ETV Bharat / state

పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి.. జోరుగా ప్రలోభాల పర్వం

author img

By

Published : Mar 12, 2023, 10:42 PM IST

Updated : Mar 12, 2023, 10:51 PM IST

MLC Elections Arrangemen
MLC Elections Arrangemen

MLC Elections Arrangement : పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అంటుండగా.. అధికార పార్టీ నేతల ప్రలోభాల పర్వాలు అక్కడక్కడ బయటపడుతున్నాయి.

MLC Election : మరికొన్ని గంటల్లో మొదలు కానున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో మోహరించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు రేపటి పోలింగ్‌ దృష్ట్యా ప్రలోభాలపర్వం జోరుగా సాగుతోంది. విశాఖలో నగదు పంచుతున్న వైసీపీ కార్యకర్తను పట్టుకున్న పీడీఎఫ్​ నేతలు పోలీసులకు అప్పగించారు.

ఎన్నికల సామగ్రి పంపిణీపై నెల్లూరు కలెక్టర్​ ఆగ్రహం : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ పారదర్శంగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌తో పాటు సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఓటర్లు స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన పెన్నుతో మాత్రమే మార్క్ చేయాలని.. ఓటర్లు దీన్ని గమనించాలని కలెక్టర్ తెలిపారు. ఆత్మకూరు పాలిటెక్నిక్‌ కళాశాలలోని గదిలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయడంపై కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. గదుల్లో కాకుండా బయట సామగ్రిని అందజేయాలన్నారు. తిరుపతి జిల్లా పద్మావతి డిగ్రీ మహిళా కళాశాల ప్రాంగణంలో ఎన్నికల ఏర్పాట్లపై సిబ్బందితో ఎస్పీ పరమేశ్వర రెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 138 కేంద్రాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఓటర్‌ స్లిప్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి : బాపట్ల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ కెే విజయకృష్ణన్‌, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ చెప్పారు. 2 తీవ్ర సమస్యాత్మక, 7 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 4 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కనిగిరిలో ఎన్నికల ఏర్పాట్లను జేసీ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నగదు పంచుతూ పట్టుబడ్డ వైసీపీ ప్రతినిధి : విశాఖ హెచ్​బీ కాలనీలో బహిరంగంగా డబ్బులు పంచుతున్న వైసీపీ ప్రతినిధిని పీడీఎఫ్​ కార్యకర్తలు పట్టుకున్నారు. విశాఖ పాత నగరానికి చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తి వైసీపీ కార్యాలయంలో లక్ష రూపాయలు తీసుకుని.. వాలంటీర్ అందించిన జాబితా ప్రకారం డబ్బులు పంచుతున్నట్లు పీడీఎఫ్​ నాయకులు ఆరోపించారు. తాము పట్టుకోవడానికి ముందే 17మందికి డబ్బులు పంచినట్లు చెప్పారు. ఈశ్వరరావు వద్ద మిగిలిన డబ్బులు స్వాధీనం చేసుకుని.. అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.

వైసీపీ రంగులతో ఉన్న ఫర్నీచర్లు : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కోసం విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఏర్పాటు చేసిన 295, 296 పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ రంగులతో ఉన్న ఫర్నీచర్లు ప్రత్యక్షమయ్యాయి. అధికార వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ స్థానిక బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న భీమిలి సీఐ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

సమస్యాత్మక ప్రాంతంలో పటిష్ట బందోబస్తు : విజయనగరం జిల్లా బొబ్బిలి రెవిన్యూ డివిజన్‌ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను ఆర్డీవో శేష శైలజ పరిశీలించారు. సామగ్రిని, సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్వతీపురం జిల్లాలో 15 మండలాల పరిధిలో 24 పోలింగ్‌ కేంద్రాల్లో 8మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు.

పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు

ఇవీ చదవండి :

Last Updated :Mar 12, 2023, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.