ETV Bharat / city

అన్ని కళాశాలలు మూడేళ్లలో న్యాక్ గుర్తింపు సాధించాలి : సీఎం జగన్​

author img

By

Published : Sep 29, 2020, 6:01 AM IST

Updated : Sep 29, 2020, 6:10 AM IST

ఉన్నత విద్యా విభాగంలోనూ ఈ ఏడాది నుంచే జాతీయ విద్యా విధానం-2020 అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడేళ్లలో ఎన్​బీఏ, న్యాక్ ప్రమాణాలు అందుకోని కళాశాలలను మూసివేస్తామని హెచ్చరించారు. ఇక నుంచి మూడు లేక నాలుగేళ్ల డిగ్రీ, ఏడాది లేక రెండేళ్ల పీజీ ఉంటుందన్నారు.

సీఎం జగన్​
సీఎం జగన్​

నూతన జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా "ఉన్నత విద్యారంగంలో నూతన విద్యా విధానం" అమలుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. జాతీయ విద్యా విధానంలో ప్రస్తావించిన అంశాలు, అమలు చేయాల్సిన విధానంపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు వచ్చే మూడేళ్లలో నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్​బీఏ), నేషనల్‌ అసెస్​మెంట్ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌- (న్యాక్) సర్టిఫికెట్లు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కాలేజీలు కూడా తప్పనిసరిగా ఎన్​బీఏ, న్యాక్​ గుర్తింపు పొందాలన్నారు. ప్రమాణాలు లేని అన్ని కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని, మూడేళ్లలో మార్పు రాకపోతే చర్యలు తప్పవనే విషయం స్పష్టం చేయాలని నిర్దేశించారు. ప్రమాణాలు పాటించని ఇంటర్మీడియట్‌ కళాశాలలపై కొరడా ఝుళిపించాలన్నారు. బీఈడీ కళాశాలల్లో టీచర్‌ ట్రెయినింగ్‌ పరంగా నాణ్యత లేకుంటే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కళాశాలల్లో ప్రమాణాలు, నాణ్యతతో కూడిన బోధనకు సంబంధించి ఒక ఎస్​వోపీ ఖరారు చేసుకోవాలని సూచించారు. బృందానికి ముగ్గురు చొప్పున 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి కళాశాలల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. విద్యాసంస్థల్లో ప్రమాణాలపై ఇప్పటికే దృష్టి సారించామని, 200కు పైగా కళాశాలకు నోటీసులు ఇచ్చామని అధికారులు సీఎంకు నివేదించారు.

నాలుగేళ్ల డిగ్రీ నుంచి నేరుగా పీహెచ్​డీ​

నూతన జాతీయ విద్యా విధానం మేరకు డిగ్రీ, పీజీ కోర్సుల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇకపై ఏడాది లేదా రెండేళ్ల పీజీ, మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్​లు ఉంటాయని సీఎం స్పష్టంచేశారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి నేరుగా పీహెచ్​డీ​ అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్స్‌, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్స్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఉన్నత విద్యలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలటిక్స్‌ లాంటి కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్దేశించారు. బికామ్‌లో సెక్యూరిటీ అనాలిసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలు ఉండాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 3 వేల కాలేజీలు ఉండగా, 104 మాత్రమే అటానమస్‌గా పని చేస్తున్నాయని... ఈ సంఖ్య మరింత పెరగాల్సి ఉందని సీఎం అన్నారు. ఇంజినీరింగ్‌ ప్రధానాంశంగా విజయనగరంలో మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ, టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రధానంగా ఒంగోలులో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి : దయనీయ పరిస్థితుల్లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు

Last Updated :Sep 29, 2020, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.