం.. ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరినట్లు సీఎంఓ తెలిపింది. విశాఖలో మెట్రో ఏర్పాటుకు సహకరించాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని జగన్​ కోరినట్లు.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలిపినట్లు వివరించింది. కృష్ణా రివర్‌ మేనేజ్​మెంట్‌ బోర్డు అన్ని ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌, ఒప్పందాలను, ఆదేశాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని పిర్యాదు చేసినట్లు వెల్లడించింది. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులలో మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులను రాష్ట్రమే అభివృద్ది చేయనున్నట్లు.. మచిలీపట్నం, భావనపాడు పోర్ట్‌ల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు కేంద్రం సహకరించాలని హోంశాఖకు విన్నవించినట్లు తెలిపింది. పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు, ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకుకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరినట్లు ప్రకటనలో వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.