ETV Bharat / state

jagananna colonies : జగనన్న ‘జల’కాలనీలు..చినుకుపడితే చెరువులే

author img

By

Published : Jul 19, 2022, 4:11 AM IST

jagananna colonies : చిన్నపాటి వర్షానికే కొన్ని చోట్ల జగనన్నకాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోజుల తరబడి వాన నీరు నిలిచి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. రూ.కోట్లు పోసి మెరక పనులు చేసినా చాలాచోట్ల ఫలితం లేకుండా ఉంది.

జగనన్నకాలనీలు
జగనన్నకాలనీలు

jagananna colonies : చిన్నపాటి వర్షానికే కొన్ని చోట్ల జగనన్నకాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోజుల తరబడి వాన నీరు నిలిచి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. రూ.కోట్లు పోసి మెరక పనులు చేసినా చాలాచోట్ల ఫలితం లేకుండా ఉంది. కొన్ని లేఅవుట్లను మెరక చేయకుండానే వదిలేయడంతో ముంపునకు గురవుతున్నాయి. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాల్లో, చెరువు, కాలువలను ఆనుకుని ఉన్న స్థలాలు, పొలాల్లోనూ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చిరుజల్లులకే వాన నీరు చేరుతోంది.

రోజుల తరబడి నిల్వ ఉంటోంది. నాణ్యత లేకుండా నిర్మించిన అంతర్గత రహదారులు, కాలనీల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గ్రావెల్‌ రోడ్లు.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకముందే వాటి రూపు కోల్పోయి గుంతలమయంగా మారాయి. వర్షపు నీరు నిలుస్తుందని తెలిసీ కొన్ని ప్రాంతాల్లో రూ.కోట్లు పోసి భూమిని కొనుగోలు చేయడంపై అక్కడి ఉన్నతాధికారులే పెదవి విరుస్తున్నారు. గత వారం కురిసిన చిన్నపాటి వర్షాలకే జలమయమైన జగనన్న కాలనీలపై.. సచిత్ర కథనం.

మెరక చేసినా మునకే...

..

కృష్ణా జిల్లా బందరు నగర వాసులకు కేటాయించిన కరగ్రహారం లేఅవుట్‌ ఇది. ఇక్కడ సుమారు 16 వేల మందికి స్థలాలు కేటాయించారు. 300 ఎకరాల విస్తీర్ణం ఉన్న లేఅవుట్‌ను రూ.లక్షలు పోసి మెరక చేశారు. అయినా చిన్నపాటి వర్షం కురిసినా నీరు చేరి తటాకాన్ని తలపిస్తోంది. ఇక్కడ ఒక్క నిర్మాణమూ ప్రారంభం కాలేదు. జిల్లాలో చాలా లేఅవుట్లలో ఇదే పరిస్థితి.

వాన పడితే రహదారి మడుగే...

..

వర్షపు నీటితో నిండి చెరువును తలపిస్తున్న పొలాల మధ్య ఉన్న ఈ రహదారి పశ్చిమగోదావరి జిల్లా ఉండి ప్రాంతంలో జగనన్న కాలనీకి వెళ్లే ప్రధాన మార్గం. ఈ కాలనీకి చేరుకొనేందుకు పెడాయికోడు గట్టు నుంచి పొలాల మీదుగా రెండేళ్ల కిందట గ్రావెల్‌ రోడ్డు వేయగా వాహనాల తాకిడికి పూర్తిగా దెబ్బతింది. ఇటీవలి వర్షాలకు నీరు నిలిచి బురద కయ్యలా మారింది. నిర్మాణంలో ఉన్న ఇళ్ల వద్దకు నడిచి వెళ్లే దారే కనిపించడంలేదని, నిర్మాణ సామగ్రిని దూరంగా పెట్టుకోవాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.

చినుకు పడితే చెరువులే

ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలకే జగనన్న కాలనీల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి. కొన్ని చోట్ల లే అవుట్లు మెరక చేయకుండా వదిలేయడంతో ముంపునకు గురవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.

మెరక, చదునుకే రూ.1,700 కోట్లు: రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన జగనన్న కాలనీల్లో మెరక, చదును పనులు చేసేందుకే ప్రభుత్వం రూ.1,700 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇందులో ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కేటాయించిన రూ.1,100 కోట్లను వినియోగించింది. మరో రూ.400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా... ఇంకో రూ.200 కోట్ల వరకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో పేదల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిధుల్లో మెజారిటీ మొత్తాన్ని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే వినియోగించారు.

నీరు నిలుస్తుందని తెలిసీ...

..

నీటితో నిండిన పొలంలా కనిపిస్తున్న ఈ జగనన్న లేఅవుట్‌లో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతునిగూడెం, కృష్ణంపాలెం గ్రామాలకు చెందిన సుమారు 150 మందికి స్థలాలు కేటాయించారు. లేఅవుట్‌కు ఒక వైపు తాడిపూడి ఉపకాలువ, మరో వైపు చెరువు గట్టు ఉన్నాయి. కొద్దిపాటి వర్షం కురిసినా తటాకంలా మారుతోంది. రెండో విడతలో భాగంగా ఇక్కడి లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇటీవల ఇక్కడ పర్యటించిన కలెక్టర్‌... ఈ ప్రాంతంలో స్థలాలు ఎలా కేటాయించారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మరో చోట లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని ఆదేశించడం గమనార్హం.

కోట్లు కుమ్మరించినా జలమయమే..

..

ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి ప్రాంతంలో 17,070 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. దాదాపుగా 600పైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ లేఅవుట్‌ను మెరక చేసేందుకు సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. అయినా చినుకు పడితే జలమయమే. తాజాగా కురుస్తున్న వర్షాలకు లేఅవుట్‌లో ఎక్కడికక్కడ నీరు నిలిచింది. బీచ్‌రోడ్డు నుంచి లేఅవుట్‌కు వేసిన ప్రధాన రహదారి మినహా అంతర్గత రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఇక్కడ కాకినాడ నగరంలోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు.

ఇక్కడ ఇళ్లు కట్టేదెట్టా?

..

కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి, గోడితిప్ప పంచాయతీల్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం గోడి గ్రామంలో నాలుగు ఎకరాలను సేకరించారు. 143 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 24 మంది ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ లేఅవుట్‌లో నీరు చేరింది. రహదారి పూర్తిగా బురదమయమైంది. లబ్ధిదారులు లేఅవుట్‌లోకి వెళ్లలేని పరిస్థితి.

గోదావరి వరద ముంచెత్తింది..

..

పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి లంక గ్రామంలో 70 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రెండు ఎకరాలు కొబ్బరితోట సేకరించారు. ప్రస్తుతం ఈ లేఅవుట్‌ గోదావరి వరదలతో పూర్తిగా మునిగిపోయింది. వైనతేయ గోదావరి ఉప్పొంగితే తొలుత వరద చేరేది ఈ ప్రాంతానికే. ఇక్కడ ప్రస్తుతం నిర్మిస్తున్న ఆర్‌బీకే, వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణాలనూ ముంపు తాకింది. ఈ లేఅవుట్‌ ముంపు బారిన పడకుండా ఉండాలంటే కనీసం పది అడుగుల ఎత్తు పెంచాల్సిందే.

ఇవీ చదవండి: కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన ఆటో.. అక్కడికక్కడే ఐదుగురు మృతి

రెండు వారాల్లోగా ఆ నిధులు వెనక్కి ఇవ్వాలి.. ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.