ETV Bharat / state

TDP PROTEST: కృష్ణా జిల్లాలో తెదేపా నిరసనల హోరు..

author img

By

Published : Oct 20, 2021, 10:32 AM IST

Updated : Oct 20, 2021, 2:17 PM IST

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో దాడులను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా బంద్​కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో.. కృష్ణాజిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. వైకాపా దౌర్జన్యం నశించాలని నినదించారు. అదే సమయంలో.. నిరసనల్లో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. గొల్లపూడి సెంటర్​లో మాజీ మంత్రి దేవినేని అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల నేతలను నిర్బంధించారు.

TDP PROTEST
TDP PROTEST

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో దాడులను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా బంద్​కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో.. కృష్ణాజిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. వైకాపా దౌర్జన్యం నశించాలని నినదించారు. అదే సమయంలో.. నిరసనల్లో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. గొల్లపూడి సెంటర్​లో మాజీ మంత్రి దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్నారు. తెదేపా నేత బుద్ధా వెంకన్నను గృహ నిర్బంధం చేశారు.

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: దేవినేని
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెదేపా నాయకులు దేవినేని ఉమా అన్నారు. జగన్ సర్కారు స్వేచ్ఛను హరిస్తోందన్న ఆయన.. పోలీసులు వైకాపా తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైకాపా గుండాలు దాడి చేస్తే నిరసన చేపట్టడం తప్పా? అని ప్రశ్నించారు. అనంతరం.. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై జరిగిన దాడిపై పటమట పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పట్టాభి సతీమణితో కలిసి మాజీ మంత్రులు దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దేవినేని ఉమ అరెస్ట్

దాడి వెనుక వారే..?
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిచేసిన వారిలో.. విజయవాడ వైకాపా నేతలున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్​కు చెందిన వివిధ కార్పొరేటర్లు స్వయంగా దాడులు పాల్పడ్జారని నేతలు ఆరోపిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిలో పలువురు రౌడీ షీటర్లు కూడా ఉన్నారని అనుమానిస్తున్నారు. తెర వెనుక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న నేతలు.. ఇదే అంశంపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

అరెస్టుల పర్వం..
విజయవాడ నెహ్రూ బస్​స్టాండ్ ఆవరణలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్​తోపాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • కోడూరు ప్రధాన కూడలిలో మండల తెదేపా అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. నేతలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.
  • నాగాయలంకలో నిరసన తెలుపుతున్న తెదేపా నాయకురాలు తలశిల స్వర్ణలతను పోలీసులు అరెస్ట్ చేశారు.
  • గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. గుడివాడ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ రావి వెంకటేశ్వరరావును అరెస్టు చేసిన పోలీసులు.. నందివాడ మండల పోలీస్ స్టేషన్​కు తరలించారు.
  • తెదేపా బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నూజివీడులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నూజివీడు సబ్ డివిజన్లో 26 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మరికొంత మందిని హౌస్ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
  • నందిగామలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఇంటివద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు.
  • నూజివీడులో తెదేపా చేపట్టిన బంద్​ను పోలీసులు అడ్డుకున్నారు. రాజీవ్ సర్కిల్ వద్దకు చేరుకున్న తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులకు నిరసనగా కార్యకర్తలు పోలీసు జీపునకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు.
  • మైలవరంలో పోలీస్ పహారాతో బంద్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. టీడీపీ పార్టీ కార్యాలయం పై దుండగుల దాడి నేపథ్యంలో రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై తెదేపా కీలక నేతలను గృహనిర్బంధం చేశారు. బంద్ నిర్వహించేందుకు బయటకు వచ్చిన టీడీపీ యువ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
  • మచిలీపట్నంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెదేపా కార్యాలయంపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
  • జగ్గయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్ నిర్వహణ కోసం తెదేపా శ్రేణులు భారీగా తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెదేపా నాయకులు శ్రీరామ్ తాతయ్య, నెట్టెం రఘురామ్ లను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.
  • గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్​లో పోలీసులు తెదేపా నేతలను అడ్డుకున్నారు. రోడ్లపైకి చేరుకున్న నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కూచిపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.
  • కేసరపల్లిలో తెదేపా ఇన్​ఛార్జ్ బచ్చుల అర్జునుడును ఇంటి వద్దే పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సమయంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బచ్చుల అర్జునుడు, ఇతర నాయకులను అరెస్ట్ చేసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: 'ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలపై జవాబు దారితనంతో వ్యవహరించాలి'

Last Updated :Oct 20, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.