ETV Bharat / state

CM meet with all universities VCs: విద్యారంగంలో ఏఐ భాగం కావాలి.. వీసీలతో సీఎం జగన్

author img

By

Published : Jul 13, 2023, 8:41 PM IST

CM Jagan meeting with VCs of all universities: రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యావిధానం అమల్లోకి తీసుకురావాలని సీఎం జగన్ అన్ని వర్సిటీల వీసీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్‌‌లాంటి పాఠ్య ప్రణాళికలను తయారు చేయాలన్నారు. తన ఆలోచనలను తదుపరి స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వీసీలపైనే ఉందని వ్యాఖ్యానించారు.

Cm meet
Cm meet

విద్యారంగంలో ఆర్టీఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌ని ప్రవేశపెట్టండి..వీసీలకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan meeting with VCs of all universities: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈరోజు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల(వీసీలు)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రపంచ స్థాయి విద్యా విధానం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అత్యుత్తమ కరికులమ్‌‍‌లతోపాటు మరికొన్ని విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అన్ని వర్సిటీల ఉపకులపతులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

అత్యుత్తమ కరికులమ్‌ సిద్ధం చేయండి.. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యావిధానం ఉండాలి. అంతేకాదు, విద్యావిధానంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని ప్రవేశపెట్టి విద్యార్థులకు అందజేయాలి. విద్యార్థుల ఆశయాల మేరకే కరికులమ్ ఉండాలి. దానికి అనుగుణంగా అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులంతా కలిసి, అత్యుత్తమ కరికులమ్‌ని సిద్ధం చేయండి. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్న విధానాల్ని ప్రస్తుత విద్యారంగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. విద్యార్థి కోరిన కోర్సులను అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీంతోపాటు ప్రశ్నపత్రాల రూపకల్పన, పాత బోధనా పద్ధతులు పూర్తిగా మారాలి'' అని అన్నారు.

ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనుసంధానంపై దృష్టి పెట్టండి.. అంతేకాకుండా.. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో ఒక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనుసంధానంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏఐ, వర్చువల్‌ రియాల్టీ, అగ్‌మెంటేషన్‌ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై కూడా వీసీలు, విద్యాధికారులు దృష్టి పెట్టాలన్నారు. విద్యారంగంలో విద్యార్థులను క్రియేటర్లుగా తయారు చేయటానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించాలని సూచించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రూపంలో నాలుగో విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామన్న సీఎం.. రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తిగా మార్చబోతోందన్నారు. కాబట్టి, దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు.

మన కరికులమ్‌లోకి అలాంటి బోధన రావాలి.. చివరగా పాఠ్య ప్రణాళిక విధానంపై సీఎం జగన్ వీసీలకు దిశానిర్దేశం చేశారు. విద్యారంగంలో టెక్నాలజీని మరింత పెంచాల్సిన అవసరం ఉందని.. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్‌‌లాంటి వర్సిటీలను చూస్తే.. వాళ్ల పాఠ్య పుస్తకాలు, వాళ్ల బోధనా పద్ధతులు, వాళ్ల ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం చాలా విభిన్నంగా ఉంటుందని.. ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మనకు, వారికీ తేడా ఎందుకు ఉంటుందనే విషయంపై వీసీలు ఆలోచన చేయాలన్నారు. రానున్న రోజుల్లో ప్రశ్నాపత్నం విధానం మారాలన్న సీఎం.. వెస్ట్రన్‌ వరల్డ్‌ ఎలా బోధిస్తుందో.. మన కరికులమ్‌లోకి కూడా అలాంటి బోధన రావాలన్నారు. కాబట్టి, ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలన్నారు. ఇవన్నీ అత్యంత కీలకమైన అంశాలన్న సీఎం.. ఇవన్నీ ఎలా చేయాలి..? ఎలా చేయగలుగుతాం..? అనే వాటిపై వర్సిటీల వీసీలు ఆలోచన చేయాలన్నారు.

''నా ఆలోచనలను తదుపరి స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో పలు విధానాలు ఇప్పటికే వచ్చాయి. కానీ, వాటి ఫ్యాకల్టీలో మనం వెనకబడి ఉన్నాం. కంటెంట్‌ ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంది. కానీ, దాన్ని మనం ఎలా వాడుకోవాలి అనే దానిపై ఆలోచన చేయాలి. శిక్షణ ఇచ్చుకుంటూ పోతే, మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధమవుతారు. దీనిపై మరిన్ని ఆలోచనలు చేయడానికి నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటు చేయండి. మెడికల్, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పడి.. అత్యుత్తమ పాఠ్య ప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయండి.''-వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.