కానిస్టేబుల్​ హత్యకు గురై పది రోజులు, నిందితులను ఇప్పటికీ పట్టుకోని పోలీసులు

author img

By

Published : Aug 20, 2022, 4:33 PM IST

Murder

Constable murder case ఆయన ఓ పోలీసు కానిస్టేబుల్‌. రౌడీషీటర్ల చేతిలో హత్యకు గురై పది రోజులు దాటింది. కానీ ఇప్పటికీ నిందితులను పోలీసులు పట్టుకోలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేశాం. నిందితుల కోసం గాలిస్తున్నాం. అనే ప్రకటనలే తప్ప వారిని అదుపులోకి తీసుకోలేకపోయారు. ఇదంతా పోలీసుల వైఫల్యమేనని స్థానికులంటున్నారు.

Constable murder case: నంద్యాలలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. తరచూ హత్యలు, హత్యాయత్నాలు, దాడులు జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈనెల 7వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో.. రద్దీ రహదారిలో వెంటాడి వేటాడి కానిస్టేబుల్ సురేంద్రను రౌడీలు చంపేసినా ఇంతవరకు నిందితులను పట్టుకోకపోవటంపై ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ సురేంద్.. విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఆరుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ కనిపించారు. సురేంద్రతో మొదట గొడవకు దిగి... బీరు సీసాలతో దాడి చేశారు. తప్పించుకునేందుకు సురేంద్ర పరుగులు తీసినా.. ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదు. ఆటోడ్రైవర్‌ను బెదిరించి.. సురేంద్రను చెరువుకట్ట వద్దకు తీసుకెళ్లి అక్కడే కత్తులతో పొడిచి చంపారు. నిందితుల్లో ముగ్గురు ఘటనాస్థలం నుంచే పారిపోగా.. మరో ముగ్గురు అదే ఆటోలో శ్రీనివాస సెంటర్‌లో దిగారు. ఇద్దరు యువకుల్ని చితకబాది వారి ద్విచక్ర వాహనాలపై పారిపోయారు. వారిలో ఒక రౌడీషీటర్‌ అక్కడినుంచి ఇంటికి వెళ్లి భార్యను తనతో తీసుకెళ్లాడు.

Nandyala: ఇప్పుడు నంద్యాల జిల్లా కేంద్రంగా మారింది. ఏ మాత్రం పోలీసుల ఉనికి, నిఘా, గస్తీ ఉన్నా ఈ హత్య జరిగేది కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానిస్టేబుల్‌ మృతదేహాన్ని ఆటోడ్రైవర్‌ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చేవరకూ పోలీసులకు హత్య సమాచారమే తెలియకపోవటం మరింత ఆందోళన కలిగించే విషయం. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతోనే ఇదంతా జరిగిందని స్థానికులంటున్నారు.

ఏడాది వ్యవధిలో నంద్యాలలో 11 హత్యలు, 22 హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న మద్యం మత్తులో కొందరు యువకులు హోంగార్డు రాజశేఖర్‌పై దాడి చేయగా.. ఆయన మరణించారు. ఆ తర్వాత కూడా పోలీసులు కళ్లు తెరవలేదని... ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కానిస్టేబుల్‌ హత్యకు దారి తీసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కానిస్టేబుల్‌ హత్య కేసు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.