ETV Bharat / state

'నాడు- నేడు'కు నేడే సీఎం జగన్ శ్రీకారం

author img

By

Published : Feb 18, 2020, 4:14 AM IST

ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా చేపట్టిన నాడు- నేడు కార్యక్రమాన్ని ఇవాళ కర్నూలులో సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నాడు- నేడు పేరుతో పాఠశాలల అభివృద్ధి చేపట్టిన సర్కారు అదే విధానాన్ని ఆసుపత్రుల్లోనూ తీసుకురావాలని నిర్ణయించింది. రూ.11,737 కోట్లతో మూడేళ్లలో దశలవారీగా ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ప్రభుత్వ దవాఖానాల రూపురేఖలు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్ కంటివెలుగు పథకం మూడో విడతను కూడా సీఎం జగన్‌ ఇవాళ ప్రారంభించనున్నారు.

cm jagan
cm jagan

ముఖ్యమంత్రి జగన్ నేడు కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అధికారంలోకి వస్తే ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తానంటూ హామీ ఇచ్చిన జగన్‌.. ఆసుపత్రుల్లోనూ నాడు- నేడు కార్యక్రమం అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను కార్పొరేట్‌ ఆసుపత్రులతో సమానంగా ఆధునీకరించే పనులను ఇవాళ కర్నూలులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. వివిధ చోట్ల ఆసుపత్రులను బలోపేతం చేయటం, అవసరమైన చోట్ల మరమ్మతులు, కొత్త ఆసుపత్రుల నిర్మాణం సహా అన్ని సదుపాయాలూ కల్పించనున్నారు. రూ.11,737 కోట్ల వ్యయంతో మూడేళ్లలో దశల వారీగా కార్యక్రమం చేపట్టనున్నారు.

తొలిదశలో రూ.1,129 కోట్ల వ్యయంతో 7,548 ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 1,086 ఉపకేంద్రాలు ప్రభుత్వ భవనాలలో ఉండగా మరో 1,084 కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో కలిసి ఉన్నాయి. రూ. 23 లక్షల వ్యయంతో కొత్తగా 4,906 ఉపకేంద్రాలు నిర్మించనున్నారు. 888 చదరపు అడుగుల విస్తీర్ణంలో సింగిల్‌ బెడ్‌ రూమ్, వంటగది, మరుగుదొడ్లతో కూడిన స్టాఫ్ క్వాటర్స్, ల్యాబ్, పరీక్షా గది, క్లినిక్‌, పూర్తిగా అమర్చిన వైద్య సామగ్రి, అవసరమైన ఫర్నీచర్‌ ఉపకేంద్రాల్లో ఉంటాయి. నాడు- నేడు రెండో దశలో 1,907 కోట్ల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రులను బలోపేతం చేస్తారు. అవసరమైన చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడో దశలో రూ.8,701కోట్లతో అన్ని జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేయటంతోపాటు, బోధనా ఆస్పత్రులు, కొత్తగా ప్రత్యేక ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తారు.

కడపలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

విజయనగరం, ఏలూరు, పాడేరు, గురజాల, మార్కాపురం, పులివెందుల, మచిలీపట్నంలో కొత్తగా 7 వైద్య కళాశాలలు, కడపలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, మార్కాపురం, పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతారు. రూ.104 కోట్ల వ్యయంతో కొత్తగా 432 ... 108 సర్వీసులు, మొబైల్‌ మెడికల్‌ యూనిట్లతో కూడిన 104 సర్వీసుల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఒకశాతం ఉన్న అంధత్వాన్ని 0.3 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ కంటి వెలుగులో మూడోవిడత కార్యక్రమాన్ని సీఎం ఇవాళ ప్రారంభించనున్నారు.

వృద్ధులపై దృష్టి

ఇప్పటి వరకూ రెండు విడతల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కంటివైద్య పరీక్షలు నిర్వహించిన సర్కారు... ఇప్పుడు వృద్ధులపై దృష్టి సారించింది. మూడో విడతలో 60 ఏళ్లు, ఆ పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి వైద్య పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జులై 31 వరకూ మూడో విడత కంటివెలుగు కొనసాగనుంది. కంటి స్క్రీనింగ్‌ అనంతరం అవసరమైన వారికి కళ్లద్దాల పంపిణీ, వృద్ధులకు పింఛన్లు ఇవ్వనున్నారు. వాలంటీర్లు నేరుగా వృద్ధుల ఇళ్లకు వెళ్లి వారికి కళ్లద్దాలు అందజేస్తారు. కంటి వైద్య పరీక్షల్లో చూపు సమస్యలు గుర్తించిన వారికి వచ్చే నెల నుంచి శస్త్రచికిత్సలు చేయనున్నారు. ఇందుకోసం ప్రతి మండలానికి 2 నుంచి 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం సహా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, స్మార్ట్‌ హెల్త్‌ కార్డులను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేయనున్నారు.

ఇదీ చదవండి

'రూ. 150 కోట్లు తీసుకుని పోలవరం కట్టబెట్టారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.