ETV Bharat / state

లెక్కలు వెల్లడించిన కాగ్‌ .. బడ్జెట్‌లో లెక్కచూపని కార్పోరేషన్ రుణాలు ఎంతంటే?

author img

By

Published : Dec 25, 2022, 7:47 AM IST

Updated : Dec 25, 2022, 10:21 AM IST

AP State Corporation Loans Issue: సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలుకు అంటూ.. వివిధ మార్గాల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ గోప్యంగానే ఉంచుతోంది. బడ్జెట్‌లో లెక్కచూపని అప్పులు భారీగా ఉన్నాయంటూ నివేదికల్లో పేర్కొంటున్న కాగ్‌.. ఆ వివరాలను వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తోంది. అయినా ప్రభుత్వం రుణాల లెక్కలను వెల్లడించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. అటు కార్పొరేషన్ల బ్యాలెన్స్‌ షీట్‌లనూ వెల్లడించకపోవడంపై పౌరసమాజ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

State Corporation Loans
కార్పోరేషన్ రుణాలు

AP State Corporation Loans: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను రహస్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. అక్టోబర్‌ నెలాఖరు వరకు ఈ ఆర్థిక సంవత్సరం రాబడి, ఖర్చుల లెక్కలను కాగ్‌ వెల్లడించినా అందులో అప్పుల వివారాలన్నీ లేవు. కాగ్‌ పదేపదే అడుగుతున్నా ప్రభుత్వం చెప్పకపోవడం రివాజ్‌గా మారిపోయింది. అనేక నెలలుగా ప్రభుత్వం వివరాలు చెప్పట్లేదని కాగ్‌ ప్రతి నెలా తన నివేదికల్లో ప్రస్తావిస్తూనే ఉంది. బడ్జెట్‌ పుస్తకాల్లోనూ కార్పొరేషన్ల రుణాల తాజా అంకెలను ఇవ్వడం లేదు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చే రుణాలను ప్రభుత్వం పథకాలకు ఆదాయ వనరులుగా చూపిస్తోంది. అయితే కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలను ప్రభుత్వం తన ఆదాయంగా బడ్జెట్‌లో చూపడానికి వీల్లేదని రిజర్వు బ్యాంక్‌ స్పష్టం చేసింది.

15వ ఆర్థికసంఘం సైతం కార్పొరేషన్ల అప్పులనూ ప్రభుత్వ అప్పులగానే పరిగణించాలని తెలిపింది. కార్పొరేషన్ల రుణాల అసలు, వడ్డీలను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున వాటినీ ప్రభుత్వ అప్పులుగానే పరిగణించి.. మొత్తం నికర రుణపరిమితిలో వాటినీ కలపాలని పేర్కొంది. రాష్ట్రాల అప్పుల విషయంలో కేంద్ర ఆర్థికశాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు కనిపిస్తున్నా.. కార్పొరేషన్ల రుణాలను నికర రుణపరిమితిని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించట్లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ కార్పొరేషన్ల రుణాలు, బహిరంగ మార్కెట్‌ రుణాలు కలిపి నికర రుణపరిమితిని ఎప్పుడో దాటేసింది. బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు రాష్ట్ర గ్యారంటీ రుణాలను లక్షా 17 వేల 503 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం పేర్కొంది.

లెక్కలు వెల్లడించిన కాగ్‌ .. బడ్జెట్‌లో లెక్కచూపని కార్పోరేషన్ రుణాలు ఎంతంటే?

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు సేకరించినా.. చాలా కాలం వాటిని రహస్యంగానే ఉంచేసింది. మరోవైపు ప్రభుత్వం గ్యారంటీల ద్వారా తెచ్చుకునే రుణాల పరిమితిని సైతం పెంచేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చుకుంది. తాజా గణాంకాల ప్రకారం ఏపీ గ్యారంటీ రుణాలు లక్షా 61 వేల కోట్ల రూపాయలకు పైబడ్డాయని సమాచారం ఉన్నా.. ఆ విషయం ఇప్పటికీ రహస్యమే. కాగ్‌ పదే పదే అడిగినా ప్రభుత్వం వివరాలు వెల్లడించట్లేదు. కార్పొరేషన్ల బ్యాలెన్స్‌ షీట్‌ను వెల్లడించకపోవడం, వాటి లెక్కలు ఆడిట్ చేయించకపోవడం.. అన్నింటికన్నా మరో ముఖ్య కోణం. ఇది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందోనని పౌర సమాజ ప్రతినిధులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చి వాటిని దారి మళ్లిస్తున్నారని.. ఏపీ ప్రొఫెషనల్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం.. ఆ వివరాలను ఆడిట్‌ చేసి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీలకు సమర్పించాల్సి ఉన్నా.. ఆ పని చేయట్లేదని ఫోరం సభ్యులు ఆక్షేపించారు. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి నిబంధ‌న‌లు పాటించని ఈ కార్పొరేషన్లపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.. సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపు కోసమంటూ.. కార్పొరేషన్ల పేరుతో దోచుకోవడం సరికాదని.. వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రొఫెషనల్ ఫోరం తీవ్ర విమర్శలు చేసింది. కాగ్‌ నిగ్గుతేల్చిన నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపాలని కేంద్రాన్ని ఏపీపీఎఫ్ సభ్యులు కోరారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 25, 2022, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.