ETV Bharat / state

పేరు సొసైటీది... పెత్తనం అధికార పార్టీది

author img

By

Published : Dec 4, 2020, 5:57 PM IST

కర్నూలు జిల్లాలో మత్స్యకారుల సొసైటీల ఆధ్వర్యంలో ఉన్న చెరువులు.. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. సొసైటీలో సభ్యత్వం ఉన్నవారికి కొంత ముట్టజెప్పి గ్రామస్థాయి అధికార పార్టీ నాయకులు చెరువులో చేపలు పెంచి లక్షలు ఆర్జిస్తున్నారు.

karnool district fishermen society under ysrcp leaders
karnool district fishermen society under ysrcp leaders

కర్నూలు జిల్లాలో మత్స్యశాఖ కన్ను తెరిచి నిద్రపోతోంది. మత్స్యకారుల సొసైటీల ఆధ్వర్యంలో చెరువులు ఉన్నా.. ఇతరులు చేపలు పెంచుతున్నా.. చూసి చూడనట్లు నిర్లక్ష్యం వహిస్తోంది. మత్స్యకారుల సొసైటీల ఆధ్వర్యంలో చేపలు పెంచుకుని, పట్టుకునే హక్కు ఉంది. అయితే కొందరు అధికార పార్టీ గ్రామస్థాయి నాయకులు సొసైటీలో సభ్యత్వం ఉన్నవారికి ఎంతో కొంత చేతిలో పెట్టి చేపలు పెంచుతున్నారు. పేరుకు సొసైటీని అడ్డుపెట్టుకుని దర్జాగా చెరువుల్లో చేపల సాగు చేసి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. నిజమైన మత్స్యకారులకు మొండిచేయి చూపిస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా, తమ దృష్టికి ఏమీ రాలేదంటూ... అధికారులు మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.

కర్నూలు జిల్లా పెదకడబూరు మండల పరిధిలోని చిన్నతుంబళంలో 1055 ఎకరాల్లో చెరువు ఉంది. ఈ చెరువుకు మత్స్య సంఘ సొసైటీ ఉన్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధి కుడి భుజం అని చెప్పుకొనే ఓ వ్యక్తి చెరువులో చేప పిల్లలను వదిలారు. సొసైటీ సభ్యులకు ఎంతో కొంత ఇచ్చి చెరువులో లక్షల్లో చేప పిల్లలను వదిలి పెంచుతున్నారు. పేరుకు ఇలా సొసైటీ పేరు చెప్పి చివరికి లాభాలను నేతలు జేబులు వేసుకుంటున్నారు.

అదే అదునుగా...

మత్స్యకారులు లక్షల్లో చేప పిల్లలను చెరువుల్లోకి వదలాలంటే పెట్టుబడి పెట్టలేక వ్యాపారుల చేతికి చెరువులిస్తున్నారు. ఇలాంటి చెరువులపై కన్నేసిన ప్రజాప్రతినిధులు... సంఘం పేరుతో చేపలు పెంచుతున్నారు. సభ్యులకు పట్టుబడి సమయంలో ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తూ, వాళ్లు మాత్రం రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. చెరువును నమ్ముకున్న మత్స్యకారులు దినసరి కూలీలుగా మిగిలిపోతున్నారు. బైలా నిబంధనల ప్రకారం మూడు నెలలకు జరగాల్సిన మేనేజ్‌మెంట్‌ సమావేశం, ఆరు నెలలకోసారి సాధారణ సమావేశం, అత్యవసర సమావేశాల ఊసేలేదు. ఒక వేళ జరిగినా మమ అనిపిస్తున్నారు. కానాల చెరువులో ప్రస్తుతం సొసైటీ సభ్యులంతా తలా రూ.10 వేలు పెట్టుబడి పెట్టి పిల్లలు తెచ్చి వదిలారు. పట్టుబడి సమయంలో అందరూ ఆ లాభాలను పంచుకుంటున్నారు. అదే తరహా మిగిలిన చోట్ల జరగాల్సి ఉన్నా జరగడం లేదు.

వెల్దుర్తి పరిధిలోని రత్నపల్లి, సూదేపల్లి, సర్పరాజపురం చెరువుల్లో స్థానిక ప్రజాప్రతినిధికి చెందిన బంధువులు చేపలు పెంచి ఆదాయం పొందుతున్నారు. అంతేకాదు కృష్ణగిరి జలాశయంలో చేపలు పెంచుకుని పట్టుకునేందుకు రూ.30 లక్షలకు ఇతర ప్రాంతాలవారికి కట్టబెట్టినట్లు సమాచారం. దీంతో గ్రామస్థాయి నాయకులు బయటకు చెప్పుకోలేక మథన పడుతున్నారు.

నా దృష్టికి వస్తే కదా? చర్యలు తీసుకునేది..

ఇప్పటి వరకు చెరువుల్లో ఇతరులు చేపలు పెంచుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ఫిర్యాదు వస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. చెరువుల లీజుకు సొసైటీలకే మొదటి ప్రాధాన్యం. జీవో ప్రకారం ప్రతి సంవత్సరం 10% లీజు పెంచుతున్నాం. - శ్రీహరి, మత్స్య శాఖ జేడీఏ

ఇదీ చదవండి: పింఛన్ల పంపిణీలో సీఎం జగన్​వి పచ్చి అబద్ధాలు: చంద్రబాబు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.