ETV Bharat / state

జోరుగా పుర ప్రచారం.. ఓట్ల కోసం ఇంటిటీకి నేతల బారులు

author img

By

Published : Mar 2, 2021, 12:21 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా పుర పాలక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీల ముఖ్య నాయకులు జిల్లాలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. గెలిపిస్తే ఆయా ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు.

municipal elections
జోరుగా పుర ప్రచారం

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. అభివృద్ధి హామీలతో అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారి వెంట ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు.

కర్నూలులో..

కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. 52వ వార్డు అభ్యర్థి బీ.వై.రామయ్యను గెలిపిస్తే మేయర్​గా చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. పాణ్యం నియెజకవర్గంలోని 16 వార్డుల్లో మంచినీటి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

నగరంలోని రెండో వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, టీజీ భరత్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. అభివృద్ధి శూన్యమని అన్నారు. తెదేపాకు ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఓటర్లకు వివరించారు.

విశాఖలో..

విశాఖ నగరం 17వ వార్డులో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి కాళ్ళ లలిత ప్రచారం నిర్వహించారు. వార్డు పర్యటనలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్ధించారు. తనను గెలిపిస్తే వార్డను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నందున కేవలం ఐదుగురితోనే ఆమె ప్రచారం నిర్వహించారు.

విశాఖ తూర్పు నియోజకవర్గం 18వ వార్డులో గొలగాని మంగవేని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంవీపీ కాలనీ సెక్టార్ 3లో ఇంటింటికి వెళ్లి తనకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. తనను గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని అన్నారు. ఎన్నికల హామీలతో కూడిన కరపత్రాలను పంచారు.

ఇదీ చదవండి:

ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.