ETV Bharat / state

అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉన్నా.. అందుకే టీడీపీలో చేరా..: కన్నా లక్ష్మీ నారాయణ

author img

By

Published : Feb 24, 2023, 3:29 PM IST

Kanna Laxminarayana Comments : అమరావతి కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసమే తాను టీడీపీలో చేరానని సీనియర్ నాయకులు కన్నా తెలిపారు. తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉన్నా, ఎలాంటి షరతులు లేకుండానే తెలుగుదేశంలో చేరానని కన్నా స్పష్టం చేశారు. కన్నా చేరికను ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.

కన్నా లక్ష్మీ నారాయణ
కన్నా లక్ష్మీ నారాయణ

Kanna Laxminarayana Comments : టీడీపీ, జనసేన కలిసి రావాలని ప్రజలే కోరుకుంటున్నారని తెలుగుదేశం నేత కన్నాలక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఈ‌ కలయిక పట్ల రాజకీయ నాయకుల‌ కంటే ప్రజలే ఎంతో ఆసక్తిగా ఉన్నారని ఆయన అన్నారు. తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉన్నా, ఎలాంటి షరతులు లేకుండానే తెలుగుదేశంలో చేరానని కన్నా స్పష్టం చేశారు. అమరావతి కోసం, రాష్ట్రం కోసం మాత్రమే తాను టీడీపీలో చేరానని తెలిపారు.

వైఎస్సార్సీపీ చిల్లర రాజకీయం..: కన్నా లక్ష్మీనారాయణకు విజయవాడలోని తన నివాసంలో తెదేపా నేత బుద్దా వెంకన్న అల్పాహార విందు ఏర్పాటు చేశారు. బుద్దా వెంకన్న, కేశినేని చిన్ని, నాగుల్ మీరా కన్నాకు సాదర స్వాగతం పలికారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేక వైఎస్సార్సీపీ చిల్లర రాజకీయం చేస్తోందని కన్నాలక్ష్మీనారాయణ విమర్శించారు. ఈ రాక్షస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం‌ ఉందని, భవిష్యత్తు తరాల కోసం అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాను కుల నాయకుడిని కానని రాజకీయ నాయకుడిని మాత్రమేనని కన్నా స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ఆనాడే కన్నా ధైర్యంగా చెప్పారని బుద్దా వెంకన్న గుర్తు చేశారు. తమ అధినేత సారథ్యం, కన్నా సూచనలతో అందరం కలిసి పని చేస్తామని పేర్కొన్నారు.

టీడీపీ నేతల మీడియా సమావేశం

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి పరిస్థితులు దిగజారిపోయాయి. సామాన్యుడు మొదలుకుని పారిశ్రామికవేత్తల వరకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం కంటే మంచి పాలసీ ఇస్తామని చెప్పి విస్మరించారు. భవన నిర్మాణ కార్మికులు భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. 50 లక్షల మంది వీధిన పడిన పరిస్థితి నెలకొంది. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకుపోయిన చందంగా పరిస్థితి తయారైంది. అన్ని చార్జీలు పెరిగిపోయాయి. పేదలనూ వదలకుండా చెత్త పన్నుకూడా వేశారు. సమస్యలపై ప్రతిపక్షాలను మాట్లాడకుండా అణగదొక్కుతూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ప్రభుత్వంపై పోరాటానికి ప్రజాస్వామ్యవాదులంతా కలిసి రావాలి. - కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం నేత

ప్రజాధనం అంతా తాడేపల్లి ప్యాలెస్​కు.. జగన్ వంటి నిరంకుశవాదిని తరిమి కొట్టడం ఖాయమని మరోనేత నాగూల్‌ మీరా స్పష్టంచేశారు. మద్యం షాపుల ద్వారా వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చుకున్నారని ఆయన ఆరోపించారు. కన్నా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని కేశినని చిన్ని తెలిపారు. రాక్షస పాలనను తరిమి కొట్టి.. ప్రజా పాలన అందిస్తామని అన్నారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని కేశినేని చిన్ని తెలిపారు.

కన్నా లక్ష్మీనారాయణ బలమైన వ్యక్తి.. ఆయన బలమైన పార్టీలో చేరడం వైఎస్సార్సీపీ నాయకులకు మింగుడు పడడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడాన్ని నాయకులంతా స్వాగతించారు. అందరూ కూడా తమ నియోజకవర్గానికి కూడా ఆహ్వానిస్తున్నారు. కాపు నాయకుల్లో వంగవీటి తర్వాత అంతటి బలమైన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. - బుద్ధా వెంకన్న, టీడీపీ నేత

టీడీపీలో కన్నా చేరికను ప్రతి కార్యకర్త ఆత్మీయంగా స్వాగతిస్తున్నారు. ఆయన అందరివాడు. తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిక శుభసూచకం. జగన్ మోహన్ రెడ్డి పాలనను తరిమేందుకు ఇది ఆరంభం. నిరంకుశ, నియంతను పారదోలేందుకు బలమైన నాయకులను కలుపుకొని ప్రజల్లోకి వెళ్లాలి. ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొంటానని జగన్ కలలు కంటున్నాడు. - నాగుల్ మీరా, టీడీపీ నేత

రాష్ట్ర రాజధాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్రంలో అధకారంలో ఉన్న పార్టీని వీడి టీడీపీలోకి రావడం రాష్ట్రం పట్ల ఆయన నిబద్ధతను చాటుతున్నది. - కేశినేని చిన్ని, టీడీపీ నేత

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.