ETV Bharat / state

ఓడిపోతామన్న భయంతోనే హింసకు తెగబడుతున్నారు.. ఎన్నికలకు సిద్ధం: చంద్రబాబు

author img

By

Published : Dec 7, 2022, 9:38 AM IST

Chandrababu makes key comments: రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు వంద శాతం ఖాయమని చంద్రబాబు... ధీమా వ్యక్తం చేశారు. తాను నిర్వహిస్తున్న సభలకు వస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఓడిపోతామన్న భయంతోనే దాడులకు తెగబడుతోందని తెలిపారు. దీనిపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని చంద్రబాబు చెప్పారు.

ఓడిపోతామన్న భయంతోనే హింసకు తెగబడుతున్నారు
ఓడిపోతామన్న భయంతోనే హింసకు తెగబడుతున్నారు

Babu comments on the early election in AP రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు వంద శాతం ఖాయమని చంద్రబాబు... ధీమా వ్యక్తం చేశారు. తాను నిర్వహిస్తున్న సభలకు వస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఓడిపోతామన్న భయంతోనే దాడులకు తెగబడుతోందని తెలిపారు. దీనిపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని చంద్రబాబు చెప్పారు.

G20పై కేంద్రం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశం కోసం దిల్లీ వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబు విలేకర్లతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి.. కక్షసాధింపు ధోరణితో పాలన సాగిస్తూ, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు విసుగెత్తిపోయి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాను నిర్వహిస్తున్న రోడ్ షోలకు వస్తున్న ప్రజా స్పందన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని చెప్పారు. గతంలో ప్రభుత్వాలు మారినా ఆ విధానాలను కొనసాగించేవారని, అందువల్ల రాష్ట్రాభివృద్ధి నిరంతరం కొనసాగేదన్నారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి... గత ప్రభుత్వం తలపెట్టిన పోలవరం, అమరావతి నిర్మాణం అపేసి రాష్ట్రాభివృద్ధిని పక్కన పడేశారని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రజల ముందుకు వెళ్లబోతున్నట్లు చెప్పారు. తనకు ఇప్పుడు జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు.

ప్రజా వ్యతిరేకతకు భయపడి జగన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని వస్తున్న వార్తల గురించి ప్రస్తావించగా...ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమేనన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం కొంత వరకే ఉంటుందన్న చంద్రబాబు... ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా పని చేయదన్నారు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నంత వేధింపులు గతంలో ఎన్నడూ చూడలేదని... ఓడిపోతామన్న భయంతో హింసకు తెగబడుతున్నారని, దీనిపై ప్రజలు తిరగబడే అవకాశం ఉందన్నారు.

హైదరాబాద్ నగరాభివృద్ధికి తాను వేసిన విత్తులు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని చంద్రబాబు వివరించారు. ఒక పబ్లిక్ పాలసీతో హైదరాబాద్ రూపురేఖలను మార్చి దాన్ని రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా తయారు చేయగా... ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని చెడగొట్టకుండా ముందుకు తీసుకెళ్లడంవల్ల మహానగరం మరింత అభివృద్ధి చెందిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ తరహాలో.. దేశంలో ఏ మహానగరం అభివృద్ధి చెందలేదని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ లాంటి గ్రోత్ ఇంజిన్‌లా... అమరావతిని చేయాలనుకున్నానని, కానీ గత ఎన్నికల్లో ఓడిపోవడంవల్ల ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు.

విభజన తర్వాత ముఖ్యమంత్రిగా తన అయిదేళ్ల హయాంలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధిరేటు నమోదు చేయడం కూడా ఒక చరిత్ర అన్నారు. ఇప్పుడు రాష్ట్ర వృద్ధిరేటు కేవలం 3 శాతానికి పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చేయడంవల్ల యువత దాన్ని అందిపుచ్చుకొని విదేశాలకు వెళ్లారని చెప్పారు. ప్రస్తుతం దాదాపు 30 శాతం మంది యువత వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, ఆమేరకు స్థానికంగా తెదేపా ఓటర్లను కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. అందుకే ఎన్ఆర్ఐ లకు ఓటింగ్ కల్పించే విధానానికి మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో బలపడటానికి ప్రయత్నిస్తున్నామని, అందుకే అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌కి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినట్లు వెల్లడించారు.

2047 నాటికి దేశ జనాభా సగటు వయోభారం పెరిగే ప్రమాదం ఉన్నందున.. దేశంలో జనాభా నియంత్రణ ఎత్తేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య నిష్పత్తి తగ్గడం వల్ల దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ వృద్ధాప్యం ముందుగా వస్తుందన్నారు. ఇది ఇలానే కొనసాగితే జపాన్ తరహాలో వృద్ధాప్య భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే 25 ఏళ్ల వరకు దేశానికి వయో భారం సమస్య ఉండదని, ఆ తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలన్నారు. ఎప్పుడూ యువ జనాభా అధికంగా ఉండే సైకిల్ నడిచేలా ప్రభుత్వమే ఒక విధాన నిర్ణయాన్ని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. జనాభా పెరుగుదల భవిష్యత్తులో వరం అవుతుంది తప్పితే శాపం కాదన్నారు. ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థ పెద్దగా లేని కాలంలో జనాభా పెరుగుదల పేదరికానికి దారితీసేదని.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సంపద సృష్టికి పునాది అవుతుందన్నారు.

ఓడిపోతామన్న భయంతోనే హింసకు తెగబడుతున్నారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.