ETV Bharat / state

శ్రీశైలం దేవాలయ ట్రస్ట్ బోర్టు సభ్యుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు

author img

By

Published : Jul 21, 2021, 1:48 PM IST

శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఛైర్మన్ ఎంపికను పూర్తి చేసిన ప్రభుత్వం.. సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. నూతన ఛైర్మన్​గా ప్రకటించిన రెడ్డి వారి చక్రపాణి రెడ్డి.. మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.

Srisailam temple
శ్రీశైలం దేవాలయం

శ్రీశైలం దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి నియామకం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మండలి ఛైర్మన్​గా చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డి వారి చక్రపాణి రెడ్డిని ప్రభుత్వం ప్రకటించింది. సభ్యులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడే బోర్డుకు వైస్ ఛైర్మన్, సభ్యుల సంఖ్య పెరుగనుందని ప్రచారం జరుగుతోంది.

దేవస్థానం ట్రస్టు బోర్డు ఎంపిక విధానం

రాష్ట్రంలోని దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేయాలంటే ముందుగా దేవాదాయశాఖ తరఫున జీవో జారీ చేయాల్సి ఉంటుంది. ఆ జీవో ప్రకారం ఆయా దేవస్థానాల కార్యనిర్వాహణాధికారులు వార్తా పత్రికల్లో ప్రకటన జారీ చేస్తారు. ఆ ప్రకటన మేరకు ఆశావహులు ట్రస్ట్ బోర్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. వచ్చిన దరఖాస్తులను దేవస్థానం తమ అధికారులు, సిబ్బందితో విచారణ చేసుకొని నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్​కు పంపిస్తారు. కమిషనర్, ప్రభుత్వ స్థాయిలో సభ్యులను ఎంపిక చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు. అభ్యర్థులు సభ్యులుగా దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం సభ్యలందరు కలసి ఛైర్మన్​ను ఎన్నుకుంటారు. కానీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ముందుగానే ఛైర్మన్​ను ప్రకటించింది.

స్వామి వారిని దర్శించుకున్న నూతన ఛైర్మన్

శ్రీశైల దేవస్థానం ఛైర్మన్​గా ప్రభుత్వం ఎంపిక చేసిన రెడ్డి వారి చక్రపాణి రెడ్డి... స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. నందినీ కేతన్ అతిథి గృహంలో పలు అంశాలు చర్చించారు. అనంతరం ఆలయ దర్శనానికి వెళ్లిన చక్రపాణికి.. ఈఓ, అర్చకులు సాదర స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న చక్రపాణి... తనకు ఛైర్మన్​గా అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

srisailam: శ్రీశైలం భ్రమరాంబికా దేవికి బంగారు గొలుసు, పట్టుచీర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.