ETV Bharat / state

Iron Yard Problems 1500 మందికి 4మరుగుదొడ్లు.. ఇతర సౌకర్యాలు అంతంత మాత్రమే.. భవానీపురం ఐరన్ యార్డు దుస్థితి

author img

By

Published : Jul 8, 2023, 6:25 PM IST

Bhavanipuram Iron Yard Workers Problems: అక్కడ సుమారు 15 వందల మంది కార్మికులు పని చేస్తున్నారు. వారికి కనీసం దాహం తీర్చుకునేందుకు నీరు లేదు. కూర్చుని భోజనం చేసేందుకు హాలు లేదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లు కూడా లేవు. కార్మికులు ఎన్నోసార్లు పోరాడితే.. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మరుగుదొడ్లు, డైనింగ్ హాలు నిర్మించారు. కానీ అవి ప్రారంభానికి నోచుకోలేదు. ఇలా ఏళ్లుగా భవానీపురం ఐరన్ యార్డు కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు.

Bhavanipuram Iron Yard
Bhavanipuram Iron Yard

Bhavanipuram Iron Yard Workers Problems: విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న భవానీపురం ఐరన్ యార్డు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఏళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. సుమారు 15 వందల మంది కార్మికులు ఈ ఐరన్ యార్డులో పని చేస్తున్నా.. కనీసం మంచినీరు, భోజనశాల, మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఎండా, వానా అనే తేడా లేకుండా చెట్ల కింద, దుకాణాల వరండాలు, ఆరుబయట, ఆటోల్లో భోజనం చేస్తున్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునే అవకాశమూ లేదు. మరుగుదొడ్లు లేక చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇనుప సామాన్ల ఎగుమతి, దిగుమతుల నిమిత్తం రోజూ ఐరన్ యార్డుకి లారీ డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, క్లీనర్లు వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే డ్రైవర్లకి, క్లీనర్లకి కనీసం మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. వారందరికీ కనీస మౌలిక వసతులైన మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి.. వారు మధ్యాహం పూట భోజనం చేయడానికి భోజనశాల నిర్మించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది.

"25సంవత్సరాల నుంచి ఈ ఐరన్​ యార్డులో పనిచేస్తున్నాం. టాయిలెట్లు కట్టించారు కానీ ఇంకా ఓపెన్​ చేయలేదు. ఓ డైనింగ్​ హాల్​ కట్టించారు కానీ దానిని కూడా ఓపెన్​ చేయలేదు. వాటికి కరెంటు కనెక్షన్​, వాటర్​ సప్లై కనెక్షన్​ ఇవ్వాలి. వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాలకృత్యాలు తీర్చుకోవాలంటే సుమారు ఓ కిలోమీటరు వెళ్లాల్సి వస్తోంది. దానివల్ల పనికి ఆటంకం ఏర్పడుతోంది."-కార్మికులు

అయితే కార్మికులు అనేక సార్లు ఆందోళన చేయడంతో.. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి.. 4 మరుగుదొడ్లు, ఓ డైనింగ్ హాలు నిర్మించారు. అయితే నిర్మాణం పూర్తై 4 నెలలు కావస్తున్నా నేటికీ ప్రారంభించలేదు. దీంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని.. చెత్తాచెదారం చేరి అస్తవ్యస్తంగా మారిందని.. అలాగే అసాంఘిక కార్యక్రమాలకు అవాసాలుగా మారుతున్నాయని కార్మికులు మండిపడుతున్నారు.

తమ సమస్యలపై అధికారులు పట్టించుకోకపోవడంతో.. కార్మికులే తలా కొంత డబ్బులు వేసుకొని చిన్నపాటి మంచినీళ్ల తొట్టె నిర్మించుకున్నారు. దానికి నీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్​ అధికారులకు అనేక సార్లు విన్నవించినా ఫలితం లేదు. నిర్మాణాలను ప్రారంభించి కష్టాలు తీర్చాలని కార్మికులు కోరుతున్నారు. అలాగే 15వందల మందికి 4 మరుగుదొడ్లు ఏ మాత్రం సరిపోవని.. మరో 20 నిర్మించాలని.. అదనంగా ఇంకో 2 భోజనశాలలు ఏర్పాటు చేయాలని కార్మికులు వేడుకుంటున్నారు.

15వందల కార్మికులకు 4మరుగుదొడ్లు.. దుర్భర స్థితిలో భవానీపురం ఐరన్ యార్డు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.