ETV Bharat / state

CBN Letter to CM: చించినాడలో దళితులపై పోలీసులు దాడి.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

author img

By

Published : Jun 10, 2023, 3:21 PM IST

Updated : Jun 10, 2023, 3:47 PM IST

TDP chief Chandrababu letter to CM Jagan mohan Reddy: తమ భూముల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారంటూ.. ఈనెల 6వ తేదీన చించినాడలో దళితులు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసులు.. వారిపై లాఠీచార్జ్ చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..సీఎం జగన్‌కు మూడు పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు.

TDP chief
TDP chief

TDP chief Chandrababu letter to CM Jagan mohan Reddy: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ చెందిన ప్రజాప్రతినిధులు.. పార్టీ అండదండలతో గతకొన్ని రోజులుగా నిబంధలకు విరుద్ధంగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే టిప్పర్లతో, ట్రాక్టర్లతో రాత్రి పగలనే తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. దీంతో మట్టిని ఎందుకు తరలిస్తున్నారంటూ అడ్డుపడిన స్థానికులపై, దళితులపై దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే వారిపై విచక్షణారహితంగా పోలీసులు లాఠీచార్జీలు చేసి.. తీవ్రంగా గాయపరుస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా చించినాడ దళిత భూముల్లో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై బాధితులు (దళితులు) శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే వారిపై పోలీసులు దాడి చేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్‌కు మూడు పేజీల లేఖ రాశారు.

అసైన్డ్ భూముల్లో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు.. పశ్చిమగోదావరి జిల్లా చించినాడ దళితులు.. తమ భూముల్లో అధికార పార్టీ నాయకులు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారంటూ నిరసన తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. దళితులపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఆ ఘటనపై స్పందించిన చంద్రబాబు.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వారి అనుచరులే మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో వారికి కేటాయించిన అసైన్డ్ భూముల్లో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ తమ అనుచరుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు.

దళితులపై లాఠీచార్జి చేయాల్సిన అవసరం ఏంటి..? అక్రమ తవ్వకాలను నిరసిస్తూ.. ఈనెల 6వ తేదీన చించినాడలో దళితులు నిరసనలకు దిగితే పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తీవ్ర గాయాలైన వారిని పోలీసులు సమీపంలోని పాలకొల్లు ఆసుపత్రికి తరలించకుండా, 70 కిలోమీటర్ల దూరంలోని తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న దళితులపై పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన అవసరం ఏంటి..? అని చంద్రబాబు సీఎంను ప్రశ్నించారు. నిరసన తెలుపుతున్న దళితులను అక్రమంగా నిర్బంధించాల్సిన అవసరం ఏమిటి..? అని మండిపడ్డారు. గాయపడిన బాధితుల నుంచి నిబంధనల ప్రకారం వాంగ్మూలం తీసుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారు..? అని చంద్రబాబు జగన్‌ను ప్రశ్నించారు.

పోలీసులు అధికార పార్టీ గూండాల్లా ప్రవర్తిస్తున్నారు.. ఈ ఘటనలో నిందితులను రక్షించడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. దళిత మహిళ రాపాక బొజ్జమ్మ ఛాతీపై పోలీసులు కాళ్లతో కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆమె అసుపత్రి పాలయ్యిందన్నారు. పోలీసులు అధికార పార్టీ గూండాల్లా ప్రవర్తిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందన్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకునే క్రమంలో 9వ తేదీ మట్టిని తరలిస్తున్న 9 ట్రక్కులను స్థానికులు పట్టుకున్నారని.. పక్కా ఆధారాలు లభ్యమైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆక్షేంపించారు.

నది గట్టు ధ్వంసమైంది-ఆకస్మిక వరద ముప్పు మొదలైంది.. నిబంధనలకు విరుద్దంగా గోదావరి నుంచి 200 మీటర్ల పరిధిలో తవ్వకాలు జరుపుతున్నారని.. దీనిపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ధిక్కరించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారని చంద్రబాబు నాయుడు లేఖలో వెల్లడించారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం మట్టి తరలింపు అని చెపుతున్నా.. ఇక్కడ తవ్విన దాంట్లో 80 శాతం మట్టిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నది ఒడ్డున విచక్షణారహితంగా మట్టిని తవ్వడం, భారీ వాహనాలు వెళ్లడం వల్ల నది గట్టు ధ్వంసమైందన్నారు. గట్టు విధ్వంసం వల్ల ఆకస్మిక వరద ముప్పుకు అవకాశం ఉందని అన్నారు. ఈ మొత్తం ఘటనలో దళితులను గాయపరిచి, దుర్భాషలాడిన సంబంధిత పోలీసు అధికారులపై వెంటనే తగు చర్యలు తీసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని తక్షణమే అరెస్టు చేసి.. అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

చించినాడలో దళితులపై పోలీసులు దాడి.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
Last Updated :Jun 10, 2023, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.