ETV Bharat / state

బయటకొచ్చిన మరో మాయజాలం.. మంత్రి గుమ్మనూరు జయరాం భూకొనుగోలు లీలలు

author img

By

Published : Dec 11, 2022, 7:54 AM IST

Updated : Dec 11, 2022, 2:18 PM IST

Minister Jayaram Land Registration Scam: మంత్రి గుమ్మనూరు భూలావాదేవీలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఇట్టినా భూముల వ్యవహారంలో భూ మార్పిడిని దాచిపెట్టి..బంధుగణానికి పంచిపెట్టినట్లు తేలింది. భూ మార్పిడి దాచిపెట్టి రిజిస్ట్రేషన్‌ చేయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. రిజిస్ట్రేషన్ జరిగిన తీరుపై విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే ఆస్కారముందని తెలుస్తోంది.

Minister Gummanur Jayaram
మంత్రి గుమ్మనూరు జయరాం

Minister Jayaram Land Registration Scam: మంత్రి గుమ్మనూరు జయరాం 'ఇట్టినా' భూముల కొనుగోలు వ్యవహారంలో.., రిజిస్ట్రేషన్లోనూ అడ్డదారులు తొక్కినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని బినామీ లావాదేవీగా గుర్తించిన ఐటీ శాఖ.. మంత్రి భార్య రేణుకమ్మ పేరిట ఉన్న 30 ఎకరాలను ఇప్పటికే అటాచ్ చేసింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని ఆస్పరి, చిన్నహోతూరు గ్రామాల పరిధిలో 2006లో రియల్ ఎస్టేట్ సంస్థ ఇట్టినా కంపెనీ 443 ఎకరాలు స్థానికుల నుంచి కొనుగోలు చేసింది. అప్పట్లోనే వ్యవసాయేతర భూములుగా మార్పుచేసింది.

ఆస్పరి పరిధిలోని 17సర్వే నంబర్లలోని.. 81.41 ఎకరాలు, చిన్నహోతూరులోని 31 సర్వేనంబర్లలోని 209.14 ఎకరాలను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్‌గా మార్చాలని ఆర్జీ పెట్టుకుంది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం 1839, 2009, 184 నంబర్లతో చలానాలు తీసి 9శాతం పన్ను చెల్లించింది. 2008 ఆగస్టు 4న తహసీల్దార్ నివేదిక ఇవ్వగా, అదేనెల 23న ఆర్డీవో వ్యవసాయేతర భూములుగా కన్వర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నాటి నుంచి 290.55 ఎకరాలపై జరిగే లావాదేవీలు ఎకరాల్లో కాకుండా, చదరపు గజాల్లో చేయాల్సి ఉంటుంది. కన్వర్షన్ అయ్యాక తిరిగి వ్యవసాయ భూములుగా మార్చరాదని నాలా చట్టం చెబుతోంది.

మంత్రి జయరాం తన భార్య పేరుతో 30.83 ఎకరాలు 2020 మార్చిలో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్టరైన సర్వే నంబర్లరో (674/E, 729, 688/2, 668/సి, 689/సి, 713/ ఏ) ఇట్టినా కంపెనీ కన్వర్షన్ చేయించిన జాబితాలోనే ఉన్నాయి. వీటిని మంత్రి వ్యవసాయ భూములుగా చూపించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆస్పరిలో వ్యవసాయేతర భూమి ఎకరా విలువ 20.33 లక్షల నుంచి 38.72 లక్షల వరకు ఉంది. మెట్టభూమి విలువ 3లక్షలుగా ఉంది. వ్యవసాయ భూములుగా చూపినందున 7.5శాతం స్టాంపు డ్యూటీ చొప్పున ఎకరాకు రూ.22,500 చొప్పున చెల్లించినట్లు అవుతుంది.

30 ఎకరాలకు రూ.6.75 లక్షలు కట్టారు. వాస్తవానికి ఎకరాకు రూ.1.80-2,80 లక్షల వరకు చలానా తీయాలి. ఇలాగైతే రేణుకమ్మ పేరిట రిజిస్టరైన 30 ఎకరాలపై సుమారు రూ.80 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లే. మంత్రి సోదరుడు శ్రీనివాసరావు భార్య ఉమాదేవి పేరుతో 30.53ఎకరాలు, మరో సోదరుడు నారాయణస్వామి భార్య త్రివేణి పేరిట 31.58 ఎకరాలు, బంధుగణం పేరుతో సుమారు 80ఎకరాలకుపైగా వ్యవసాయ భూములుగానే రిజిస్టర్ చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటికీ లెక్కిస్తే ఫీజు రూపేణా ప్రభుత్వానికి భారీగా గండిపడ్డట్లు తెలుస్తోంది. స్థానిక దస్తావేజు లేఖరులను కాదని ఆదోనికి చెందిన వారితో డాక్యుమెంటనేషన్ చేయించడం అనుమానాలకు తావిస్తోంది.

ఈ భూముల రిజిస్ట్రేషన్‌పై ఆస్పరి సబ్ రిజిస్ట్రార్ జగదీశ్ వర్మను అడగ్గా రెవెన్యూ లేదా భూ యాజమాన్యం కన్వర్షన్ పై సమాచారమిస్తే ఫాం(4) ద్వారా జాబితాలో పెట్టి ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తామని చెప్పారు. తహసీల్దార్ కుమారస్వామిని వివరణ కోరగా తాను నెల క్రితమే విధుల్లో చేరానని, ఫైల్స్ చూశాక చెబుతానన్నారు. పత్తికొండ ఆర్డీవో మోహన్‌దాస్ ఫోన్లో అందుబాటులోకి రాలేదు. ఆలూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంటేషన్ పూర్తిచేసి సమర్పించగా, ఆస్పరి సబ్‌రిజిస్ట్రార్ ఆమోదించినట్లు తెలుస్తోంది.

మంత్రి జయరాం భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అడ్డదారులు

ఇవీ చదవండి:

Last Updated :Dec 11, 2022, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.