ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన నిరసన సెగ.. ఏపీ జేఏసీ మలిదశ ఉద్యమం షురూ

author img

By

Published : Apr 8, 2023, 4:49 PM IST

Updated : Apr 8, 2023, 6:16 PM IST

APJAC Malidasha movement start in AP: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి నాయకులు నల్ల కండువాలను ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద వాల్ పోస్టర్లు అంటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

APJAC
APJAC

APJAC Malidasha movement start in AP: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ జేఎసీ అమరావతి తన మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల డిమాండ్లను, సకాలంలో జీతాలు చెల్లించాలంటూ నిరసన కార్యక్రమాలను షురూ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలోని ప్రధాన కూడల్లో పోస్టర్లను విడుదల చేసింది (ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించిన పోస్టర్లు). ఈ నిరసన కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొంటున్నారని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

ఏపీ జేఎసీ మలిదశ కార్యాచరణ ఆరంభం..నిరసన కార్యక్రమాలు షురూ

26 జిల్లాల్లో పోస్టర్లు విడుదల... రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు శనివారు నిరసన దీక్ష మొదలుపెట్టారు. నల్ల కండువాలను ధరించి, ప్లకార్డులతో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరారు. 11 పీఆర్సీ ప్రతిపాదిత స్కైల్ అమలు చేయాలని కోరారు. పీఆర్సీ అరియర్లు, పెండింగ్ డీఏలు చెల్లించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమయానికి ఉద్యోగులుకు జీతాలు రాక నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు.

మలిదశ కార్యాచరణ ప్రారంభం: అనంతరం మలిదశ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలను బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏప్రిల్ 17వ తేదీన, 20వ తేదీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి.. మద్దతు కోరతామని బొప్పరాజు వేంకటేశ్వర్లు తెలిపారు. ఏప్రిల్ 21న సెల్‌‌డౌన్ యథావిథిగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఈనెల 27న కారుణ్య నియామకాలకు సంబంధించిన కుటుంబాల సభ్యులను కలిసే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. మే నెల 5వ తారీఖున మరోసారి సమావేశం ఏర్పాటు చేసి.. ఈ నెల రోజుల అంశాలను మరోసారి చర్చించి.. కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఏప్రిల్‌లో చేపట్టే కార్యక్రమాలు ఇవే: అంతేకాకుండా మలిదశ ఉద్యమంలో ఈనెల 10వ తేదీన (గ్రీవెన్స్ డే) స్పందన కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాన్ని సమర్పించనున్నామని.. బొప్పరాజు తెలిపారు. ఏప్రిల్ నెలలో.. 11న సెల్‌డౌన్ కార్యక్రమం, 12న 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం, 15న విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం, 18వ తేదీన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా చేపట్టే కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

కర్నూలు జిల్లాలో.. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఉద్యోగ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

మన్యం జిల్లా కేంద్రంలో.. ఉద్యోగులు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు జి. శ్రీరామ్ మూర్తి ఏపీ జేఏసీ రాష్ట్ర సలహాదారు డి.జి. ప్రసాద్ ఆధ్వర్యంలో పురపాలక రెవెన్యూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ వివిధ శాఖల ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లాలో... ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఇప్పటికైనా తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. అనకాపల్లి జిల్లా ఏపీ జేఏసీ అమరావతి సంఘ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని నేరవేర్చాలని డిమాండ్ చేశారు.

శ్రీసత్యసాయి జిల్లాలో.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అంబేద్కర్ కూడలి వద్ద అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోందని, ప్రజలకు దగ్గరవ్వడానికి ఏ విధంగానైతే బటన్ నొక్కుడు కార్యక్రమాలు చేపట్టారో.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా బటన్ నొక్కుడు కార్యక్రమాలను ప్రవేశపెట్టి.. ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలను కోరారు.

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాలోని ప్రధాన కూడల్లో పోస్టర్లను విడుదల చేశాం. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్‌తోపాటు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన ఈ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోతున్నందుకు సిగ్గుపడాలి. కేవలం ఉద్యోగులకే 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా..? వాలంటీర్లు, సలహాదారులుగా ఉన్నవారికి 20 వేల కోట్లు ఇస్తున్న మాటను ఎందుకు చెప్పడం లేదు..?. సర్వీసు రూల్స్ కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. పొరుగు రాష్ట్రాలలో ఉద్యోగుల పరిస్థితి చాలా బాగుంది. మలిదశ ఉద్యమంలో ఈ పోస్టర్ల విడుదలతో మొదలైన ఉద్యమం తీవ్రతరం అవుతుంది. ప్రభుత్వ యాప్ వినియోగాన్ని నిలిపివేస్తూ సెల్‌ఫోన్ డౌన్ చేస్తాం'' అని ఆయన అన్నారు. - ఏపీ జేఎసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఇవీ చదవండి

Last Updated : Apr 8, 2023, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.