CM Jagan Will Release Water to Ponds: అసంపూర్తిగా పైప్‌లైన్ పనులు.. చెరువులకు నీటిని విడుదల చేయనున్న సీఎం జగన్
Published: Sep 19, 2023, 10:22 AM


CM Jagan Will Release Water to Ponds: అసంపూర్తిగా పైప్‌లైన్ పనులు.. చెరువులకు నీటిని విడుదల చేయనున్న సీఎం జగన్
Published: Sep 19, 2023, 10:22 AM

CM Jagan Will Release Water to Ponds : రైతు ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు పలుకుతూనే వారిని మోసం చేస్తోంది జగన్ సర్కార్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చెరువుల అభివృద్ధి అంటూ కోట్లు ధారపోసినా వాటి ఫలితం రైతన్నలకు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడికక్కడ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కొన్నిచోట్ల ఇంకా పైపులైన్లే వేయలేదు. మరికొన్ని చోట్ల ఆ ఊసే మరిచారు. పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును ప్రారంభించేందుకు సీఎం సిద్ధమైపోయారు.
CM Jagan Will Release Water to Ponds in Kurnool District : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్, పత్తికొండ వంటి కరువు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో 68 చెరువులకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (Handri Handri Neeva Sujala Sravanthi scheme) ద్వారా నీరిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ ప్రభుత్వం మారటం అన్నదాతలకు శాపంగా మారింది.
Water to Ponds from Handri Neeva Scheme : సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏలుబడిలో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించినా పూర్తిగా సద్వినియోగం చేయలేకపోయారు. తూతూ మంత్రంగా పనులు చేసి మమ అనిపించారు. చాలా చోట్ల పైపులైన్లు వేయలేదు. అయితే సీఎం జగన్ ఇవాళ చెరువులకు నీరిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనులు పూర్తి కాకుండానే చెరువులకు నీరు ఎలా ఇస్తారని రైతులు విస‌్మయం వ్యక్తం చేస్తున్నారు.
Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు
సీఎం జగన్ ప్రాజెక్టును ప్రారంభించే తుగ్గలి మండలం పగిడిరాయి చెరువు వద్ద కూడా ప్రధాన పైపులైను వేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పగిడిరాయి చెరువు నిండితేనే జొన్నగిరి, ఎర్రగుడి చెరువులనూ గ్రావిటీపై నింపుకోవచ్చు. జొన్నగిరి చెరువు ఎప్పటికి నిండుతుందో తెలియని పరిస్థితి. కానీ ఈ మూడింటినీ ట్రయల్ రన్ చేపడుతున్నట్లు అధికారులు జాబితాలో చూపారు. ప్యాపిలి మండలం చండ్రపల్లి చెరువు వద్ద అసలు పనుల జాడే లేదు. గుడిపాడు చెరువుకు 3 కిలోమీటర్ల దూరంలో ప్రధాన పైపులైను పనులు సాగుతున్నాయి.
Water Leaking from Pipes : చక్రాల చెరువుకు నీళ్లు పంపాలని ట్రయల్‌రన్ వేయగా ఓ చోట పైపులైను లీకేజీ సమస్య తలెత్తింది. మరమ్మతులు చేసినా నీళ్లు మాత్రం రాలేదు. ఆర్.ఎస్.పెండేకల్లు చెరువుకు కనెక్షన్ ఇవ్వలేదు. ప్రధాన పైపులైను నుంచి చెరువుకు నీళ్లు పంపాలంటే రోడ్డును తవ్వి పైపులు వేయాలి. ట్రయల్ రన్‌లో భాగంగా ఆలంకొండ వద్ద నిర్మించిన పంప్‌హౌస్ నుంచి నీటిని కటారు కొండకు పంపగా పైపులైను లీకై నీరు భారీగా ఎగసిపడింది. ఆ పైపులైనుకు వెల్డింగ్ చేసి, ఇనుప ముక్కలు అతికించి వదిలేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
చెరువుల అభివృద్ధి పేరుతో ప్రభుత్వం మోసగిస్తోందని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ పనులు పూర్తి కాకుండా నీరు ఇస్తే ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తున్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని 68 చెరువులు, వీటికి అదనంగా అనుసంధానం చేస్తున్న మరో తొమ్మిది నిండటానికి 90 రోజుల సమయం పడుతుంది. ఫలితంగా 10వేల 130 ఎకరాలకు సాగునీరు, 57 గ్రామాలకు తాగునీరు అందాలి. ప్రస్తుతం హంద్రీనీవాలో నీరు పుష్కలంగా ప్రవహిస్తే ప్రాజెక్టుకు అవసరమైన 1.238 టీఎంసీల నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రధాన కాలువకు ఎన్ని రోజుల్లో నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
