ETV Bharat / state

బెదిరిస్తే పారిపోం.. ఎదురు తిరుగుతాం.. జగన్​పై చంద్రబాబు ఆగ్రహం

author img

By

Published : Mar 20, 2023, 3:57 PM IST

Updated : Mar 20, 2023, 6:55 PM IST

Chandrababu fire on Government : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది చిన్న గాలి మాత్రమే.. రాబోయేది సునామీ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేపై దాడి చీకటి రోజు అని అభివర్ణించారు. ఈ విషయమై ఈ నెల 25 నుంచి మూడ్రోజుల పాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

Chandrababu fire on Government : జీవో నంబర్ 1, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై దాడి విషయమై తెలుగుదేశం కార్యాచరణ ప్రకటించింది. ఈ విషయాలపై ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పర్యటనలు చేపట్టనున్నారు. జీవో నంబర్ 1 జారీ చేసిన ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన ఘటన చూస్తుంటే కోపం వస్తుందన్నారు. జీవో నంబర్ 1ను రద్దు చేయమని అడగడం తప్పా అని నిలదీశారు. ఆగస్టు సంక్షోభంలోనూ.. తెలంగాణ ఉద్యమం సందర్భంలోనూ.. సభలో ఎమ్మెల్యేలను కొట్టలేదని గుర్తు చేశారు. ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదన్న ఆయన... ఇవాళ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన చరిత్రలో చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. పెద్ద మనిషి బుచ్చయ్య చౌదరి మీదకు వస్తారా..? అని మండిపడ్డారు. స్వామి మీద చేయి వేయకుండా చూసుకోలేకపోయాననే బాధ తనకెప్పుడూ ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

చంద్రబాబు నాయుడు

ఎవ్వరూ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి... ప్రతిపక్ష సభ్యులపై దాడులు చేయాలనే ఆలోచన తనకెప్పుడూ రాలేదన్నారు. బాబాయ్ గొడ్డలిపోటు, కోడి కత్తి డ్రామా తరహాలోనే ఇప్పుడు సభలో వైఎస్సార్సీపీ వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది చిన్న గాలే.. రాబోయేది సునామీ.. అని హెచ్చరించారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు.. కానీ, అసెంబ్లీ శాశ్వతమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంలో మాట్లాడుకునే పరిస్థితి కూడా లేనప్పుడే.. ఎమ్మెల్యేలు విజ్ఞతతో వ్యవహరించారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ 150 మంది ఉన్నారని.. మేం 20 మంది ఉంటే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. సభలో మమ్మల్ని చంపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నిస్సహాయుడా అని విమర్శించారు. నేతల మీద దాడి.. ఆఫీసుల మీద దాడి.. ఇదేనా వైఎస్సార్సీపీ విధానం అని దుయ్యబట్టారు.

25 నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన.. స్వామి పోరాటం ఊరికే పోదన్న చంద్రబాబు.. స్వామిపై విలన్ల మాదిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని మండిపడ్డారు. స్వామిపై దాడి చేసిన వారిని సభలో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. సభలో స్వామిపై దాడి చేసిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని.. ఈ నెల 25వ తేదీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తారని తెలిపారు. జీవో నంబర్ 1, సభలో ఘటనలను ప్రజలకు వివరిస్తారని చెప్పారు. ఇవే అంశాలపై ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తి జగన్.. అర్హత లేని పార్టీ వైఎస్సార్సీపీ. గతంలో ఎన్నో సందర్భాలన్నాయి. నేను, రాజశేఖర్ రెడ్డి ఎన్నో సందర్భాల్లో పోటీ పడ్డాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో గౌరవించా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ నన్ను చూసి తగ్గాడు. నేను తగ్గినా, ఆయన తగ్గినా ఒకరికి ఒకరం చూసి కాదు. ప్రజల్ని చూసి. మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఎమోషనల్ గా మాట్లాడినా, దూషించుకున్నా క్షమాపణ చెప్ప వచ్చు గానీ, చేయి చేసుకోవడం, కొట్టే హక్కు లేదు. అక్కడే నేను బాధపడుతున్నా. నా జీవితంలో మా తమ్ముడు స్వామిని కాపాడుకోలేక పోయాను. దెబ్బ పడకుండా చూడలేక పోయాననే బాధ ఉంది. నేనెప్పూడూ అపోజిషన్ పార్టీ సభ్యులను కొట్టించాలని ఆలోచించలేదు. వెనుదిరిదే సమస్యే లేదు. ఎన్ని అవమానాలనైనా, ప్రజల కోసం భరిస్తాం. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం.. అదే టీడీపీ బాధ్యత. ఒక స్వామిని కొడితే భయపడిపోతారో, ఇంకో ఎమ్మెల్యేని కొడితే భయపడిపోతారో అని అనుకుంటే భ్రమే.. మేం పారిపోం.. బట్టలిప్పిస్తాం.. గుర్తుపెట్టుకోండి. విలువలు లేని వ్యక్తులు మీరు. గౌరవంగా ఉంటే ఉండండి. ఎన్నో సంక్షోభాలు చూశాం. ఎంతో మందితో పోరాడాం.. నువ్వొక లెక్క కాదు టీడీపీకి.. ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. - నారా చంద్రబాబు, తెలుగుదేశం అధినేత

ఇవీ చదవండి :

Last Updated :Mar 20, 2023, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.