ETV Bharat / state

బియ్యం కార్డు సమస్యలా?? ఇవిగో పరిష్కారాలు..!

author img

By

Published : Dec 28, 2020, 1:01 PM IST

మీకు బియ్యం కార్డు లేదా..? ఇప్పటికే ఉన్నదాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలా..? కొత్తగా పేర్లు పొందు పరచాలా..? ఇలాంటివి సమస్యలు ఎప్పడూ ఉంటూనే ఉంటాయి. కానీ.. వాటి పరిష్కారానికి సరైన విధానం తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసం ప్రజలు అనుసరించాల్సిన విధానాలపై  ఈటీవీ భారత్​ అందిస్తోన్న ప్రత్యేక’ కథనం.

ration card problems and solutions for awareness
బియ్యం కార్డు సమస్యలా?? ఇవిగో పరిష్కారాలు..!

రేషన్​ బియ్యం కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనే లబ్ధిదారులు అనుసరించాల్సిన విధానాలను, దరఖాస్తు పద్ధతుల అవగాహన కోసం ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం అందిస్తుంది. ఇందులో కొత్త కార్డు దరఖాస్తు విధానం నుంచి రద్దైన కార్డును పునరుద్ధరించే వరకు లబ్ధిదారుల సందేహాలు పరిష్కారానికి సంబంధించి ప్రజలు అనుసరించాల్సిన విధానాలు తెలుసుకోవచ్చు.

కొత్తగా కార్డు పొందాలంటే..

అర్హులై ఉండి బియ్యంకార్డు లేని వారు కుటుంబ సభ్యులు, చిరునామా వివరాలతో సంబంధిత ప్రాంత వార్డు/గ్రామ సచివాలయాల్లో లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు నివాసప్రాంతం నుంచి వాలంటీరు లాగిన్‌లో మ్యాపింగ్‌ అయ్యి ఉండాలి. దరఖాస్తుదారుడు తన పెళ్లికి సంబంధించిన వివరాలు, సంతానం ఉంటే వారి జనన ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేయాలి. ఆ సమయంలో రూ.24 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వాలంటీరు వారి ఇంటికి వచ్చి, వివరాలు నమోదు చేసుకుంటారు. దానికి సంబంధించిన ఇ -కేవైసీని అక్కడే పూర్తి చేస్తారు. నిబంధనల మేరకు అర్హులైతే సామాజిక తనిఖీ తర్వాత 3 నుంచి 10 రోజుల్లో సహాయ పౌరసరఫరాల శాఖ అధికారి లేదా తహసీల్దార్‌ సంతకంతో బియ్యం కార్డు జారీ అవుతుంది. అత్యవసర సమయంలో గంటల వ్యవధిలోనూ కార్డు జారీ చేసే విధానం అందుబాటులో ఉంది.

అదనంగా పేర్లు చేర్చాలంటే..

బియ్యం కార్డు ఉండి, అందులోని యువకుడికి వివాహమైతే.. సదరు వధువు పేరును కార్డులో జతచేయవచ్చు. పెళ్లికి ముందు వరకు ఆమె కొనసాగిన బియ్యం కార్డులో పేరును సచివాలయ సిబ్బంది, వాలంటీరు సహకారంతో తొలగింపచేసుకోవాలి. ఆ తర్వాత పెళ్లి పత్రికను జతచేసి, వరుడి కుటుంబసభ్యుల కార్డుతో సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నూతన పేరుతో కలిపి కార్డు జారీ చేయిస్తారు. ఈ విధానానికి సైతం సుమారు రెండు వారాల సమయం పడుతుంది.

ఉమ్మడికార్డు వద్దనుకుంటే..

ఓ యువకుడు తన భార్య, తల్లిదండ్రులతోపాటు ఉమ్మడిగా కార్డు ఉండగా.. వేరుగా కాపురం ఉంటుంటే.. కొత్తగా నూతన దంపతులు బియ్యం కార్డు పొందొచ్చు. ఇలాంటి వారు పెళ్లి పత్రిక జోడించి కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. ఏ కార్డు నుంచి తమపేర్లను వేరు చేసి, నూతన కార్డు మంజూరు చేయాలో సంబంధిత వివరాలు సచివాలయంలో తెలియజేయాలి. ముందుగా వారి పేర్లను పూర్వపు కార్డు నుంచి తొలగించి, అనంతరం అర్హులైతే నూతన కార్డును పది రోజుల్లో మంజూరు చేస్తారు.

తమ పేరుపై కార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే..

అసలు తమ పేరుపై కార్డు ఉందో లేదో? ఉన్న కార్డు అమలులో ఉందో? లేదో? తెలుసుకోవాలంటే.. సచివాలయంలో సంప్రదించాలి. ఆధార్‌కార్డు నెంబరు సచివాలయ సిబ్బందికి తెలియజేస్తే.. ఆయా వివరాలు వెల్లడిస్తారు.

ఉన్నది రద్దయితే..?

ఇటీవల కాలంలో ప్రభుత్వం సిక్స్‌స్టెప్స్‌ పాలసీ ప్రకారం నిబంధనల మేరకు లేక పోతే బియ్యం కార్డును నిలిపివేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ఎక్కువ భూమి ఉన్నవారు, నిబంధనల కంటే ఎక్కువగా విద్యుత్తు వినియోగిస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబసభ్యులుగా ఉన్నవారు, సొంత కారు ఉన్నా, నివాస స్థలం నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా వాలంటీరు సర్వే అనంతరం కార్డు నిలిచిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఎవరైతే అర్హులై, నిబంధనల మేరకు ఉన్నా.. కార్డు కోల్పోయినట్లుగా సమాచారం అందుకుంటే.. అలాంటివారు సచివాలయంలో తమ కార్డును తిరిగి పునరుద్ధరించాలని దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కారణంతో కార్డు నిలుపుదల చేశారో.. అది తప్పని నిరూపించే ధ్రువీకరణ పత్రాలు జోడించాలి. సచివాలయ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలించి, కార్డును పునరుద్ధరిస్తారు.

* ఇవి కాకుండా కార్డుల్లో పేర్లు తప్పులు, ఇతర ప్రాంతాల నుంచి మార్పులు చేర్పులు వంటివి ప్రస్తుతానికి అధికారులు, ప్రభుత్వం చేయనప్పటికీ త్వరలోనే ఆయా సౌకర్యాలు అందుతాయని అధికారులు తెలియజేస్తున్నారు.

ఇదీ చదవండి:

అవసరానికి మించి అప్పు చేస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.