ETV Bharat / state

ACCIDENT: విషాదంగా ముగిసిన సరదా ప్రయాణం

author img

By

Published : Sep 13, 2021, 6:50 AM IST

Updated : Sep 13, 2021, 3:14 PM IST

ఆ ముగ్గురు స్నేహితులు. ఒకే వృత్తి .. ఒకే చోట పని చేస్తుంటారు. అయితే ఆ ముగ్గురు కలిసి సరదాగా కొండపల్లి ఖిల్లా ప్రయాణం విషాదంగా ముగిసింది. కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతితో ఆ కుటుంబాలల్లో విషాదం నెలకొంది.

hree youths were killed in a road accident
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

మితిమీరిన వేగంతో ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడరును ఢీకొనడంతో ముగ్గురు యవకులు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా భవానీపురంలో జాతీయ రహదారిపై జరిగింది. ఇద్దరు యువకులు ఘటనా స్థలంలో మృతి చెందగా.. మరొక వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. తాడిగడప, గోశాల, ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన పి . మణికంఠ, సయ్యద్ సాదిక్, రషీద్.. ప్రైవేటు ఎలక్ట్రిషియన్లుగా పనిచేస్తున్నారు. సరదాగా కొండపల్లి ఖిల్లాకు ఉదయం 9 గంటలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి బయలుదేరారు. వెంకటేష్ ఫౌండ్రీ వద్దకు వచ్చేసరికి వీరు తమ ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి డివైడరును ఢీకొన్నారు. దీంతో బండిపైన ఉన్న ముగ్గురు ఎగిరి రోడ్డు మీద ఒకరు, డివైడర్ పక్కన ఇద్దరు పడిపోయారు. తలకు తీవ్రగాయాలైన మణికంఠ, సాదిక్ సంఘటన స్థలంలోనే చనిపోగా.. తీవ్రగాయాలపాలైన రషీదు ఆంబులెన్సులో చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ మూడు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.

కామయ్యతోపుకు చెందిన సయ్యద్ సాధిక్ కొంతకాలం నుంచి కామయ్యతోపు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇతనికి భార్య కుమారుడు ఉన్నారు. మణికంఠ తాడిగడప కార్మికనగర్ నివాసి... ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతి చెందిన వారిలో మరో యువకుడు రషీద్.. యనమలకుదురుకు చెందిన వ్యక్తి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిలిచిపోయిన ట్రాఫిక్​ను పునరుద్ధరించారు. అనంతరం ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అక్కడ తరచూ ప్రమాదాలు..

జాతీయ రహదారిపై వెంకటేశ్​ పౌండ్రీ దగ్గర నుంచి దర్గావరకు ప్రమాదకర మలుపుకావడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మలుపు వద్ద వాహన వేగం గంటకు 45 కిలోమీటర్లకు మించి ఉండకూడదు. మణికంఠ ప్రయాణిస్తున్న మోటరు సైకిల్ గంటకు 60 కిలోమీటర్లకుపైగా వెళ్లడంతో బైకు అదుపు తప్పి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. హెల్మెట్లు ధరించకపోవడం వాళ్ల మరణానికి ప్రధాన కారణమని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. హెల్మెట్టు ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి..

స్నేహితుల మధ్య వివాదం.. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నం!

Last Updated : Sep 13, 2021, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.