ETV Bharat / state

నంద్యాలలో పట్టపగలే దారుణ హత్య.. ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోని ఖాకీలు

author img

By

Published : Feb 9, 2023, 9:42 AM IST

Brutal murder of mining owner‍‌: నంద్యాల జిల్లా డోన్ నియోజవర్గంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై ..అందరూ చూస్తుండగా.. దుండగులు మారణాయుధాలతో గనుల యజమానిని దారుణంగా హతమార్చడం సంచలనంగా మారింది. మైనింగ్ మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని కొంతకాలంగా బాధితుడు పోలీసులను ఆశ్రయించినా.. ఖాకీలు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Brutal murder of mining owner‍‌
Brutal murder of mining owner‍‌

నంద్యాలలో పట్టపగలే దారుణ హత్య.. ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోని ఖాకీలు

Brutal murder of mining owner‍‌: డోన్‌లో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై దుండగులు మారణాయుధాలతో రెచ్చిపోవడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. స్వయానా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాకాలో హత్య జరగడం చర్చనీయాంశమైంది. కొచ్చెరువుకు చెందిన గనుల యజమాని లద్దగిరి శ్రీనివాసులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా దారికాచిన దుండగులు.. ప్యాపిలి మండలం బావిపల్లి వద్ద మారణాయుధాలతో దాడి చేశారు. కర్రలతో కొట్టి.. కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు రక్తం మడుగుల్లోనే ప్రాణాలు వదిలాడు.

డోన్ నియోజకవర్గంలో నాలుగేళ్లుగా మైనింగ్ మాఫియా పెట్రేగిపోతోంది. విలువైన ఖనిజ నిక్షేపాలను అక్రమంగా తవ్వుతున్నారని.. లీజులు అయిపోయినా ఖనిజాలను తరలిస్తున్నారని.. సుమారు 10 మందిపై శ్రీనివాసులు.. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వారు స్పందించకపోవడంతో.. రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. ఈ నేపథ్యంలో విచారణ సైతం జరుగుతోందని తెలుసుకున్న మైనింగ్ మాఫియా.. హత్యకు కుట్ర పన్నినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రెండు నెలల క్రితం మైనింగ్ నిర్వాహకుడు నాయక్‌కు.. శ్రీనివాసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీనివాసులు, ఆయన కొడుకు మధుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసులో శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. అనంతరం తనకు ప్రాణహాని ఉందని... డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇచ్చారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.

మృతుడు శ్రీనివాసులు బంధువులను తెలుగుదేశం నేతలు కోట్ల సుజాతమ్మ, ధర్మవరం సుబ్బారెడ్డి పరామర్శించారు. డోన్ లో శాంతి భద్రతలు కాపాడాలని... మైనింగ్ మాఫియాను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.