ETV Bharat / state

నీటి కొరతకు పరిష్కారం.. సరికొత్త పద్ధతిలో బోరు వేసిన రైతు

author img

By

Published : Jan 30, 2023, 7:42 PM IST

Farming with Innovative Ideas: అవసరం... ఆ రైతులో ఓ ఆలోచనకు బీజం వేసింది. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి సరికొత్త పద్ధతిలో బోరు వేశారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా ఏడాదికి మూడు పంటలు పండించేందుకు సన్నద్ధమయ్యారు. మచిలీపట్నం రైతు ఆచరిస్తున్న నూతన సాగునీటి కల్పనపై కథనం.

Farming with Innovative Ideas
Farming with Innovative Ideas

నీటి కొరతకు పరిష్కార మార్గం.. సరికొత్త పద్ధతిలో బోరు వేసిన రైతు

Farming with Innovative Ideas: మచిలీపట్నానికి చెందిన వెంకట్రావు.. వినూత్న ఆలోచనతో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వెంకట్రావుకు మచిలీపట్నం మండలం కొత్తపూడిలో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొదటి పంటగా వరి పండించిన తర్వాత... మిగతా సమయంలో పొలం ఖాళీగా ఉంచాల్సి వస్తోంది. ఆ ప్రాంతంలో భూమి లోపలికి 15 అడుగుల వరకే మంచి నీరు లభ్యమవుతుంది. 15 అడుగుల దిగువన ఉప్పు నీరు మాత్రమే లభిస్తుంది. ఈ ఉప్పు నీరు వల్ల చాలా వరకు పొలాలు బీడు వారిపోతుంటాయి.

ఫలితంగా రెండో పంట వేయడం సాధ్యపడకుండా పోతోంది. దీనికి పరిష్కారం కనిపెట్టేందుకు వెంకట్రావు వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నారు. సాధారణంగా.. నీటి కోసం భూమిలోనికి నిలువుగా బోర్లు వేయడం చూస్తుంటాం. కానీ వెంకట్రావు.. సముద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పొలంలో.. 15 అడుగుల లోతులో భూమికి సమాంతరంగా బోరు వేసి గొట్టాలు ఏర్పాటు చేశారు. వాటికి రంధ్రాలు చేసి.. మట్టి, వ్యర్థాలు పైపులోకి రాకుండా.. పైపుల చుట్టూ కంకర, ఇసుక, ఫిల్టర్ మెస్‌ చుట్టారు. ఊట నీరు పైపులోకి వచ్చేలా ఏర్పాటు చేశారు.

ఇలా వచ్చిన నీరు పడేందుకు.. 18 అడుగుల లోతులో సంపులు నిర్మించారు. వీటిలో నిల్వ ఉన్న నీటిని మోటారు సాయంతో ఎత్తిపోసి.. లక్షా 50 వేల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న భారీ సంపులోకి పోస్తున్నారు. ఈ విధానం వల్ల రైతుకు ఖర్చు తగ్గడంతోపాటు.. ఏడాది పొడవునా నీటికి ఇబ్బంది ఉండదని.. రైతు వెంకట్రావు చెబుతున్నారు. తన ఆలోచన మరికొందరు రైతులకు స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నట్లు రైతు వెంకట్రావు తెలిపారు. ఈ పద్ధతిని పాటిస్తే.. మచిలీపట్నం ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు ఉండబోవన్నారు.

అమరావతి రాజధాని గ్రామాల్లో ఎలా అయితే మూడు పంటలు పండుతాయో అలాగే ప్రతి రైతు మూడు పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఈ బోరుతో ధారళంగా నీరు వస్తుంది.. ఈ నీటితో 20 ఎకరాల భూమిని సాగుచేస్తున్నాను. బోరు కోసం 5 లక్షలు అయింది.. ఎకరం ఉన్న రైతులు కూడా ఈ విధానాన్ని పాటించవచ్చు. ఎకరానికి రెండు పైపులు వేస్తే సరిపోతుంది పెద్దగా ఖర్చు కూడా ఉండదు.- కొట్టె వెంకట్రావు, రైతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.